iDreamPost
android-app
ios-app

ఎమ్మెల్యేలు పార్టీ మారితే పెన్షన్ లేనట్లే..!కొత్త చట్టం చేసిన బీజేపీ ప్రభుత్వం ..

  • Published Nov 04, 2021 | 5:38 AM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
ఎమ్మెల్యేలు పార్టీ మారితే పెన్షన్ లేనట్లే..!కొత్త చట్టం చేసిన బీజేపీ ప్రభుత్వం ..

ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. చాలా రాష్ట్రాల్లో నేటికీ అదే అమలులో ఉంది. కానీ దానిని సవరించేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు జరిగాయి. త్రిపురలో ఇది నాలుగేళ్లుగా ఉండేది. శాసనసభ్యులుగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వారికి పెన్షన్ అందించే సదుపాయం అమలులో ఉండేది. కానీ ప్రస్తుతం విప్లవ్ దేవ్ వర్మ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దానిని సవరించింది. పూర్తికాలం పదవిలో ఉంటేనే వారికి పెన్షన్ దక్కుతుందని నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా క్యాబినెట్ తీర్మానం ఆమోదించింది.

త్రిపురలో అధికార బీజేపీ ప్రభుత్వం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. వరుసగా పలువురు టీఎంసీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అటు కాంగ్రెస్ తో పాటుగా ఇటు బీజేపీ నేతలు కూడా టీఎంసీ లో చేరుతున్న తరుణంలో బెంగాల్ ని ఆనుకున్న రాష్ట్రంలో కూడా పాగా వేయాలని టీఎంసీ ఆశిస్తోంది . ఇప్పటికే కీలక నేతలను అక్కడి వ్యవహారాల ఇన్ఛార్జులుగా నియమించి మమతా బెనర్జీ తన యత్నాలు ముమ్మరం చేసింది. దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ ఆకర్ష్ తో కొందరు నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా గడువు ఉంది. ఈలోగా తమ పార్టీని బలపరుచుకోవాలని టీఎంసీ ఆశిస్తోంది. పట్టు సడలకుండా చూసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్న నేపథ్యంలో వారిని కాపాడుకోవడానికి  పలు ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలెవరైనా పార్టీ మారితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేసి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. అందుకు తోడుగా అలా అనర్హత వేటు పడినా, రాజీనామా చేయాల్సి వచ్చినా వారికి పెన్షన్ సదుపాయాలు వంటివి ఉండవని హెచ్చరిస్తోంది.

వాస్తవానికి దేశమంతా ఎమ్మెల్యేలు, ఎంపీలకు పెన్షన్ల విషయంలో పలు నిబంధనలున్నాయి. త్రిపురలో అయితే రిటైర్ అయిన ఎమ్మెల్యేకి రూ. 17,500 పెన్షన్ తో పాటుగా మెడికల్ ఖర్చులన్నీ రియంబెర్స్ చేసే వీలు ఉంటుంది. దానిని పూర్తి కాలపరిమితి అనుభవించిన ఎమ్మెల్యేలకే పరిమితం చేయాలని ఆలోచించిన బీజేపీ తీరు ఆశ్చర్యంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే వైఖరిని ఆపార్టీ తీసుకుంటుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. త్రిపురలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నిబంధనలు మారుస్తున్న బీజేపీ దేశమంతా ఒకే వైఖరి ఎందుకు తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఏమయినా రాజకీయాలకు అనుగుణంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందనే విమర్శలకు ఇది ఊతమిస్తోంది.