ఆంధ్ర రాష్ట్రానికి చిట్టచివరన ఒడిశాకు ఆనుకొని ఉన్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రెండున్నర దశాబ్దాల క్రితం మొత్తం రాష్ట్ర ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న నందమూరి లక్ష్మీపార్వతిని అనూహ్యంగా గెలిపించి అసెంబ్లీకి పంపింది. అదీ ఒక ఉప ఎన్నికలో కావడం విశేషం. ఆ ఎన్నికల్లో అధికార టీడీపీ ఆర్థిక, అధికార బలాన్ని ఎదురొడ్డి లక్ష్మీ పార్వతి విజయలక్ష్మిని అందుకోగలిగారు. అసలు పాతపట్నం ఉప ఎన్నిక ఎందుకు జరిగింది. లక్ష్మీపార్వతి ప్రత్యేకంగా అక్కడి నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందన్నవి ఇప్పటికీ ఆసక్తికరమే.
ఉప ఎన్నిక ఎందుకొచ్చిందంటే..
1994 ఎన్నికల్లో రాష్ట్ర మంతటా టీడీపీ గాలి వీచింది. అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి కలమట మోహనరావు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మాన నారాయణ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ అభ్యర్థి కలమట తన ప్రచారంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్లను విరివిగా వాడారని.. దేవుళ్ల ఫోటోలను ప్రచారంలో వినియోగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పిటిషనులో పేర్కొన్నారు. అందువల్ల కలమట ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
Also Read:అవసరాలకోసం అడ్డదారులు తొక్కే విలన్లేనా అంతా?RK కొత్తపలుకులు అర్థమేమిటి?
కేసును విచారించిన కోర్టు ధర్మాన నారాయణరావు వాదనతో ఏకీభవించింది. కలమట మోహనరావు ఎన్నికను రద్దు చేస్తూ.. పాటపట్నంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశిస్తూ.. ఆ ఎన్నిక వరకు కలమటను పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తూ 1995 డిసెంబరులో తీర్పు ఇచ్చింది. దాంతో నిబంధనల మేరకు ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.
లక్ష్మీపార్వతి రంగప్రవేశం
మరోవైపు 1996 జనవరిలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ దివంగతుడు కావడంతో టీడీపీలో అనేక పరిణామాలు సంభవించాయి. ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి పోటీగా ఎన్టీఆర్ తెలుగుదేశం (ఎల్ఫీ) పార్టీని స్థాపించారు.
అదే సమయంలో కలమట ఎన్నిక రద్దు నేపథ్యంలో పాతపట్నం ఉప ఎన్నిక షెడ్యుల్ వెలువడింది. ఈ ఎన్నిక ద్వారా తన సత్తా, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజల్లో చాటిచెప్పాలన్న లక్ష్యంతో లక్ష్మీపార్వతి పాతపట్నం ఉప ఎన్నిక బరిలోకి ఎన్టీఆర్ తెలుగుదేశం (ఎల్పీ) అభ్యర్థిగా దిగారు. కలమటపై అనర్హత వేటు పడటంతో ఆయన సతీమణి కలమట వేణమ్మను అధికార టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు రంగంలోకి దించారు.
Also Read:అనంత నేతల ఆశలు పండేనా?
లక్ష్మీపార్వతిని ఎలాగైనా ఓడించాలన్న ధ్యేయంతో అధికార, అర్థ, అంగ బలాలను పూర్తిస్థాయిలో వినియోగించారు. దాదాపు రాష్ట్ర మంత్రులందరూ పాతపట్నంలోనే పది రోజులపాటు మకాం వేశారు. అప్పటి హోంమంత్రి ఇంద్రారెడ్డి కూడా తరలి రావడంతో మొత్తం పోలీసు బలగాలు నియోజకవర్గంలో మోహరించాయి. అయితే అన్నిరకాల ఒత్తిళ్లు, అడ్డంకులను అధిగమించి ప్రజాబలంతో లక్ష్మీపార్వతి ఆ ఉప ఎన్నికలో విజయం సాధించారు. కలమట వేణమ్మపై 14వేలకు పైగా మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.