వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించేలా వాట్సాప్ నూతన మార్గదర్శకాలను ప్రతిపాదించింది. అందులో భాగంగా యూజర్ల వ్యక్తిగత డేటాను ఫేస్‌బుక్‌తోపాటు ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో వాడుకుంటామని వాట్సాప్ ప్రకటించింది. తమ నూతన మార్గదర్శకాలకు అంగీకరించకపోతే అప్లికేషన్ పనిచేయదని వాట్సాప్ వెల్లడించింది. కాగా వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ పట్ల పలువురు బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తూ వాట్సాప్ విధానాలను దుయ్యబడుతున్నారు..
దీంతో వాట్సాప్ వాడటం మానేసి వాట్సాప్ కంటే ఎక్కువ సెక్యూరిటీ, ప్రైవసీని అందిస్తున్న సిగ్నల్ అప్లికేషన్‌కు అందరూ మారాలని ప్రముఖ అమెరికన్ కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్ తో సిగ్నల్ యాప్ డౌన్లోడ్స్ అమాంతం పెరిగాయి. దీంతో సిగ్నల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ట్రెండింగ్ లో నిలవడం గమనార్హం.
తాజాగా పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కూడా వాట్సాప్ ఫేస్‌బుక్ విధానాలపై విరుచుకుపడ్డారు. యూజర్ల ప్రైవసీ విషయంలో ఈ రెండు అప్లికేషన్లు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.యూజర్లు వాట్సాప్ నుండి సిగ్నల్ యాప్ కు మారాలని,యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వాడుకోవాలనుకుంటున్న వాట్సాప్ ఫేస్‌బుక్ లకు బుద్ధి చెప్పాలని సూచించారు. కాగా వాట్సాప్ ప్రతిపాదించిన నూతన విధానాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో బాయ్ కాట్ వాట్సాప్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.