కరోనా మహమ్మారి కారణంగా మూడు నెలలకు పైగా ఇళ్లకే పరిమితమైన పాక్ ఆటగాళ్లు ద్వైపాక్షిక సిరీస్ కోసం ఇంగ్లాండ్‌కి చేరుకున్నారు. ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ పాక్ జట్టు ఇంగ్లీష్ గడ్డపై అడుగు పెట్టడం సాహసోపేతమైన చర్యగా భావించవచ్చు.
షెడ్యూల్ ప్రకారం జులై 30 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో పాక్ ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు,మూడు టీ-20ల సిరీస్ ఆడనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో నెల ముందుగా అక్కడికి పాకిస్థాన్ జట్టుని పంపాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పీసీబీని కోరింది. అందుకు అంగీకరించిన పీసీబీ నేడు తమ జట్టును ఇంగ్లాండ్‌కి పంపింది.
గత వారం ఇంగ్లాండ్ పర్యటన కోసం 29 మందితో కూడిన జట్టుని పీసీబీ ఎంపిక చేసింది. ముందు జాగ్రత్త చర్యగా అసాధారణ రీతిలో 10 మంది ఆటగాళ్లను అదనంగా పాక్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.గత బుధవారం ఎంపికైన క్రికెటర్‌లకు తొలి విడతగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించింది.అందులో ఏకంగా 10 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా కలవరపడిన పీసీబీ వారందరినీ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండమని సూచించింది.
కాగా శనివారం రెండోసారి 10 మంది క్రికెటర్‌లకి కరోనా టెస్టులు నిర్వహించగా ఆరుగురికి నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ జట్టుతో కలిసి వారు ఇంగ్లాండ్‌కి వెళ్లేందుకు పీసీబీ అనుమతించలేదు. కాగా ఆటగాళ్లకు మరోసారి నిర్వహించే పరీక్షలలో నెగటివ్ వస్తే వారు తిరిగి జట్టులో చేరుతారని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిం ఖాన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన ఆటగాళ్ల జాబితాలో హైదర్ అలీ, హరీస్ రౌఫ్, షాదబ్ ఖాన్, ఫకార్ జమాన్, ఖాసిఫ్ భట్టి, మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ హస్నేన్, మహమ్మద్ రిజ్వాన్, వాహబ్ రియాజ్, ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.
ఇక ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన షోయబ్ మాలిక్ జులై మూడో వారంలో జట్టుతో కలవమన్నాడు. లాక్‌డౌన్ కారణంగా షోయబ్ మాలిక్ తన భార్య సానియా మీర్జా, కొడుకు ఇజ్జాన్‌కి నెలలుగా దూరంగా ఉన్నాడు. వారితో కొన్ని రోజులు గడిపేందుకు పీసీబీని కోరగా అందుకు క్రికెట్ బోర్డు అనుమతించింది.
దీంతో ద్వైపాక్షిక సిరీస్ కోసం 18 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయ సిబ్బంది గల బృందం ప్రత్యేక చార్టెడ్ విమానంలో ఇంగ్లాండ్‌కి చేరుకుంది. అయితే అక్కడ పాక్ జట్టు 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనుంది. ఆటగాళ్ల నిర్బంధ గడువు ముగిసిన తర్వాత మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆ టెస్టులో నెగటివ్ వచ్చిన క్రికెటర్‌లు జూలై 13 నుండి డెర్బీషైర్ కౌంటీ మైదానంలో ప్రాక్టీస్ మొదలెడతారు. దేశవాళీ జట్లతో జరిగే రెండు 4 రోజుల సన్నాహక మ్యాచ్‌లలో ఆటగాళ్లు పాల్గొంటారు.