iDreamPost
android-app
ios-app

ఇవేం డ్రామాలు పవన్?

  • Published Jul 08, 2021 | 5:17 AM Updated Updated Jul 08, 2021 | 5:17 AM
ఇవేం డ్రామాలు పవన్?

ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టుల నీటి వాటాలు, విద్యుత్ ఉత్పత్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాలు, నెలకొన్న ఉద్రిక్తతలు డ్రామాలేనట! .. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అలాగే కనిపిస్తున్నాయట. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే, దాన్ని అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి.. ఆ వివాదాన్ని ఇద్దరు సీఎంలు ఆడుతున్న డ్రామాగా ఆయన చూడటం.. తేలిగ్గా మాట్లాడటం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో తేటతెల్లం చేస్తోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన పవన్.. నీటి వివాదంపై తొలిసారి స్పందించారు. అయితే రోజుల తరబడి కొనసాగుతున్న ఈ వివాదంపై తమ పార్టీ విధానమేమిటో ప్రకటించకుండా డ్రామాగా అభివర్ణించడం దారుణం. సాగునీటి ప్రాజెక్టులు, నీటివాటాలపై.. తీరిగ్గా నిపుణులతో చర్చించి తర్వాత ఎప్పుడో విధానం ప్రకటిస్తారట. పార్టీ పీఏసీ సమావేశం అనంతరం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఆయనగారి పార్ట్ టైం రాజకీయాలకు తగినట్లే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవేవీ కనిపించలేదా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా బేసిన్ లో నిర్మించిన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో రెండుగా విడిపోయిన ఆంధ్ర, తెలంగాణలకు సాగు నీరు, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి నిర్దిష్ట కేటాయింపులు జరిపి.. పర్యవేక్షణకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ ఎంబీ) ని నియమించారు. నికర మిగులు జలాలపై ఆంధ్రకు హక్కు కల్పించారు. ఆ హక్కుతోనే ఆంధ్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టింది. దాన్ని ఆపించేందుకు అడ్డగోలుగా ప్రయత్నిస్తున్న తెలంగాణ.. మరోవైపు శ్రీశైలం, పులిచింతల జలాశయాల్లో నిర్దిష్ట నీటిమట్టాలు లేకుండానే పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి.. యథేచ్ఛగా నీటిని తోడేస్తోంది. దీనివల్ల వ్యవసాయానికి అందాల్సిన నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల సరిహద్దులో.. ఆయా ప్రాజెక్టుల వద్ద మన అధికారులను అడ్డుకోవడం, బలగాల మోహరింపుతో గత 15, 20 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలంగాణ నీటి దోపిడీని అడ్డుకోవాలని కేఆర్ ఎంబీకి, ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు సీఎం జగన్ పలుమార్లు లేఖలు రాశారు. క్షేత్రస్థాయిలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా.. పవన్ కళ్లకు డ్రామాలుగానే కనిపిస్తున్నాయంటే.. ప్రాణాధారమైన ప్రాజెక్టుల విషయంలో ఆయన దృష్టి కోణం అదేనేమో. మరోవైపు వివాదం ఇప్పుడు జరుగుతుంటే.. ప్రజల పక్షాన, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవకపోగా.. నిపుణులతో చర్చించి తీరిగ్గా విధానం ప్రకటిస్తామనడం ఆయన సమస్యను ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో అర్థమవుతుంది.

చిరంజీవి చేసిన మంత్రి పదవి పవన్కు చిన్నదట

రాజుకు తగ్గ బంటు అన్నట్లు జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు ఉన్నాయి. జనసేనాని పవన్ కు కేంద్రంలో మంత్రిని చేస్తారన్న ఊహాగానాలు ఆ మధ్య విపరీతంగా వినిపించాయి. దీనిపై రెండు రోజుల క్రితం నాదెండ్ల ఇచ్చిన క్లారిటీ ఆకాశానికి నిచ్చెనలు వేసే స్థాయిలో ఉంది. ‘పవన్ లక్ష్యాలు వేరు. ఆయన సమాజ మార్పు కోసం పోరాడుతున్నారు. కేంద్ర మంత్రి పదవి ఆయన స్థాయికి చాలా చిన్నది. అందుకే దాన్ని మేం తీసుకోవడం లేదు’ అని నాదెండ్ల వ్యాఖ్యానించారు. పవన్ ఎంపీ కారు.. కనీసం ఎమ్మెల్యేగానూ గెలవలేకపోయారు. అలాంటి నేతను కేంద్రమంత్రి పదవి ఇస్తామని ఎన్డీయే నేతలు ఆఫర్ చేసిన దాఖలాల్లేవు. కేవలం ప్రచారాన్ని పట్టుకొని నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు అతిగా కనిపించాయి. గతంలో పవన్ అన్నయ్య చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి.. నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేరారు. అన్న చేసిన మంత్రి పదవి తమ్ముడు పవన్ కు చాలా చిన్నది అనడం ఆ పదవిని కించపరిచినట్లా.. చిరంజీవి స్థాయిని దిగజార్చడమా.. నాదెండ్ల వారే వివరణ ఇవ్వాలి.

Also Read : మా రైతుల ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం క‌లుగుతోంది : ప్రధానికి జగన్ మరో లేఖ..