iDreamPost
android-app
ios-app

Payyavula,Debts- అప్పుల వసూళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ రాష్ట్రానికి వెళుతుందా

  • Published Nov 17, 2021 | 3:07 AM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Payyavula,Debts- అప్పుల వసూళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ రాష్ట్రానికి వెళుతుందా

కొంతకాలం క్రితం వారం వారం వడ్డీల వాళ్లు ఇంటింటికీ వచ్చి వసూలు చేసుకునే సంస్కృతి గ్రామాల్లో ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు అది ఏకంగా కేంద్ర ప్రభుత్వం వరకూ వచ్చేసిందని ఆంధ్రజ్యోతి సూత్రీకరణ. ఆశ్చర్యంగా అప్పుల వసూళ్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులు ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేయడం, దానిని ఆంధ్రజ్యోతి అందిపుచ్చుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. కానీ వారి అసలు నైజం బయటపెడుతోంది. నిజంగా పయ్యావుల కేశవ్ అన్నట్టుగాగా అప్పుల గురించే కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏపీకి వస్తుంటే ఆ అప్పులకు అసలు కారణం తమ ప్రభుత్వమే కదా అన్నది మరచిపోతే ఎలా. గడిచిన ఐదేళ్లలో చేసిన అప్పుల గురించే అనుకుంటే అందులో మూడొంతుల పాపం చంద్రబాబుదే అవుతుంది కదా. రెండున్నరేళ్ల జగన్ పాలనలోనే కాకుండా చంద్రబాబు హయంలో చేసిన అప్పుల మూలంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుందన్న సంగతి విస్మరిస్తే ఎలా..

ఒకవేళ నిజంగానే పయ్యావుల కేశవ్ రాజకీయ ప్రయోజనాల కోసమే అలాంటి వ్యాఖ్యలు చేశారే అనుకో.. ఆంధ్రజ్యోతి కూడా అంతకుమించి అడ్డగోలుగా రాయడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ వారు అసలు స్వరూపం అదేనని మారోసారి చాటుతున్న వైనమిది. నిజానికి ప్రతీ రాష్ట్రానికి వెళ్లి అప్పులు వసూలు చేసుకునే పరిస్థితి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. నిజంగా అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితికి మించినా, ఇతర పక్కదారులు పట్టినా దానిని నియంత్రించే విధానం వేరుగా ఉంటుంది. ఎఫ్ ఆర్ ఎం బీలో పరిమితికి మించకుండా నియంత్రించడం, ఇతర పద్ధతుల్లో అప్పులు చేయకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పూనుకుంటారు. కొత్తగా తీసుకునే అప్పుల్లో మినహాయింపులు కూడా చేసుకుంటారు. అంతే తప్ప మా అప్పులు చెల్లించండి అంటూ ఊరూరా తిరిగే పరిస్థితి ఎక్కడా ఉండదు. కానీ ఆంధ్రజ్యోతి, పయ్యావుల కేశవ్ వంటి వారు మాత్రం ఏదో జరుగుతోందనే రీతిలో ప్రచారానికి పూనుకుంటారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల సీఎండీలు రావడానికి కారణాలు వేరు. వారి పర్యటనకు సంబంధించిన వివరాలు వేరు. అవన్నీ అధికారికంగానే ప్రకటించారు. సమీక్షలు, సీఎస్ తో భేటీలు నిర్వహించబోతున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఋణం మంజూరు విషయమై ఆరా తీయబోతున్నారు. అయినా గానీ వాటిని విస్మరించి విష ప్రచారానికి పూనుకుంటున్నారు. జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్న తీరు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అదే క్రమంలో తమ పరువు కూడా బజారుపడుతున్నా పట్టించుకోకపోవడమే పచ్చ మీడియా పరిస్థితికి తార్కాణం.