Idream media
Idream media
ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై జనసేన నాయకులు దాడికి దిగుతున్నారు. సందర్భం ఉన్నా లేకున్నా జగన్‌పై సోషల్ మీడియా వేదికగా ఏదో ఒకటి కామెంట్ చేయడం జనసేన నేతలకు పరిపాటిగా మారింది. తాజాగా ‘పౌరహక్కుల సంఘం’ రాసిన ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’ పుస్తకంలోని ఓ పేజీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టింగ్ వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. జగన్ సీఎం కావడాన్ని చంద్రబాబు కంటే కూడా పవన్‌కల్యాణ్ తట్టుకోలేక పోతున్నాడేమో అనే అనుమానం కలుగుతోంది.
“1996లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో, అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది ‘రాయలసీమలోనే.. కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని, 14 ఏళ్ల ‘సుగాలి ప్రీతి’ ఉదంతమే దానికి ఉదాహరణ. అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది” అని ఆ పేజీని జనసేన ట్విట్టర్‌లో జతచేయడం అసందర్భం, అనాలోచితమని చెప్పక తప్పదు.
వైఎస్ రాజశేఖరరెడ్డి లేదా వైఎస్ జగన్ రాయలసీమలో పుట్టడమనేది యాదృచ్ఛికం. వారు పుట్టక ముందే రాయలసీమలో ఓ ప్రత్యేక వ్యవస్థ ఉంది. రాయలసీమ వెనుకబాటుకు వైఎస్సారో, జగనో కారణం కాదు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతోఇంతో సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం కలిగింది. ఆ విషయాన్ని జనసేన నేతలు గుర్తిస్తే మంచిది. ఎందుకంటే రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లకు గాను 49 సీట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించడం వెనుక వైఎస్సార్‌పై అభిమానం, ఆయన తనయుడిపై నమ్మకమే కారణం.
రాయలసీమలో ముఠాకక్షలు పెరగడానికి కరువే ప్రధాన కారణం. రాయలసీమలో వెనకుబాటుకు కారణాలు తెలిసిన నేతగా దివంగత వైఎస్సార్ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని, ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని కలలు కన్నారు. కొంత మేరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడాయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా తండ్రి కలలను, రాయలసీమ ప్రజల ఆశలను నెరవేర్చేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలనే వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్న్టు మీడియా ద్వారా తెలుస్తోంది.
అలాంటిది వైఎస్ జగన్‌పై 1996లో పౌరహక్కుల సంఘం వారు రాసిందంటూ ఏదో పేజీని ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం…జనసేనాని ఓర్వలేనితనాన్ని చూపుతుందే తప్ప ముఖ్యమంత్రికి పోయేదేమీ లేదు. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరెవరు ఏమేమి రాశారో తెలుసుకునే పనిలో జనసేన ఉందని దీన్నిబట్టి అర్థం చేసుకోవాలేమో. జనసైనికులకు ఇంతకు మించిన పనేమీ లేదా అనే అనుమానాలు కలుగుతాయి. జగన్‌పై నెగటివ్ అంశాలను పోస్ట్ చేస్తూ కాలయాపన చేయడం కంటే పార్టీని బలోపేతం చేసేందుకు సద్వినియోగం చేసుకుంటే మంచిది. తాము చంద్రబాబు జేబులో మనుషులమే అని నిరూపించుకునేందుకు ఇలాంటి ట్వీట్లు పనికొస్తాయే తప్ప తాము అనుకున్న లక్ష్యం నెరవేరదని జనసేన నేతలు ఇప్పటికైనా గుర్తిస్తే పవన్‌కల్యాణ్‌కు, పార్టీకి మంచిది.