ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి జగన్ తర్వాత క్రౌడ్ ఫుల్లర్ గా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా తరలించాల్సిన అవసరం లేకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు స్వచ్చందంగా తరలివస్తారు. అలాంటి అరుదైన అవకాశం వినియోగించుకోవడం జనసేనానికి చేతకాదని ఇప్పటికే తేలిపోయింది. పైగా మొన్నటి ఎన్నికల్లో ఓటమికి మీరే కారణం అంటూ కార్యకర్తలను నిందించిన ఘనత ఆయనది.
ఇప్పటికే మొన్నటి ఎన్నికలకు ముందు తాను కాళ్ళు మొక్కిన బీఎస్పీ అధినేత్రి తో బంధం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. వేదిక పంచుకున్న వామపక్షాలను పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ తో బంధాన్ని బలపరుచుకునే పనిలో పడ్డారు. దానికోసం జనసేనాని పాకులాడుతున్న తీరు విస్మయకరంగా కనిపిస్తోంది. ఏరెండు పార్టీల మధ్యగాని, నాయకుల మధ్య గానీ సంబంధాలు ఇచ్చిపుచ్చకునేల ఉంటే అది ఇరువర్గాలకు శ్రేయస్కరం. కానీ ఇక్కడ అలా లేదు. పవన్ కళ్యాణ్ ప్రాధేయపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. లేకుంటే బీజేపీ నేతలు అది కూడా ఏ అమిత్ షా నో, మోడీ నో అనుకుంటే వేరు… జెపి నడ్డా అపాయింట్ మెంట్ కోసం ఆయన హుటాహుటిన హస్తిన బయలుదేరారు. అందులోనూ తన పార్టీ సమావేశం మధ్యలో నుంచి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాయకులతో స్థానిక ఎన్నికల ముందు సన్నాహక సమావేశం అని చెప్పి, అనూహ్యంగా వదిలి పోయిన అధ్యక్షుడి తీరు వారికి అంతుబట్టకుండా తయారయ్యింది. అంత ఎమర్జెన్సీ గా ఆయన వెళ్ళాడంటే డిల్లీలో పెద్ద తలకాయలను కలుస్తారని ఆశించిన వాళ్ల అంచనాలు తలకిందులు అయ్యాయి. అది కూడా ఒక రోజు ఢిల్లీలో వెయిట్ చేస్తే గానీ నడ్డ అపాయింట్ మెంట్ లభించలేదని అంటే పవన్ బీజేపీ పెద్దలు ఏ రీతిన ట్రీట్ చేస్తున్నారో అర్థం అవుతుంది.
పవన్ కళ్యాణ్ చేజేతులా తన రాజకీయ భవితవ్యం నాశనం చేసుకుంటున్న సన్నిహితులకు సైతం మింగుడు పడటం లేదు. ఇప్పటికే రాజా రవితేజ, రాపాక వర్రసాద్ వంటి వారి ఎపిసోడ్స్ అందుకు తార్కాణం. ఇప్పుడు పవన్ ని నమ్ముకుంటే మన పుట్టి మునుగుతుందని మరికొందరు హైరానా పడుతున్నారు. పాతికేళ్ల భవిష్యత్ లక్ష్యంగా రాజకీయాలు చేస్తానని చెప్పిన పవన్ అందుకు అనుగుణంగా పోరాడితే ఫలితం దక్కేది. ప్రజల్లో విశ్వాసం పెరిగేది. పదవులతో సంబంధం లేకుండా నిలబడ్డారనే నిబద్ధత నమ్మకాన్ని కలిగించేది. అదే ఆయన రాజకీయ ప్రస్థానంలో పలు శిఖరాలు చేరడానికి దోహదం చేసేది.
కానీ ఇప్పుడు అడుగులు తడబడుతున్నాయి. నిలకడ లేదనే విషయం నిరూపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు వారి ముందే తలవంచితే తోడుగా ఉన్నవారికి కూడా తలవంపులు తప్పేలా లేవు. ఇక్కడ జగన్ ఉదాహరణ గమనిస్తే ఆయన అధికారం కోసం ఎంతగా శ్రమించారు, ఒంటరిగా జనంలో ఎలా అభిమానం పొందారు, చివరకు అన్ని రకాల కుయుక్తులను ఎలా తిప్పికొట్టారన్నది అర్థం చేసుకుంటే పవన్ కి పెద్ద పాఠం అవుతుంది. అయినా అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకునే స్థితిలో ఆయన లేరని రుజువయ్యింది. ఇలా నిలకడలేని వారిని జనం ఆదరిస్తారని అనుకోవడం అంధ విశ్వాసం అవుతుంది. దాన్ని ఇప్పటికే బీజేపీ నేతలు గుర్తించారు కాబట్టే పవన్ కి జె పి నడ్డ స్థాయి ట్రీట్ మెంట్ ఇస్తున్నట్టు అంతా భావిస్తున్నారు.