iDreamPost
android-app
ios-app

యూపీ ఎన్నికల్లో పరశురాముడు!

  • Published Jan 15, 2022 | 12:04 PM Updated Updated Mar 11, 2022 | 10:23 PM
యూపీ ఎన్నికల్లో పరశురాముడు!

ఉత్తరప్రదేశ్లో తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో రాజకీయాలు ఎత్తులు పైఎత్తులతో ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. అధికార బీజేపీ సాధారణ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ముందస్తు సర్వేలు అంచనా వేసినా కొన్ని రోజులుగా పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీ నుంచి ఓబీసీ వర్గాలకు చెందిన ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలో చేరడం రాజకీయ రంగాన్ని కుదిపివేసింది. దీనికి తోడు రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బ్రాహ్మణ సామాజికవర్గానికి వ్యతిరేకమన్న ముద్ర ఉంది. దీంతో ఆ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు బీజేపీ శత విధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పరశురాముడిని కూడా తన ప్రచారానికి వాడేసుకుంటోంది.

రాముడు.. కృష్ణుడు.. పరశురాముడు

కుల రాజకీయాలకు యూపీ పెట్టింది పేరు. దానికి తోడు ఈ ఎన్నికల్లో దేవుళ్లను కూడా పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. అయోధ్య రామాలయ అజెండాతో కొన్ని దశాబ్దాలుగా బీజేపీ రాజకీయాలు చేస్తోంది. అది చాలదన్నట్లు ఈ ఎన్నికల్లో భారీగా సీట్లు తగ్గిపోతాయన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో కాశీవిశ్వనాథ్ కారిడార్ పేరుతో కొన్నాళ్లుగా ప్రచారం చేసుకుంటోంది.

కాశీ క్షేత్రాన్ని ఆధునికీకరించే ఈ ప్రాజెక్టును పాక్షికంగా ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ హడావుడిగా ప్రారంభించారు. అలాగే కోర్టు ద్వారా ఎప్పుడో పరిష్కారం అయిపోయిన మధుర శ్రీకృష్ణ మందిర వివాదాన్ని కూడా బీజేపీ తెరపైకి తెచ్చింది. శ్రీకృష్ణ జన్మస్థలంలోని మసీదును తొలగించి హిందూ సంఘాలకు అప్పగించాలన్న వాదనను అందుకుంది. ఒక దశలో సీఎం యోగిని మధుర నుంచి పోటీ చేయించాలని కూడా ఆలోచించింది. రాష్ట్రంలో దాదాపు 12 శాతం వరకు ఉన్న బ్రాహ్మణ ఓటర్ల మద్దతు సమీకరించేందుకు, ప్రముఖ బ్రాహ్మణ నేతలు పార్టీ వీడి ఎస్పీలోకి వెళ్లకుండా నిరోధించేందుకు పార్టీపరంగా ఒక కమిటీని నియమించిన బీజేపీ తాజాగా పరశురాముడిని కూడా విడిచిపెట్టలేదు. లక్నోలోని కృష్ణానగర్ లో 11 అడుగుల పరశురామ విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ ఇటీవల ఆవిష్కరించారు. బీజేపీలోని ఆ వర్గం నేతలందరూ పాల్గొని హడావుడి చేశారు.

ఎస్పీతోనే పరశురాముడికి వెలుగు

బ్రాహ్మణులు తమ ప్రతినిధిగా భావించే పరశురాముడిని మొదట సమాజ్వాదీ పార్టీయే వెలుగులోకి తెచ్చింది. గతంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరశురామ జయంతిని సెలవుగా ప్రకటించించింది. గోసాయిగంజ్ లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ రహదారి పక్కనే ఆలయ నిర్మాణం కూడా చేపట్టింది. దీంతో చాలామంది బ్రాహ్మణ నేతలు ఎస్పీలో చేరారు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన యోగి ప్రభుత్వం పరశురామ జయంతి సెలవును రద్దు చేసింది. ఆ సమయంలో కాంగ్రెసులో ఉన్న ప్రస్తుత రాష్ట్ర మంత్రి జితిన్ ప్రసాద యోగి ప్రభుత్వ చర్యను ఖండించారు.
కాగా ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో బ్రాహ్మణ వర్గం అవసరాన్ని గుర్తించిన బీజేపీ సమాజ్వాదీ పార్టీ నుంచి పరశురాముడిని హైజాక్ చేసి తన రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నిస్తుండటం విశేషం.