iDreamPost
android-app
ios-app

పవర్ స్టార్ టైంకి రావడం కష్టమే

  • Published Jun 06, 2021 | 5:53 AM Updated Updated Jun 06, 2021 | 5:53 AM
పవర్ స్టార్ టైంకి రావడం కష్టమే

కరోనా సెకండ్ వేవ్ దెబ్బ మాములుగా లేవు. గత ఏడాది గాయాల నుంచి మెల్లగా కోలుకుంటున్న పరిశ్రమకు మరోసారి శరాఘాతం తగిలింది. థియేటర్లు షూటింగులు అన్నీ మూతబడి ఇప్పటికి నలభై రోజులు అయ్యింది. త్వరలో ఆంక్షలు సడలించబోతున్నారు. అయితే ఈ గ్యాప్ వల్ల ఇబ్బంది పడి నష్టపోని వారు ఎవరూ లేరన్నది వాస్తవం. ముఖ్యంగా నిర్మాతలు పడుతున్న బాధలు అన్ని ఇన్ని కావు. ఎన్నికల్లో జనసేన వైఫల్యం తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని సినిమాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ ప్లానింగ్ మీద కూడా ఇది తీవ్రంగా పడింది. వేగంగా చేస్తూ ఏడాదికి రెండు రిలీజులు ఉండేలా వేసుకున్న ప్రణాళిక మొత్తం తారుమారు అయ్యేలా ఉంది.

ప్రస్తుతం రెండు సినిమాలు సెట్ల మీద ఉన్నాయి. ఒకటి అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్. ఇది నలభై శాతం దాకా పూర్తయ్యింది. అంతా సవ్యంగా ఉండి ఉంటే సెప్టెంబర్ రిలీజ్ కు ముందే ఫిక్స్ అయ్యారు. కాకపోతే డేట్ అనౌన్స్ చేయలేదు అంతే. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే షూటింగ్ ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చి బయట పడిన నేపథ్యంలో ఆగష్టు దాకా పవన్ సెట్లోకి రాకూడదని డిసైడ్ అయినట్టుగా సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. అదే జరిగితే డిసెంబర్ లోగా రిలీజ్ కావడం అసాధ్యం. అప్పుడు దీని ఎఫెక్ట్ నేరుగా హరిహర వీరమల్లు మీద పడుతుంది.

ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాని 2022 సంక్రాంతికి ముందే లాక్ చేశారు. కానీ ఇప్పుడు సాధ్యాసాధ్యాలు దాదాపుగా తగ్గిపోయాయి. అందులోనూ ఆర్ఆర్ఆర్ కనక అక్టోబర్ లో రాకపోతే వచ్చే ఏడాది జనవరి స్లాట్ ని అది తీసుకుంటుంది. అదే జరిగితే సర్కారు వారి పాట తో సహా మిగిలిన వాళ్ళు అంత ఈజీగా రిస్క్ తీసుకోలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే థర్డ్ వేవ్ గురించిన వార్తలు కొంత ఖంగారు పెడుతున్నాయి. ఇంకో మూడు నెలల్లో దేశం మొత్తం అధిక శాతం వ్యాక్సినేషన్ పూర్తవుతుందని వినిపిస్తున్న నేపథ్యంలో అంతా మంచే జరగాలని కోరుకుందాం