ఏపీతో పాటు చత్తీస్ ఘడ్ , జార్ఖండ్ లకు కూడా.
2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించగా అందుకు బిజెపి కూడా మద్దతు పలికింది . తర్వాతి కాలంలో కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పడ్డ తరువాత క్రమంగా హోదా ప్రతిపాదన ఆటకెక్కించి అందుకు పరిహారంగా ప్రత్యేక ప్యాకేజి డిమాండ్ తీసుకురావడం పాఠకులకు విదితమే .
విభజనతో రాజధాని , ఆస్తులు , ఆదాయం సర్వం కోల్పోయిన రాష్ట్రానికి సంజీవిని లాంటి హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీకి నాటి టీడీపీ ప్రభుత్వం ఒప్పుకోవడం పట్లా సర్వత్రా విమర్శలు వ్యక్తం కాగా , ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా స్పందించటంతో పాటు హోదా కోసం పలు ఆందోళన కార్యక్రమాలు చేసింది .
వాటిని పెడచెవిన పెట్టిన బాబు హోదా అంటే జైలుకు పంపుతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాక , ప్రత్యేక హోదా వద్దని , ప్యాకేజి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపటంతో హోదా ఆశలు ఆవిరయ్యాయి . అయితే ప్రతిపక్ష వైసిపి మాత్రం అనుకూల వేదికలపై హోదా కోసం గళం విప్పుతూనే ఉంది . అధికారాంతంలో ఎన్నికల వేళ బాబు గారు మళ్లీ హోదా డిమాండ్ తో దీక్షలు చేసినా అవి ప్రజల విశ్వాసాన్ని పొందలేదనే చెప్పాలి .
వైసీపీ అధికారంలోకి రావటానికి ముందు పలు వేదికల పై హోదా గురించి ప్రస్తావించిన జగన్ తనకు పూర్తి ఎంపీల బలం ఉండి కేంద్రంలో సంకీర్ణం వస్తే రాష్ట్రానికి హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తామని ప్రకటించారు . రాష్ట్ర దురదృష్టవశాత్తు కేంద్రంలో సంకీర్ణం రాకపోయినా రాష్ట్ర ఎంపీల ద్వారా కేంద్రాన్ని హోదా డిమాండ్ చేస్తూ వస్తున్నారు .
ఈ హోదా ప్రస్థానంలో రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయి రెడ్డి ద్వారా కీలకమైన ముందడుగు పడింది అని చెప్పొచ్చు . రాష్ట్రం తరుపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విజయసాయి రెడ్డి తరువాత పార్లమెంటరీ వాణిజ్య స్థాయీ సంఘ చైర్మన్ గా నియమింపబడ్డారు . ఆ పదవి నేడు ప్రత్యేక హోదా విషయంలో దగా పడ్డ మన రాష్ట్రంతో పాటు విభజన వలన రాజధానులు కోల్పోయిన జార్ఖండ్ , చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు కూడా ఉపకరించిందని చెప్పొచ్చు.
రాష్ట్రాల విభజన కారణంగా రాజధానులు కోల్పోయిన ఏపీతో పాటు , ఛత్తీస్ ఘడ్ , జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా పదేళ్ళపాటు హోదా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది . నిన్న రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ నివేదికను వెంకయ్యనాయుడుకు అందజేశారు .
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన విజయసాయి రెడ్డి ఆర్టికల్ 370 , 35 ఎ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ , లడ్డాక్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా నిర్ణయించినందువలన ఆ రాష్ట్రం ప్రత్యేక హోదా కోల్పోయిందని , అయితే 2021-22 బడ్జెట్లో జమ్మూకాశ్మీర్ కి 1.08 లక్షల కోట్లు , లడ్డాక్ కు 5058 కోట్లు అదనంగా కేటాయించినట్లు స్థాయీ సంఘం దృష్టికి వచ్చిందని తెలిపారు . ఈ అదనపు కేటాయింపుల వలన ఆయా కేంద్ర పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి జరగడంతో పాటు , రాజధాని కోల్పోయిన లడ్డాక్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అభివృద్ధి సాధించగలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు .
అయితే ఇదే రీతిలో రాష్ట్ర విభజన వలన రాజధానులు కోల్పోయిన ఏపీ , జార్ఖండ్ , చత్తీస్ ఘడ్ లకు ఇలాగే అదనపు పరిహారం ఇవ్వడంతో పాటు , పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వడం వలన ఆయా రాష్ట్రాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు , పారిశ్రామిక , ఎగుమతి రంగాల అభివృద్ధితో ఆ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ది చెందటానికి ప్రత్యేక హోదా సహాయపడుతుందని స్థాయీ సంఘం సిఫార్సులను రాజ్యసభ చైర్మన్ కి వివరించారు .