విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో ఒక భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. విశాఖ నుంచే ఆయన పోటీ చేశారు, ఒక వేళ అక్కడి నుంచి పోటీ చేయకున్నా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన దేనికైనా, ఎవరికైనా అండగా నిలబడే అవకాశం ఉంది. అయితే ఆ సభలో పవన్ కళ్యాణ్ తీరు చర్చనీయాంశమవుతోంది. విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ సమీపంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతున్న వారికి జనసేన మద్దతు ఉంటుందని ప్రకటించారు.
అంతే కాక ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకొనేందుకు ఏం చేస్తారో వారం రోజుల్లో ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దానికోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్న పవన్ అది చేయక పోతే వచ్చే రెండేళ్ల పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లాల వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లాలని ఆయన కార్మిక సంఘాలను కోరారు. అప్పుడు ఈ ఉద్యమం వెనుక తాను అండగా ఉంటానని ఆయన హమీ ఇచ్చారు. మనందరం కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని, ప్రత్యేక హోదా ఉద్యమం కూడా ఎవరూ కలిసి రాకపోవడం వల్లే వదిలేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
అయితే పవన్ మొత్తం 50 నిమిషాల ప్రసంగంలో వైసీపీని విమర్శించేందుకు, ఇదంతా వైసీపీ పనే అని జనాన్ని నమ్మించడానికి చూశారు తప్ప అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పట్టుబడుతున్న కేంద్రం పైన కానీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పైన కానీ బీజేపీ నాయకులపైన కానీ ఒక్క మాట కూడా ఎందుకు అనలేదో? ఎందుకు ప్రశ్నించలేదో ? ఆయనకే ఎరుక. అలాగే విశాఖ ఎంపీ సహా వైసీపీ ఎంపీలు ఎవరూ పార్లమెంటులో ఉక్కు ప్రైవేటీకరణపై గట్టిగా నిలదీయలేదని పవన్ విమర్శించారు. నాకు ప్రజాబలం ఉందనే కేంద్ర మంత్రి అమిత్ షా తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయని.. తనకు ఎవరు అయినా.. అప్పాయింట్‌మెంట్లు ఇస్తున్నారని బీరాలు పలుకుతున్న పవన్ కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారో మరి? వాళ్ళ దగ్గరకు వెళ్లి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని ఎందుకు అడగలేక పోతున్నారో?
అంతే కాక వైసీపీ ప్రభుత్వానికి విశాఖ ఉక్కు పరిరక్షణకోసం.. వారం రోజుల్లో అఖిల పక్షాన్ని పిలవాలని.. దీనిపై ప్రకటన చేయాలని వైసీపీ సర్కారును డిమాండ్ చేయడం బాగానే ఉంది కానీ అసలు ఈ విషయంలో రాసింది చదవడం కాకుండా? పవన్ కు ఉన్న పరిజ్ఞానం ఎంత? దీని గురించి పవన్ ఇప్పటి వరకు చేసింది ఏంటి? అనే అనుమానం పవన్ ప్రసంగం విన్నాక కలుగక మానదు. పవన్ వైసీపీ నాయకులను నిందించడానికి విశాఖ వచ్చినట్టు ఉందే తప్ప స్టీల్ ప్లాంట్ కోసం కాదు. నెలలు గా విశాఖ ఉక్కు కోసం ఉద్యమాల జరుగుతుంటే పవన్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అంటే పవన్ ఏం చెబుతారో మరి. పవన్ కు నిజంగా చిత్త శుద్ది ఉంటే ఢిల్లీ లో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చెయ్యాలి కానీ వైసీపీ మీద విరుచుకు పడితే ఏం ఉపయోగం?