iDreamPost
android-app
ios-app

దూకుడు మీదున్న పవర్ స్టార్

  • Published Aug 31, 2020 | 7:39 AM Updated Updated Aug 31, 2020 | 7:39 AM
దూకుడు మీదున్న పవర్ స్టార్

అజ్ఞాతవాసి తర్వాత సినిమాలు చేయకుండా పూర్తిగా రాజకీయాలకే అంకితమవుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ మాట మీద ఉండలేకపోవడానికి కారణాలు ఏమైనా అది అభిమానులకు మాత్రం గుడ్ న్యూస్ గానే నిలిచింది. వరసగా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్న తమ హీరోను చూసి రాబోయే రెండు మూడేళ్ళలో కొత్త రికార్డులు చూడటం ఖాయమని అప్పుడే ఫిక్స్ అయిపోతున్నారు. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్లే ఒక సినిమా తర్వాత మరొకటి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం కాంబినేషన్లతో వసూళ్లు వచ్చే రోజులు కావివి. కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు.

ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ బ్యాలన్స్ పూర్తి చేయాల్సి ఉంది. అది సెప్టెంబర్ లోనా లేక ఇంకా లేటా అనేది నిర్మాత దిల్ రాజు కూడా చెప్పలేరు. మరోవైపు కరోనా నిబంధనల వల్ల భారీ కాన్వాస్ తో రూపొందాల్సిన క్రిష్ మూవీని తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టారు. వచ్చే జనవరి నుంచి కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు హరీష్ శంకర్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. గబ్బర్ సింగ్ దర్శకుడు కాబట్టి అంచనాలు ఈపాటికే ఎక్కడికో వెళ్లిపోయాయి. వీటికే టైం సరిపోతుందా అని ఆలోచిస్తుంటే తాజాగా పవన్ 29వ సినిమా కోసం సురేందర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. నిన్న బండ్ల గణేష్ సైతం ఈ వార్త క్లిప్పింగ్ ని షేర్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పడం గమనించాల్సిన విషయం. సో ఈ కాంబినేషన్ కూడా ఉన్నట్టే అని అర్థమైపోయింది.రామ్ తాళ్ళూరి నిర్మాతగా వ్యవహరిస్తారట.

పవన్ ఈయనకు ఎప్పటినుంచో కమిట్ మెంట్ బాకీ ఉన్నారు. ఈ లెక్కన నాలుగు సినిమాలు పూర్తయిపోయి రిలీజ్ అయ్యేలోపు ఎంతలేదన్నా మూడు నాలుగేళ్లు ఈజీగా గడిచిపోతాయి. ఆలోగా మళ్ళీ ఎన్నికల సందడి మొదలవుతుంది. అప్పుడు బ్రేక్ ఇస్తారా లేక 30వ సినిమాను కూడా ఈలోగా ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి. మొత్తానికి పవర్ స్టార్ గతంలో ఎన్నడూ లేనంత దూకుడుగా సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న మాట వాస్తవం. ఇప్పుడివన్నీ పూర్తి చేయాలంటేనే నాన్ స్టాప్ గా షూటింగులు చేయాల్సి ఉంటుంది. కాకపోతే విడుదల తేదీలు మాత్రం ఆయా నిర్మాతల చేతుల్లో ఉండే అవకాశాలు తక్కువ. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా కీలకమైన ప్రకటనలు ఉంటాయని ఇప్పటికే టాక్ ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి