పవన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన ఎప్పుడు, ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదనే విమర్శలున్నాయి. తన మాటపై తనకే నిలకడలేని దుస్థితి. తాను అందరిని ప్రశ్నించవచ్చని, తనను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదనే పవన్ ఫిలాసఫీ ఏంటో రాజకీయ నాయకులు, విశ్లేషకులకు అర్థం కావడం లేదు. మిత్రులెవరో, శత్రువులెవరో పవన్‌కే తెలియదంటారు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమితో చెట్టపట్టాలేసుకుని తిరిగిన పవన్, 2019కి వచ్చేసరికి బీఎస్పీ, వామపక్షాలతో కలసి ఎన్నికల్లో పోటీ చేశారు.
ప్రస్తుతానికి వస్తే ఆయన ప్రజాక్షేత్రంలో కంటే ట్విటర్ వేదికగానే రాజకీయాలను నడుపుతున్నాడు. బీజేపీ అగ్రనేతలైన ప్రధాని మోడీ, అమిత్‌షాలపై గతంలో పవన్ ట్విటర్ వేదికగా చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు. కేంద్రం పెద్దలను ఎదురించే దమ్ము, ధైర్యం తనకు మాత్రమే ఉన్నాయని ఆయన పదేపదే చెప్పేవారు. మరి ఇప్పుడేమైందో గానీ వారిద్దరిపై గతంలో చేసిన ట్వీట్లను పవన్ తొలగించాడు.
ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని కేంద్రప్రభుత్వం ప్రకటిస్తే…దాన్ని పాచిపోయిన లడ్డూలతో పవన్ పోల్చి మండిపడ్డాడు. ఉత్తర , దక్షిణ భారతం అంటూ వారిపై ఆయన తనదైన హాట్ ట్వీట్ చేశాడు. ఇలాంటి సీరియస్ ట్వీట్లన్నీ ప్రస్తుతం కనిపించలేదంటున్నారు. జనసేన సోషల్ మీడియా పేజీల్లో కూడా అవేవీ కనిపించకపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది. ఢిల్లీలో ఆయన ఎవరెవరిని కలిశారనే విషయాలు వెల్లడి కావడం లేదు. అయితే మోడీ, అమిత్‌షాలపై పాత ట్వీట్లను తొలగించిన నేపథ్యంలో బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చెగువేరా జపం చేసే పవన్, ఆయనకు పూర్తి విరుద్ధ భావాలున్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడని అనుకోవడం లేదని వామపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే 2014 అనుభవం దృష్ట్యా కాదని చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే విషయం తరచూ వింటూ ఉంటాం. పవన్‌కల్యాణ్ సైతం ఆంధ్రప్రదేశ్‌లో బలమైన అధికార పక్షాన్ని ఎదుర్కొని రాజకీయాలు చేయాలనుకుంటే కేంద్రంలో అధికార పక్షంతో కలవని తప్పదనుకుంటున్నట్టు జనసేన నేతలు అంటున్నారు. చూద్దాం…అన్నిటికి కాలమే జవాబు చెబుతుంది.