iDreamPost
android-app
ios-app

ఇప్పుడు ఏపీకి ఏమిచ్చారని ఇలా మాట్లాడుతున్నావ్ పవన్?

ఇప్పుడు ఏపీకి ఏమిచ్చారని ఇలా మాట్లాడుతున్నావ్ పవన్?

పవన్ అడుగులు కాషాయ దళం వైపు వెళ్తున్నాయా.? అమిత్ షా ఆద్వర్యంలో పనిచేయడానికి పవన్ ఆసక్తి చూపిస్తున్నారా.? పవన్ కళ్యాణ్ బీజేపీలో జనసేనను విలీనం చేస్తారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కారణం గత రెండ్రోజులుగా పవన్ కళ్యాణ్ తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనని, తాను ప్రత్యేకహోదా కోసం మాత్రమే బీజేపీని సిద్దాంతపరంగా బీజేపీని వ్యతిరేకించానని చెప్పుకొచ్చారు. పైగా అసలు నేను బీజేపీకి ఎప్పుడు దూరంగా ఉన్నాను అంటూ ప్రశ్నించారు. వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ పవన్ ని గత ఎన్నికలకు ముందే పవన్ ని బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేయమని కోరగా ఆయన కుదరదు అన్నారని, ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు గమనిస్తే తాను బీజేపీకి చేరువయ్యేలా ఉన్నాయన్నారు. ఒకవేళ బీజేపీలో జనసేనను విలీనం చేయాలనుకుంటే తమకు ఇష్టమేనని, అందుకు తానూ సహకరిస్తానని సాక్ష్యాత్తూ ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలోనే చెప్పారు. 
అయితే దీనికి కొంతకాలం జరిగిన పరిణామాలను ఒక్కసారి గమనిస్తే.. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన పవన్ కళ్యాణ్ ఏమాత్రం విరామం తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగిపోయారు. ఇసుక పై మార్చ్ లు, వైసీపీ కార్యకర్తలు మార్చిన రంగులపై ట్వీట్లు, జగన్ కులమతాలపై ప్రసంగాలతో అత్యంత బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అశాస్త్రీయ పద్ధతిలో సిద్ధమయ్యారు. అనంతరం పవన్ రాజకీయ చేష్టలన్నీ బీజేపీని సంతృప్తి పరిచేలా సాగాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అడపాదడపా జరిగిన మత మార్పిడిల గురించి పవన్ వ్యాఖ్యానించడం, దేవాలయాల గురించి మాట్లాడడం.. వంటివి చేసారు.

మరి ముఖ్యంగా ఎన్నికలకు ముందు వామపక్ష పార్టీలతో రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో బీజేపీ బద్ధ వ్యతిరేకి మాయావతితో సన్నిహిత సంబంధాలతో మెలిగిన జనసేనాని వారిద్దరినీ పక్కన పెట్టేసారు. వామపక్ష నాయకులంటే నిరంతరం ప్రశ్నిస్తారని, తాను కూడా ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ వారితో కలిసి పోటీకి కూడా దిగారు. అనంతరం అసలు వారితో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. ఎన్నికలకు ముందు మాయావతిని కలిసినపుడల్లా కాళ్లు పట్టుకుని తనను ఆశీర్వదించాలని కోరుతూ.. మాయావతి ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్నానని చెప్పిన జనసేనాని అనంతరం ఆమెగురించి ప్రస్తావనే తీసుకురాలేదు. ఎందుకంటే పవన్ బీజేపీకి దగ్గరవ్వాలనే ఆలోచనతేనే బీజేపికి బద్ధ వ్యతిరేకులైన మాయావతి, వామ పక్షాలతో తన బంధం తెంచుకున్నారని స్పష్టమవుతోంది.

ఇంకాస్త టెక్నికల్ గా ఆలోచిస్తే.. పవన్ ఎన్నికల సమయంలో అంతకు ముందూ బీజేపీకి వ్యతిరేకంగా తన ట్విట్టర్ లో కొన్ని పోస్టులు పెట్టారు. వాటన్నిటినీ సడెన్ గా డిలీట్ చేసారు. ఏకంగా 5 నెలల ట్వీట్స్ డిలీట్ చేసారు. మార్చి 19వ తేదీనుంచి ఆగష్టు 21వ తేదీ వరకు పెట్టిన ట్వీట్లు అన్నీ డిలీట్ చేసారు. ఆ ట్వీట్లలో ఉత్తరాధి అహంకారాన్ని సహించబోను.. పరుగెత్తించి కొడతా.. ఉరికించి కొడతా.. తరిమి తరిమి కొడతా.. మీకు ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించిన ట్వీట్లు ఎన్నో ఉన్నాయి. 
అదే క్రమంలో పవన్ పర్యటనలు కూడా బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో చేసారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో బీజేపీకి ఆస్కారం ఉంది. అక్కడ కూడా పవన్ ఫోకస్ చేసారు. అలాగే గత కొంతకాలంగా బీజేపీ రాయలసీమపై ఫోకస్ చేస్తోంది. రాయలసీమ సమస్యలను ఆప్రాంత నాయకులు ప్రస్తావిస్తున్నారు. సీమలోని ప్రధాన నేతలంతా బీజేపీలో చేరుతున్నారు. ఇటీవల బైరెడ్డి రాజశేఖరరెడ్డి బీజేపీలో చేరారు. అలాగే జేసీ దివాకర్ రెడ్డి కూడా బీజేపీలోకి రానున్నారట. సాధారణంగా మిత్రపార్టీ ఎదుగుతున్న చోట మరోపార్టీ వెళ్లదు కానీ వ్యూహం ప్రకారం బీజేపీ జనసేనల ఓట్ల శాతం పెంచుకోనుందని తెలుస్తోంది.
మరోవైపు.. ఇటీవల పవన్ మాట్లాడుతూ తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనని, తాను ప్రత్యేకహోదా కోసం మాత్రమే బీజేపీని సిద్దాంతపరంగా బీజేపీని వ్యతిరేకించానని, పైగా అసలు నేను బీజేపీకి ఎప్పుడు దూరంగా ఉన్నాను అంటూ ప్రశ్నించారు. అలాగే దేశానికి అమిత్ షా వంటి నాయకుల అవసరం ఉందన్నారు. దీనినిబట్టి ఇప్పుడు కేవలం హోదాగురించి పవన్ బీజేపీని వ్యతిరేకించిన మాట వాస్తవమే.. ఇప్పుడు బీజేపీకి దగ్గరయ్యే వ్యాఖ్యలు చేస్తున్నాడంటే మోడి ఎటువంటి హోదా ఇవ్వలేదు.. కనీసం ప్యాకేజీ ఇవ్వలేదు.. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులివ్వలేదు.. రాయలసీమ అభివృద్ధికి ఆర్ధికసాయం ప్రకటించలేదు.. మరి రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీని వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు రాష్ట్రానికి ఏ మేలు చేసారని బీజేపీ వైపు వెళ్తున్నారో అర్ధమవుతోంది.