iDreamPost
android-app
ios-app

పోలీస్ గా పవన్ కళ్యాణ్ – అధికారిక ప్రకటన

  • Published Oct 25, 2020 | 5:28 AM Updated Updated Oct 25, 2020 | 5:28 AM
పోలీస్ గా పవన్ కళ్యాణ్ – అధికారిక ప్రకటన

ఇప్పటికే వరసగా కొత్త సినిమాల ప్రకటనలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో సిద్ధమయ్యారు. సితార బ్యానర్ పై రూపొందబోయే ప్రొడక్షన్ నెంబర్ 12లో పవన్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇది మలయాళం బ్లాక్ బస్టర్ అయ్యప్పనుం కోశియం రీమేక్ గా ముందు నుంచే ప్రచారంలో ఉంది. ఇప్పుడు వదిలిన వీడియోలో దాన్ని ప్రస్తావించలేదు కానీ ఎప్పుడో హక్కులు కొని ఆ పని మీదే ఉన్నారు కాబట్టి వేరేది అయ్యే ఛాన్స్ లేదు. ఒరిజినల్ వెర్షన్ లో బిజూ మీనన్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఇది చాలా పేరు తీసుకొచ్చింది.

తనను అవమానించి డిపార్ట్మెంట్ లో సస్పెన్షన్ కు గురయ్యేలా చేసిన పృథ్విరాజ్ మీద ప్రతీకారం తీర్చుకునే ఈగోయిస్ట్ పాత్రలో బిజూ కెరీర్ బెస్ట్ ఇచ్చారు. పవన్ పోలీస్ అంటే ఈ క్యారెక్టర్ లోనే కనిపించాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పవన్ చేస్తే ఆటోమేటిక్ గా కొన్ని కీలక మార్పులు ఉంటాయి. అయితే ఇంకొ హీరో ఎవరనే క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. రవితేజ,రానా రెండు పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎవరనేది ఇప్పట్లో రివీల్ చేసేలా లేరు. ఇప్పటికే నాలుగు ప్రాజెక్టుకు కమిటైన పవన్ ఇప్పుడు మరొకటి ఒప్పుకోవడం చూస్తే అసలు వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారా అనే సందేహం కలగడం సహజం.

దీనికి టెక్నికల్ టీమ్ ని కూడా అనౌన్స్ చేశారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కు మరోసారి మ్యూజిక్ ఇచ్చే అవకాశాన్ని తమన్ దక్కించుకున్నారు. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం అందించబోతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటీవలి కాలంలో చాలా గ్యాప్ తీసుకున్న సాగర్ చంద్ర గత కొంత కాలంగా ఈ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నాడు. డైరెక్టర్ పేరులో ఏదైనా మార్పు ఉండొచ్చని కొంత ప్రచారం జరిగింది కానీ ఫైనల్ గా మేకర్స్ దానికి చెక్ పెట్టారు. సో వచ్చే నాలుగేళ్లలో నాన్ స్టాప్ గా పవన్ కళ్యాణ్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇంత కంటే ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంది

Announcement Link Here @ bit.ly/35zjjYC