పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కి పెషావర్ హైకోర్టు ఉరి శిక్ష విధించింది. చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వంలోని ప్రత్యేక న్యాయస్థానం యొక్క ముగ్గురు సభ్యుల ధర్మాసనం, దేశ ద్రోహం కేసులో ముషారఫ్ కి మరణశిక్ష విధించింది.
పాకిస్తాన్ మాజీ మిలటరీ చీఫ్ మరియు అధ్యక్షుడు అయిన ముషారఫ్ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఉన్నారు. నవంబర్ 3, 2007లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్ పాకిస్థాన్‌లో అత్యవసర స్థితిని ప్రకటించారు. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించారు. అనేక మంది న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ముషారఫ్ పై 2013 డిసెంబర్‌లో, దేశ ద్రోహం కేసు నమోదయ్యింది. ముషారఫ్‌పై మార్చి 31, 2014 న దేశ ద్రోహ అభియోగాలు మోపారు. అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రాసిక్యూషన్ మొత్తం సాక్ష్యాలను ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టింది.
అవినీతి ఆరోపణలతో పాటుగా దేశ ద్రోహం ఆరోపణలు రుజువవ్వడంతో, ముగ్గురు సభ్యులతో కూడిన పెషావర్ హైకోర్టు ముషారఫ్ కి మరణ శిక్ష ఖరారు చేసింది. కాగా ప్రస్తుతం ముషారఫ్ దుబాయిలో నివాసం ఉంటున్నారు. ముషారఫ్ ను దుబాయ్ నుండి తిరిగి పాకిస్తాన్ కు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పాకిస్తాన్ పోలీసులు వెల్లడించారు. దీనితో పాకిస్తాన్ లో ఉరి శిక్ష పడిన తొలి ఆర్మీ ఛీఫ్ గా ముషారఫ్ వార్తల్లో నిలిచారు.
గతంలో పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేసిన జుల్ఫీకర్ అలీ భుట్టోకి తొలిసారిగా పాకిస్తాన్ లో మరణ శిక్ష విధించారు. మరణ శిక్ష పడిన రెండో అధ్యక్షుడిగా ముషారఫ్ నిలిచారు.