ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ ఆలయం కూల్చివేస్తున్నారంటూ నిన్న పలు మీడియా ఛానళ్లు ప్రసారం చేయగా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇంకేముంది ఎప్పుడు ఏం దొరుకుతుందా? ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామా అని ఆలోచించే ప్రతిపక్ష టీడీపీ సహా విపక్షాలు, కొన్ని హిందూ సంస్థలు పాతపట్నానికి వెళ్లి నానా హంగామా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ నేతలు అయితే ఛలో పాతపట్నం పేరుతో ఆలయం వద్దకు కూడా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక సోషల్ మీడియాలో కూడా జనసేన, బీజేపీ, టీడీపీ ఈ వ్యవహారాన్ని ప్రభుత్వమే చేయించింది అన్నట్టు పలు పోస్టులు పెడుతున్నాయి. ఇలాంటి వాటికోసమే ఆసక్తిగా ఎదురు చూసే నారా లోకేష్ అయితే ఆంధ్రా – ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహరీ, ముందు సింహద్వారాన్ని కూల్చివేయడం దారుణమని సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు.
దేవుళ్లకి తీరని అపచారం తలపెట్టారని, రోడ్డు విస్తరణ పనుల పేరుతో అదే పాతపట్నంలో ఆంజనేయస్వామి, వినాయకగుడిని బుల్డోజర్లతో కూల్చేయడం ప్రభుత్వ పెద్దలు హిందువుల ఆలయాల పట్ల ఎంత నిర్ధయగా ఉన్నారో అర్థమవుతోందని ఎంతో బాధ పడుతూ పోస్టులు పెట్టారు. ఇక ఈ రచ్చ మొదలుపెట్టడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఫ్యాక్ట్ చెక్ ద్వారా తాజాగా ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా అమ్మవారి ఆలయ ప్రహరీ గోడ, ఆలయం ముందున్న ఆర్చ్ లో కొంతమేర కూల్చివేసినట్లు ప్రభుత్వం పేర్కొందని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. అసలు తప్ప అమ్మవారి ఆలయాన్ని ముట్టుకోలేదని చెబుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆలయ ఈవో ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో స్థానిక తహశీల్దార్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ , ఆర్&బీ డీఈఈ, పోలీసుల సమక్షంలోనే దేవాలయానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రహరీ గోడను జేసీబీతో తొలగించినట్లు వెల్లడించారు. దేవాలయం పునఃనిర్మాణానికి రూ.1,40,57,404 పరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించినట్లు వెల్లడించారు. అలా దేవాలయాన్ని కూల్చి వేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారానికి చెక్ పడినట్లయింది. అయితే ఈ ఒక్క దేవాలయం ప్రహరీ కూల్చితే ఇంత గగ్గోలు పెడుతున్న లోకేష్ తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో, విజయవాడలో దాదాపు 28 పురాతన ఆలయాలను కూల్చివేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు?