iDreamPost
iDreamPost
బాలీవుడ్ లో పే పర్ వ్యూ మోడల్ లో విడుదలైన మొదటి సినిమాగా జీ ప్లెక్స్ విడుదల చేసిన ఖాలీ పీలి పేరుకు తగ్గ ఫలితాన్నే అందుకుంది. వీక్షకులు షాక్ అయ్యేలా ఏకంగా 299 రూపాయలు టికెట్ ధర పెట్టిన జీ సంస్థ దానికి తగ్గట్టే గట్టి విమర్శలనే మూటగట్టుకుంటోంది. కారణం మూవీలో ఉన్న వీక్ కంటెంట్. డబ్బు కోసం ఏదైనా చేసే ఓ ట్యాక్సీ డ్రైవర్ కు, వేశ్యా గృహం నుంచి బోలెడు క్యాష్ పోగేసుకుని పారిపోయిన ఓ 18 ఏళ్ళ అమ్మాయి మధ్య జర్నీగా దర్శకుడు మక్బూల్ ఖాన్ చేసిన ఈ ప్రయోగం ఎప్పుడో 80 దశకం నాటి స్క్రీన్ ప్లేతో విసుగు తెప్పించేసింది. ఇలాంటి ఫేడ్ అవుట్ మసాలా కథలు సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు చేస్తే ఆడియన్స్ పోనిలే అని చూస్తారు కానీ ఇషాన్ ఖట్టర్ లాంటి అప్ కమింగ్ హీరోతో చేస్తే నో అనకుండా ఉంటారా. హీరోయిన్ అనన్య పాండే మేజిక్ పెద్దగా పనిచేయలేదు. ఈ కాంబో మీద పెద్దగా అంచనాలు ఎవరూ పెట్టుకోలేదు.
ఇప్పుడు అదే జరిగింది. ఇద్దరు చిన్ననాటి స్కూల్ స్నేహతులు బాల్యంలోనే విడిపోయి పెద్దయ్యాక ఇలాంటి అనూహ్యమైన పరిస్థితుల్లో కలుసుకోవడం అనే పాయింట్ వినడానికి బాగున్నప్పటికీ తెరమీదకు వచ్చేటప్పటికి పూర్తిగా తేడా కొట్టేసింది. అర్థం లేని ఛేజులు, అరిగిపోయిన ఫార్ములా ఎపిసోడ్లతో ఫ్రీగా చూస్తేనే కష్టమనిపించే ఇలాంటి సినిమాకు థియేటర్ టికెట్ కన్నా రెట్టింపు సొమ్ము వసూలుచేయాలనుకున్న ప్లాన్ మొత్తంగా రివర్స్ అయ్యింది. దీన్ని వంద రూపాయలు పెట్టి హాల్లో చూడటమే వేస్ట్ అలాంటిది ఇంత ఛార్జ్ చేస్తారా అని టెంప్ట్ అయి చూసినవాళ్ల ఫిర్యాదు. క్రిటిక్స్ సైతం గట్టిగా క్లాస్ తీసుకున్నారు. సడక్ 2 తర్వాత ఆ స్థాయిలో డిజ్ లైకులు వచ్చిన ట్రైలర్ గా ఖాలీ పీలి మీద ఇప్పటికే ఓ రికార్డు ఉంది. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ కూడా దానికి తగ్గట్టే ఉండటంతో ఇకపై రేట్లు డిసైడ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. నిజానికి జీ ప్లెక్స్ ఈ స్ట్రాటజీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది.
వెయ్యి రూపాయలు పెట్టి థియేటర్లో ఫామిలీతో సినిమాలు చూసే ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చుని ఆనందించేందుకు 300 ఖర్చు చేయరా అనే అంచనా పూర్తిగా తప్పింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం వ్యూస్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. ఇదే షాక్ అనుకుంటే స్ట్రీమింగ్ జరిగిన చాలా తక్కువ సమయంలోనే టొరెంట్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో హెచ్డి వెర్షన్ వచ్చేయడంతో కొంతసేపు వెయిట్ చేసిన మూవీ బఫ్స్ ఫ్రీగా చూసేశారు. ఒకవేళ టికెట్ రేట్ రీజనబుల్ పెట్టి ఉంటే ప్రోత్సహించేందుకైనా కొందరు చూసేవాళ్ళేమో. అది జరగకపోవడంతో పైరసీ మార్గం పట్టారు. మరోవైపు 199 టికెట్ పెట్టిన తమిళ సినిమా కెపే రణసింగం రిపోర్ట్స్ బానే ఉన్నాయి కానీ 199 రూపాయలు భారమే అంటున్నారు. దాని రివ్యూ మరో సందర్భంలో చూద్దాం. ఏదైతేనేం ఖాలీ పీలి టైటిల్ ని సార్ధకం చేస్తూ ప్రేక్షకుల జేబుని మైండ్ ని రెండింటిని ఖాళీ చేసింది