iDreamPost
android-app
ios-app

పల్లంరాజు… తాత మనవలు – మూడు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రత్యక్ష సాక్షులు..

  • Published Jan 24, 2022 | 8:21 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
పల్లంరాజు… తాత మనవలు – మూడు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రత్యక్ష సాక్షులు..

కాలానుగుణంగా మారకపోతే మనిషి అయినా… వస్తువైనా కనుమరుగైపోతుంది. రాజకీయాల్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయాలు ప్రారంభించి ఉన్నత పదవులు పొందిన ఎంతోమంది నాయకులు విభజన పుణ్యమాని కాంగ్రెస్‌ పార్టీలానే వారు కూడా ప్రజలకు దూరమవుతున్నారు. ఇటువంటివారిలో కేంద్రమాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ఒకరు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నందున ప్రజలకు దూరమవుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ వారసత్వం సర్వసాధారణం. ఒక కుటుంబానికి చెందిన మూడు, నాలుగు తరాలవారు ఆయా జిల్లాల రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉంటూ వస్తున్నారు. అటువంటి వారిలో మల్లిపూడి కుటుంబం ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఈ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాత మల్లిపూడి పల్లంరాజు పిఠాపురం, కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా పనిచేశారు. తండ్రి మల్లిపూడి శ్రీరామ సంజీవయ్య కాకినాడ నుంచి మూడుసార్లు పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర సహాయమంత్రిగా కూడా పనిచేశారు. మనవడు మల్లిపూడి మంగపతి పల్లంరాజు సైతం కాకినాడ నుంచి మూడుసార్లు ఎంపీగాను,కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి క్యాబినెట్‌ హోదాలో పనిచేశారు. ఇలా మూడు తరాలవారు రాష్ట్రమంత్రులుగా, కేంద్రమంత్రులుగా పనిచేసిన ఘనత ఆ కుటుంబానికి సొంతం.

పళ్లంరాజు 61వసంతంలోకి  అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తరపున క్రీయాశీలక రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆ పార్టీలానే ఆయన కూడా ప్రజలకు దూరమవుతున్నారు. సుమారు మూడు దశాబ్ధాలకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ పల్లంరాజుకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు చాలా తక్కువ. మూడుసార్లు ఎంపీగా ఉన్నా… రాజీవ్‌గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనా… కీలక మానవవనరుల శాఖకు క్యాబినెట్‌ మంత్రిగా పనిచేసినా… రాష్ట్రంలో బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోలేకపోవడం రాజకీయంగా ఆయన వైఫల్యమై.

అయితే ఇన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నా ఆ కుటుంబం పట్ల, పళ్లంరాజు పట్ల జిల్లా వాసుల్లో ఇప్పటికీ సానుకూలత ఉండడం విశేషం. పళ్లంరాజు ఆంధ్రా యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ చేశారు. అలాగే ఎంబీఏ పూర్తి చేశారు. కొంతకాలం అమెరికాలో పనిచేసిన ఆయన 1989లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తాత, తండ్రిలా కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయాలు చేస్తున్నారు. తండ్రి ప్రాతినిథ్యం వహించిన కాకినాడ లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2014లోను, 2019లోను ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. మన్మోహన్‌ సింగ్‌ క్యాబినెట్‌లో 2012 నుంచి 2014 వరకు మానవవనరుల శాఖమంత్రిగా క్యాబినెట్‌ హోదాలో పనిచేశారు. అంతకుముందు ఆయన రక్షణ శాఖ సహాయమంత్రిగా 2009 నుంచి 2012 వరకు ఉన్నారు.

తండ్రి మల్లిపూడి శ్రీరామ సంజీవి రావు 1971 నుంచి 1984 వరకు మూడుసార్లు కాకినాడ ఎంపీగా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో టెలీ కమ్యూనికేషన్‌ మంత్రిగా పనిచేశారు. విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ తరపునే పల్లంరాజు 2014 ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేశారు. కేవలం 17 వేల ఓట్లు మాత్రమే పొందారు. 2019 ఎన్నికల పోటీ నుంచి ఆయన తప్పుకున్నారు. పల్లంరాజుకు కుమారుడు ఉన్నా అతను ఇంకా చదువుకుంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఆ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమేనా?

2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ రెండవసారి అధికారింలోకి రావడం, దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హెలీకాఫ్టర్‌ ప్రమాదంలో మృత్యువాత పడడం జరిగింది. ఆ తరువాత కె.రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే సమయంలో ఎం.ఎం.పల్లంరాజు వైపు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మొగ్గు చూపారు. ఆయన పేరు ఖరారు చేసేందుకు ఆమె సిద్ధపడ్డారు.

అయితే ముఖ్యమంత్రిగా తాను నెగ్గుకురాలేనని పల్లంరాజు తేల్చిచెప్పారు. లేకుంటే పల్లంరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యేవారు. తన అభ్యర్థిత్వం వద్దన్నారు సరికదా… ముఖ్యమంత్రి అభ్యర్థి పేర్లు సూచించాల్సిందిగా అధిష్టానం కోరితే నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి పేరు సూచించారు. ఆ సమయంలో పల్లంరాజు కనీసం తన సామాజికవర్గానికి చెందిన నాటి మంత్రి బొత్సా సత్యనారాయణ, చిరంజీవి పేర్లు సూచించి ఉన్నా ఆ సామాజికవర్గం నుంచి ఒకరైనా తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేవారని కాపులలో ఎక్కువ మంది భావిస్తారు. ఇదే జరిగి ఉంటే విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ఇంత దారుణంగా దెబ్బతిని ఉండేది కాదని రాజకీయ విశ్లేషకుల భావన.  

రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమే.. పల్లం రాజుకు భవిషత్తులో రాజకీయంగా కలిసి రావొచ్చేమో .. జన్మదిన శుభాకాంక్షలు పల్లం రాజు గారు.