Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో వైసీపీ మద్ధతుదారులు జయకేతనం ఎగురవేస్తున్నారు. తొలి విడతలో భాగంగా ఈ రోజు విజయనగరం మినహా మిగతా 12 జిల్లాలో ఎన్నికలు జరిగాయి. 18 రెవెన్యూ డివిజన్లలోని 168 మండలాల్లో 3,249 పంచాయతీల్లో స్థానిక పోరు జరిగింది. ఇందులో 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా. ఒక పంచాయతీలో ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మిగతా 2,723 పంచాయతీలకు ఈ రోజు ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ జరిగింది. 85 శాతం మేర పోలింగ్ నమోదైంది.
పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సులను తెరిచిన ఎన్నికల సిబ్బంది, ఓట్లను వేరుచేశారు. 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టారు. ఆ తర్వాత లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 3,249 పంచాయతీలకు గాను ఏకగ్రీవాలతోపాటు పోలింగ్ జరిగిన పంచాయతీలలో రాత్రి పది గంటల నాటికి 1369 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో వైసీపీ మద్ధతుదారులు 1,282 చోట్ల గెలుపొందారు. టీడీపీ మద్ధతుదారులు 77 పంచాయతీల్లోనూ, బీజేపీ–జనసేన కూటమి 2 పంచాయతీలు, స్వతంత్రులు 8 చోట్ల విజయం సాధించారు.
సాధారణ ఎన్నికల అనంతరం దాదాపు రెండు సంవత్సరాల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్ధతుదారులు సత్తా చాటడం ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని నిరూపిస్తోంది. ౖవైసీపీ బలం పెరిగిందే తప్పా.. తగ్గలేదని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో దాదాపు 51 శాతం ఓట్లు వైసీపీకి దక్కగా.. పంచాయతీ ఎన్నికల్లో అంతకు మించిన ఓట్లు పొందినట్లు తెలుస్తోంది. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి విప్లవాత్మక పరిపాలనా సంస్కరణలు, అర్హతే ఆధారంగా వైసీపీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించడం ఆ పార్టీ మద్ధతుదారులు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.
ఫలితాలు వెల్లడి కావాల్సిన పంచాయతీల్లో ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. సమయం ఎంతైనా ఫలితాలు వెల్లడయ్యే వరకూ పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలోనే ఉండనున్నారు. కౌటింగ్ ఆలస్యం కావడంతో.. ఉప సర్పంచ్ ఎన్నికను రేపు బుధవారం నిర్వహించనున్నారు. అర్థరాత్రికి దాదాపు అన్ని పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.