పుంగనూరు నియోజకవర్గం… పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, రొంపిచెర్ల మండలాలు.. మొత్తం 85 పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 848 వార్డులు.. అన్నీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే. అంతటా ఏకగ్రీవమే. పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏకగ్రీవాలు సాధారణమే కానీ ఆ స్థాయిలో జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి అయినప్పటికీ స్థానిక ప్రజలకు పెద్దిరెడ్డి అందుబాటులో ఉంటుండడం, సీఎం జగన్ సంక్షేమ రాజ్యంతో ఆ ప్రాంతమంతా వైసీపీ మద్దతుదారులకు జై కొట్టింది. ఈ విషయాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం జీర్ణించుకోలేకపోతోంది. ఏం చేయాలో.ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తోంది. రాద్దాంతం చేసేందుకు దారులను వెదుకుతోంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం మొదలైనప్పటి నుంచీ ప్రతిపక్షాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అన్ని చోట్లా నామినేషన్ల దాఖలు చేయించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కలవరాని వారందరూ ముఠాగా ఏర్పడుతున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు వైసీపీ మద్దతుదారుల వైపే నిలుస్తుండడంతో ఏమీ అర్థం కావడం లేదు. పార్టీ గుర్తు రహిత ఎన్నికలు కావడాన్ని ఆసరాగా చేసుకుని ఇతర పార్టీ మద్దతుదారులను కూడా తమ వాళ్లుగా చెప్పుకుంటూ పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
విపక్షాల పప్పులుడక కుండా అధికార పార్టీ ఎక్కడికక్కడ సంఖ్యలతో, ఫొటోలతో సహా తమ వారెవరో, పరాయివారెవరో చాటి చెబుతోంది. తొలివిడతలో 3,244 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. వాటిలో 2637 చోట్ల వైసీపీ మద్దతుదారులే గెలిచారు. కేవలం 508 స్థానాల్లో తెలుగుదేశం మద్దతుదారులు గెలుపొందారు. ఆ ఫలితాలు వెల్లడైనప్పటి నుంచీ టీడీపీలో కలవరం మొదలవ్వగా రెండో దశ పంచాయతీల్లోని ఏకగ్రీవాల్లోనూ అధిక సంఖ్యలో వైసీపీవే కావడం మరింత ఆందోళనకు గురి చేసింది. ఇదంతా ఒక ఎత్తయితే.. పుంగనూరు నియోజకవర్గంలో వారికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఆ నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లోనూ వైసీపీ మద్దతుదారులంతా ఏకగ్రీవంగా గెలుపొందినట్లు అఽధికారులు ప్రకటించారు. దీంతో తెలుగుదేశం నేతలు కిరికిరిలు మొదలుపెడుతున్నారు. ఫిర్యాదుల పర్వానికి తెరతీస్తున్నారు. అయినప్పటికీ అధికారుల పరిశీలనలో ఎక్కడా పొరపాట్లు జరిగిట్లు వెల్లడి కాకపోవడం వారికి మింగుడు పడడం లేదు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు సహా స్థానిక నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ మంత్రిని ఇంటికే పరిమితం చేయాలని ఎస్‌ఈసీ డీజీపీని ఆదేశించడం, చివరికి హైకోర్టులో పెద్దిరెడ్డి విజయం సాధించడం తెలిసిందే. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పుంగనూరులో ప్రజలు అధికార పార్టీకే పట్టం కట్టారు.