iDreamPost
iDreamPost
రాష్ట్రంలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు, సంఘటనలు ఉద్రిక్తతలు రేపడమే కాకుండా రాజకీయ రచ్చకు దారి తీశాయి. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు మరికొంతమంది వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకొని కొన్నాళ్లుగా ఆ క్రతువు కొనసాగిస్తున్నారు. పట్టాభి మరింత రెచ్చిపోయి సీఎం జగన్ను వ్యక్తిగతంగా దూషించారు. గంజాయి, డ్రగ్స్ పేరుతో నిరాధార ఆరోపణలు చేస్తూనే శృతిమించి వ్యక్తిగత దూషణలకు తెగబడ్డారు. నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడుతూ సభ్యత ,సంస్కారాలు మరిచి బూతులు మాట్లాడారు.
టీడీపీ నేతల అవాకులు చవాకులను కొన్నాళ్ల నుంచి ఓపికగా భరిస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పట్టాభి దూషణపర్వాన్ని తట్టుకోలేకపోయారు. తమ నాయకుడిని అగౌరవ పరచడాన్ని సహించలేక ఆవేశానికి గురయ్యారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని, పట్టాభి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్బంగా రెండు పార్టీల మధ్య వాగ్వాదం తోపులాటల్లో కొంత ఆస్తినష్టం వాటిల్లింది. ఏ సంఘటనలను అయినా టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సహజమే. కానీ జరిగిన సంఘటనలపై బీజేపీ, జనసేన అగ్రనేతల స్పందన ఏకపక్షంగా ఉంది. సమస్యను ఒక కోణంలోనే చూడటం ఏమాత్రం సమర్థనీయం కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read : Chandrababu – Amit Shah – దాడిపై ఫిర్యాదు చేస్తారు సరే.. అమిత్ షా కారణం అడిగితే ఏం చెబుతారు..?
వారి బూతులను సమర్థిస్తున్నారా?
సిద్ధాంతాలు, క్రమశిక్షణ గురించి వల్లె వేసే బీజేపీ నేతలు టీడీపీ కార్యాలయాలపై దాడులనే ప్రస్తావిస్తూ ఖండిస్తున్నారే తప్ప .. దానికంటే ముందు టీడీపీ నేత నోటి తీటను, బూతు పంచాంగాన్ని గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం, ఖండించకపోవడం అభ్యంతరకరం. రాజకీయాల్లో వైరుధ్యాలు, ఆరోపణలు సహజం. అంతమాత్రాన ముఖ్యమంత్రి స్థాయి నేతలను నోటికొచ్చినట్లు తిట్టడం సమంజసమేనా? దాడులకు కారణమేంటో.. దానికి ప్రేరేపించిన వారెవరో తెలుసుకోనక్కర్లేదా.. దాడులు తప్పే అనుకున్నా.. ముఖ్యమంత్రి స్థాయి నేతను సంస్కారహీనంగా దూషించడం కూడా తప్పే కదా. దాడులను అత్యుత్సాహంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్ టీడీపీ నేతల దూషణల పర్వాన్ని ఎందుకు ఖండించడంలేదు. అంటే సీఎంను తిట్టడాన్ని వారు సమర్థిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. రెండు ఘటనలను ఖండిస్తే పద్దతిగా ఉండేది. కానీ బీజేపీ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండించి.. వారి తిట్ల పురాణాన్ని ఉపేక్షించడం ఏమాత్రం సమర్థనీయం కాదు.
అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా..
చంద్రబాబు ఆంతరంగిక మిత్రుడు పవన్ కళ్యాణ్ తీరు కూడా అలాగే ఉంది. పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం ఆరాచకమని, అప్రజాస్వామికమని జనసేనాని పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే చాలా సందర్భాల్లో ఉవాచించారు. మరి దూషణలతో ఎదుటివారు రెచ్చగొట్టినప్పుడు ఆవేశపడటం సహజం. అలాంటి సందర్భాల్లో ప్రతిచర్య ఉంటుంది. నిన్న జరిగింది అదే. కానీ దాడులను ఖండించిన పవన్ కళ్యాణ్ టీడీపీ నేతల తిట్ల ఊసు ఎత్తలేదు. అసలు ప్రజాస్వామ్యం గురించి పవన్ మాట్లాడటమే విడ్డూరంగా ఉంది. తమ నేత పవన్ ను ఎవరైనా పల్లెత్తు మాట అంటే జనసైనికులు అసలు ఊరుకోరు. దాడులకు తెగబడుతుంటారు. ఈ మధ్యే సినీనటుడు పోసాని కృష్ణ మురళీ పై జరిగిన దాడులే దీనికి నిదర్శనం. అప్పుడు గుర్తుకురాని ప్రజాస్వామ్యం పవన్ కు ఇప్పుడు గుర్తుకు రావడమే విడ్డూరం. అప్పుడు తన కార్యకర్తలు, అభిమానులను అదుపు చేయడానికి ప్రయత్నించని జనసేనాని టీడీపీ కార్యాలయంపై దాడిని మాత్రం ఖండించారు. గౌరవనీయ స్థానంలో ఉన్న నేతను వ్యక్తిగతంగా దూషించడం తప్పు అని చెప్పలేని వారికి ఇంకొకరిని తప్పు పట్టే అర్హత లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read : Sajjala Ramakrishna Reddy – పట్టాభి మాటలు కరెక్టేనా..? ప్రజలు ఆలోచించాలన్న సజ్జల