iDreamPost
android-app
ios-app

ప‌ట్టిసీమ స్కాం .. ప్ర‌భుత్వం చేతికి నివేదిక..?

ప‌ట్టిసీమ స్కాం .. ప్ర‌భుత్వం చేతికి నివేదిక..?

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌పై ప‌క్కా ఆధారాలు ఉంటేనే ముందుకు వెళ్లాల‌ని ఏపీ స‌ర్కార్ భావిస్తోంది. ఈ మేర‌కు యంత్రాంగానికి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ హ‌యాంలో ఉన్న మంత్రులు, వారి శాఖ‌ల్లో జ‌రిగిన అవినీతిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఆధారాలు సేక‌రించే ప‌నిలో యంత్రాంగం ఉంది. ఈ క్ర‌మంలోనే పట్టిసీమ ఎత్తిపోతల పథకం లో జ‌రిగిన అవినీతిపై ప్ర‌భుత్వానికి నివేదిక అందిన‌ట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా నాడు నీటి పారుద‌ల శాఖా మంత్రిగా ఉన్న దేవినేని ఉమాను విచారించే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం కోసం తొలుత సాధారణ నిబంధనలతో 2015 జనవరి 7న నాటి టీడీపీ స‌ర్కార్ టెండ‌ర్ పిలిచింది. అయితే, గ‌తానికి భిన్నంగా ఈ ప్రాజెక్టు కోసం టెండ‌ర్ నిబంధ‌న‌ల‌ను సైతం మార్చార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. సాధారణ నిబంధనల వల్ల సర్కారు పెద్దలు ‘ఆశించిన ప్రయోజనం’ దక్కదనే ఉద్దేశంతో టెండర్ నిబంధనలు మార్చాలని ప్రభుత్వం భావించిందని నాడు అధికార వర్గాల సమాచారం బ‌య‌ట‌కు పొక్కింది. అందుకు అనుగుణంగా ‘5 శాతం’ నిబంధననే తుంగలో తొక్కేశారు. 5 శాతం నిబంధనను తొలగించి, అధిక ధర (ఎక్సెస్)కు కోట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం జనవరి 20న మెమో (నం.52/ప్రాజెక్ట్ 1.ఎ.2/2015)ను జారీ చేసింది. ఈ మినహాయింపు కేవలం పట్టిసీమకే పరిమితమని, మిగతా ప్రాజెక్టులకు సాధారణ ఈసీపీ నిబంధనలే వర్తిస్తాయని మెమోలో పేర్కొనడమే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఇలా చేయాల్సి వ‌చ్చిందో స‌మాధానం చెప్పాల‌ని దేవినేనికి ఇప్పుడు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది.

దీనిపై అప్ప‌ట్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ ప్ర‌భుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిల‌దీశారు. అసెంబ్లీలో పట్టిసీమలో అవినీతి జరిగిందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ.371కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయ‌న అసెంబ్లీలో ఆరోపించారు. కేవలం ‘సొమ్ము’ చేసుకోవడానికే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారనే ఆరోపణలు బలంగా వచ్చినా.. ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈపీసీ విధానంలో టెండర్ విలువలో 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేయడానికి అవకాశం లేదు. ఆన్‌లైన్‌లో టెండర్ దాఖలు చేసే సమయంలో 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేసే టెండర్లను సిస్టం (కంప్యూటర్) అంగీకరించదు. కానీ ఆదిశ‌గా మార్పులు చేశార‌న్ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

పట్టిసీమలో అవినీతి జరిగిందంటూ.. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతోనూ అక్రమాలు జరిగాయంటూ ఏపీ ప్రభుత్వానికి తాజాగా నివేదికలు అందాయి. దీంతో ప్రభుత్వం పూర్తి సమాచారం కోరినట్లు తెలుస్తోంది. ఇక, గత ప్రభుత్వం నీరు చెట్టు- పూడిక తీత పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఆరోపణలు చేసింది. టీడీపీతో మిత్ర‌భేదం త‌ర్వాత బీజేపీ కూడా ఇందుకు నాడు ఒత్తాసు ప‌లికింది. నీరు- చెట్టు పేరుతో జరిగిన అవినీతి విషయంతో పాటుగా పట్టిసీమలో అవినీతి జరిగిందనేది ఇప్పుడు ప్రభుత్వ వాదన. ఈ వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖా మంత్రిగా పని చేసిన దేవినేని ఉమా ను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పైన వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో దేవినేని ఉమా కర్నూలు సీఐడి అధికారుల విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప‌ట్టిసీమ లో జ‌రిగిన అవినీతిపై అందిన నివేదికకు 0 మ‌రింత ఆధారాలు జోడించాల‌ని యంత్రాంగానాకి ఏపీ స‌ర్కార్ ఆదేశించిన‌ట్లు తెలిసింది.