కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం పార్లమెంటు నిర్వహణపై పడింది. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్న తరుణంలో కీలకమైన బడ్జెట్ సమావేశాలను షిఫ్ట్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణంగా పార్లమెంటు పరిధిలోని లోకసభ, రాజ్యసభ సమావేశాలు ఏకకాలంలో జరుగుతుంటాయి. కానీ థర్డ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో భౌతిక దూరంతో సహా ఇతర కోవిడ్ జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోకసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు లోకసభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది.రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోవిడ్ తో హైదరాబాదులోనే ఉండిపోవడంతో రాజ్యసభ ఉత్తర్వులు ఇంకా జారీకాలేదు.
మొదటి సెషన్ అంతా అలాగే..
బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. ఈనెల 31న సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆరోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 11 గంటలకు లోకసభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక ఫిబ్రవరి 2 నుంచి మొదటి విడత సమావేశాలు జరిగే 9వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోకసభ సమావేశం అవుతుంది. రాజ్యసభ రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పని చేస్తుంది. మలివిడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14న మొదలై ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ సెషన్స్ సమయాలను అప్పటి కోవిడ్ పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు.
875 మంది పార్లమెంటు ఉద్యోగులకు పాజిటివ్
బడ్జెట్ సమావేశాల దృష్ట్యా పార్లమెంటులో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 2847 మంది సిబ్బందికి కరోనా టెస్టులు చేయించగా 875 మందికి పాజిటివ్ గా తేలింది. దాంతో ప్రత్యామ్నాయ సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి సహా పలువురు కేంద్రమంత్రులు కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపడుతున్నారు. లోకసభ, రాజ్యసభ, సెంట్రల్ హాళ్లను పూర్తిగా శానిటైజ్ చేయిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులపై పూర్తి ఆంక్షలు అమలు చేయనున్నారు.