iDreamPost
iDreamPost
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని కొంతలో కొంత కాపాడింది విశాఖ ప్రాంతమే. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చే ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల టీడీపీ విజయం సాధించగా మిగిలిన గాజువాక, భీమిలి, పెందుర్తి, అనకాపల్లి స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. విశాఖ నగర శివారులో ఉన్న పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పొరుతో పార్టీ కోలుకోలేకపోతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి మధ్య మొదటి నుంచీ ఉన్న విభేదాలు మళ్లీ రాజుకుంటున్నాయి. మొదట్లో వేర్వేరు పార్టీల్లో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. అయితే ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న సామెతను గుర్తు చేస్తూ వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదంటే.. నాదేనంటూ సిగపట్లు పడుతున్నారు. వ్యవహారం అధిష్టానం వరకూ వెళ్లినా ఎవరికి వారు పట్టుదలకు పోతుండటంతో ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక పార్టీ అధినేత తల పట్టుకుంటున్నారు.
నాడు పరవాడలో.. నేడు పెందుర్తిలో..
వాస్తవానికి బండారు, గండి బాబ్జీ ఒకప్పటి పరవాడ నియోజకవర్గానికి చెందినవారు. బండారు సత్యనారాయణ 1989, 1994, 1999 ఎన్నికల్లో అక్కడి నుంచే టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. అదే ప్రాంతానికి చెందిన గండి బాబ్జి మాజీమంత్రి కొణతాల రామకృష్ణ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బండారును ఓడించారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో పరవాడ నియోజకవర్గం పెందుర్తిలో విలీనం కావడంతో వీరిద్దరి రాజకీయం అక్కడికి మారింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి పోటీ చేసిన వీరిద్దరూ ఓడిపోయి ప్రజారాజ్యం అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో మళ్లీ బండారు టీడీపీ తరఫున పోటీ చేయగా గండి బాబ్జి వైఎస్సార్సీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అనంతర పరిణామాల్లో బాబ్జి టీడీపీలో చేరడంతో ఒకే పార్టీలో రెండు కుంపట్లు ఉన్నట్లు అయ్యింది. బాబ్జి చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన బండారును అధిష్టానం నేతలు ఒప్పించి సర్దుబాటు చేశారు. 2019 ఎన్నికల్లో బండారుకే టికెట్ ఇచ్చినా ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి అదీప్ రాజ్ చేతిలో ఓడిపోయారు.
మళ్లీ పంచాయితీ మొదలు
ఎన్నికల అనంతరం వీరిద్దరూ వర్గాలుగానే కొనసాగారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు అధిష్టానం నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమిస్తూ.. వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న సంకేతాలు ఇస్తుండటంతో బండారు, బాబ్జీల మధ్య మళ్లీ పోరు మొదలైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తనకే టికెట్ వస్తుందని బండారు భావిస్తుండగా.. ఈసారి పార్టీ తనకే అవకాశం ఇస్తుందని బాబ్జీ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన అనుచరవర్గం ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ఊదరగొడుతున్నారు. ఈ విషయం అధిష్టానం వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో.. ఒకరికి పెందుర్తి, ఇంకొకరికి వేరే నియోజకవర్గం ఇస్తామని రాజీసూత్రం ప్రతిపాదించిన ఇద్దరూ ససేమిరా అంటున్నారు. పెందుర్తి కోసమే పట్టుబడుతున్నారు. దాంతో ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక పార్టీ అధినేత చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.
Also Read : Yanamala Ramakrishnudu – యనమల వెళ్లిపోతున్నారు, స్థానభ్రంశం అనివార్యం అంటున్న అనుచరులు