iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఇప్పటికే కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోబోమని తెలియజేసింది. ఏపీ హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దాంతో కార్యనిర్వాహక రాజధాని విషయంలో స్పష్టత వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఫుల్ క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇక ఏపీకి ప్రస్తుతం రాజధాని విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే గతంలో విడుదల చేసిన మ్యాప్ లో అమరావతిని రాజధానిగా ప్రస్తావించ నిరాకరించింది. కానీ ఆతర్వాత కొందరు విన్నవించడంతో తాత్కాలికంగా అమరావతిని పేర్కొంటూ మ్యాప్ సవరించింది కూడా. కానీ తాజాగా పార్లమెంట్ లో మాత్రం ఏపీ రాజధానిగా సాగరనగరం ఖరారు చేస్తూ వైజాగ్ అని ప్రస్తావించింది.
వివిధ రాష్ట్రాల రాజధానుల్లో పెట్రో ధరలు ఎలా ఉన్నాయనే విషయాన్ని పార్లమెంట్ కి తెలియజేస్తూ కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని గా వైజాగ్ అంటూ పేర్కొంది. తద్వారా త్వరలోనే కార్యనిర్వాహక రాజధాని వైపు అడుగులు వేసే ఉద్దేశంలో ఉన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి ఇది మరో సమర్థనగా కనిపిస్తోంది. ఇప్పటికే న్యాయరాజధాని దిశగా కర్నూలులో కార్యాలయాలు తెరిచే ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలిగా లోకాయుక్త కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణరెడ్డి ప్రారంభించారు. దాంతో న్యాయరాజధాని గా కర్నూలు రూపాంతరం చెందడం మొదలయ్యిందనే భావించాలి.
ఇక విశాఖ కూడా కార్యనిర్వాహక రాజదానిగా సన్నద్ధమవుతున్న వేళ కేంద్రం లిఖితపూర్వకంగా ఖరారు చేయడం విశేషం. అదే సమయంలో పార్లమెంట్ లో ఈ విషయాన్ని టీడీపీ కూడా అభ్యంతరం పెట్టలేదు. దాంతో అధికారికంగా వైజాగ్ నుంచి పాలనా వ్యవహారాల ప్రక్రియ మొదలయినట్టుగానే భావించాలి. ఉత్తర ప్రత్యుత్తరాల్లో వైజాగ్ ని ఖాయం చేసే దిశలో కేంద్రం ఉందని నిర్ధారణ అవుతోంది.