జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. నిర్మాత చెప్పినట్లు… నిన్ననే విడుదలైన భీమ్లా నాయక్ టీజర్ ఫాన్స్ కు నిజంగానే పూనకాలు తెప్పించింది. కథానాయకుడిగా ఆకట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్న పవన్.. నాయకుడిగా ప్రజలను ఆకట్టుకునేందుకు ఎంత వరకు శ్రమిస్తున్నారనేదే ప్రశ్న. ప్రశ్నించడానికే పార్టీ పెట్టినట్లు ప్రకటించిన జనసేనాని.. ప్రభుత్వాలను ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడల్లా అంతగా గొంతెత్తలేకపోతున్నారు. సమస్య సద్దుమణుగుతున్న క్రమంలో ఆవేశపడుతున్నారు తప్ప.. సమస్య ఉధృతంగా ఉన్న వేళ పట్టించుకోవడం లేదనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలపైనా పవన్ పంథా అలాగే ఉంది. సెన్సిటివ్ విషయాలని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు పవన్ పై ఉన్నాయి.
సినిమా షూటింగ్‌లు లేని సమయంలో, స్వాత్రంత్యం, రిపబ్లిక్ దినోత్సవం కార్యక్రమాల వేళో.. ఆయన ఓ ట్వీటో, మరొకటో చేస్తూ…తాను కూడా రాజకీయాల్లో ఉన్నానంటూ, ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జగన్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రజాధనంతో నిర్వహించే పథకాలకు సొంత పేర్లు ఏంటని జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు లాంటి జాతీయ నేతల పేర్లు పెడతామని పవన్ ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాజకీయ నేతలంటే పేకాట క్లబ్బులు నడిపేవారు.. సూట్ కేస్ కంపెనీలు పెట్టి రూ.కోట్లు దోచుకునే వారు కాదని పరోక్షంగా జగన్‌తో పాటు వైసీపీ నేతలను విమర్శించారు.
తాను అధికారంలోకి వస్తే జాతీయ నాయకుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతానని ప్రకటించడం వరకూ అంతా బాగుంది. కానీ అధికారంలోకి రావడం ఎట్లా? అనేది పెద్ద ప్రశ్న. ముందు అధికారంలోకి రావడానికి ఏం చేయాలో ఆలోచిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా షూటింగ్‌ల్లో నిమగ్నమై ఉంటే ప్రజలు ఎప్పటికీ ఆదరించరని వారు హితవు చెబుతున్నారు. బీజేపీతో జత కట్టిన పవన్ సొంతంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా, పోనీ.. బీజేపీతో అయినా కలిసి పొత్తు ధర్మం ప్రకారం అన్ని కార్యక్రమాలూ చేస్తున్నారా.. అంటే అవునని చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి రాజకీయాలు చేస్తున్న పవన్ అధికార పార్టీని మాత్రం విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారా అనేది పవన్ ఆలోచించాలి. సంక్షేమ పథకాల అమలులో ప్రజల్లో పేరు పొందుతున్న జగన్ కు పేర్లు పెట్టడం మాత్రమే కాకుండా, పార్టీని అధికారంలోకి తెచ్చే దారులను కూడా వెదికితే మంచిదనే అభిప్రాయాలను పలువురు వెలిబుచ్చుతున్నారు.