కరోనా కారణంగా తెలంగాణాలో మూతపడిన బార్‌లు, క్లబ్‌లు, టూరిజం బార్‌లు నేటి నుండి తెరుచుకోనున్నాయి. వీటిని నేటినుండి తెరవొచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో మార్చ్ 22 నుండి వైన్‌షాపులతో పాటు బార్‌లు, క్లబ్‌లను మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అనంతరం మే 6 నుండి మద్యం దుకాణాలకు అనుమతిని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం బార్‌లు, క్లబ్‌ల నిర్వహణకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దాదాపు ఆరునెలల అనంతరం మూతపడిన బార్‌లు, క్లబ్‌లు నేటి నుండి తెరుచుకోనున్నాయి. కానీ మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లకు మాత్రం ఆనుమతి లేదని ప్రభుత్వం తెలిపింది.
కాగా బార్‌లు, క్లబ్‌లు నిర్వహించే నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బార్‌లు, క్లబ్‌ల నిర్వాహకులు ప్రవేశ ద్వారం దగ్గరే కస్టమర్లకు థర్మల్ స్ర్కీనింగ్ టెస్ట్‌లు నిర్వహించాలి. ప్రతీ టేబుల్ వద్ద సానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించాలి. బార్‌లలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. బార్‌లు, క్లబ్బుల్లో ఎక్కువ మంది ఒక దగ్గర గుమిగూడడం లాంటివి చేయకూడదు. మ్యూజిక్ కార్యక్రమాలు, డాన్స్ ఫ్లోర్‌లు ఏర్పాటు చేయకూడదు. బార్‌లలో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చేయడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చెయ్యాలి.
నేటి నుండి అర్బన్ ఫారెస్ట్ పార్కులు తెరుకోనున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ పార్కులకు సందర్శకులు రావొచ్చని ఆయన వెల్లడించారు. పార్కుల్లో కూడా సానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 6 న జూ డే సందర్భంగా నెహ్రూ జూ పార్క్ ను కూడా తెరవనున్నట్లు మంత్రి వెల్లడించారు.