అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులకు కనీసం నాలుగు నెలల నుంచి జీతం అందలేదట. వారికి జీతాలు చెల్లించేందుకు నిధుల కొరత ఏర్పడిందట. అయితే, పాక్ రాయబారి చురుకుగా పాల్గొనడం అతన్ని మాత్రం రక్షించింది. పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో స్థానికంగా రిక్రూట్ చేయబడిన కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కనీసం ఐదుగురు ఆగస్టు 2021 నుంచి నెలవారీ వేతనాలు చెల్లించడం లేదని విసిగి పోయారు. అయితే పదేళ్లుగా ఎంబసీలో పని చేస్తున్న ఉద్యోగులలో ఒకరు జీతం చెల్లించక పోవడంతో సెప్టెంబర్‌లో రాజీనామా చేశారు. ఈ జీతాలు చెల్లించని స్థానిక కార్మికులను ఎంబసీ వార్షిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకుంది. వీరిలో ప్రతి ఉద్యోగికి నెలకు $2,000 నుండి $2,500 వరకు జీతం ఉంటుందట.
ఇక శాశ్వత లేదా కాంట్రాక్టు ప్రాతిపదికన చేరిన స్థానిక కార్మికులు ఆరోగ్య ప్రయోజనాలు సహా విదేశీ కార్యాలయ ఉద్యోగులు ప్రోత్సాహకాలు సహా ఎలాంటి అధికారాలు పొందరు. నివేదికల ప్రకారం, ఆర్థికంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఎంబసీలోని కాంట్రాక్టు కార్మికులు వీసా, పాస్‌పోర్ట్, నోటరైజేషన్ మొదలైన సేవలు అందించే కాన్సులర్ విభాగంలో పనిచేస్తున్నారు. ఈ జీతాలు పాకిస్తాన్ కమ్యూనిటీ వెల్ఫేర్ (PCW) ఫండ్ నుంచి చెల్లించబడుతుంది.
అయితే పాకిస్తాన్‌లో కోవిడ్ సంక్షోభం కారణంగా పిసిడబ్ల్యు కుప్పకూలిందని చెబుతున్నారు. ఎందుకంటే పిసిడబ్ల్యు నిధులు కోవిడ్ సమయంలో వెంటిలేటర్లు మరియు వైద్య పరికరాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించబడ్డాయి. కోవిడ్ సంక్షోభ పరిస్థితిని తగ్గించడానికి ఎంబసీ బలవంతంగా డబ్బు తీసుకోవలసి వచ్చిందని చెబుతున్నారు. ఇక నిధుల కొరత మరియు జీతాలు చెల్లించక పోవడానికి మరొక కారణం ఏమిటంటే, పాకిస్తాన్ ప్రభుత్వం డిజిటల్ కు మారింది. ప్రస్తుతం వీసా సేవలు NADRA (నేషనల్ డేటాబేస్ మరియు రిజిస్ట్రేషన్ అథారిటీ) సహాయంతో నిర్వహించబడుతున్నాయి. ఇది కూడా జీతాల కొరతకు ఒక కారణం అని అంటున్నారు. పాకిస్తాన్ ఎంబసికి చెందిన జీతాలు చెల్లించని కార్మికులు అక్టోబర్ నెలలో పాకిస్తాన్ రాయబారికి లేఖ రాశారు, దీంతో ఆయన ఈ సమస్యను పరిష్కరించాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. అలా మొత్తం మీద నవంబర్ నెలాఖరుకు పాకిస్తాన్ రాయబారి నిధులను పొందినట్లు తెలుస్తోంది. ఇది అమెరికా పరిస్థితి కాగా ఐరోపా దేశమైన సెర్బియాలో ఉన్న పాక్ ఎంబసీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను నేరుగా ఈ జీతాల అంశం మీద టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.
ద్రవ్యోల్బణం, మూడు నెలలుగా జీతం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్ దౌత్యవేత్తలు ఇమ్రాన్ ఖాన్‌ను నేరుగా ట్యాగ్ చేశారు. అయితే, ఈ ట్వీట్లు ఇప్పుడు తొలగించబడ్డాయి. అదే సమయంలో, తమ సెర్బియా రాయబార కార్యాలయ ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక మొదటి ట్వీట్‌లో ఇమ్రాన్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ , “ఇమ్రాన్ ఖాన్ గారు, ద్రవ్యోల్బణం మునుపటితో పోలిస్తే అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది, మూడు నెలలపాటు జీతం లేకుండా మేం ప్రభుత్వ అధికారులు మౌనంగా మీ కోసం ఎంతకాలం పని చేస్తారని మీరు ఆశిస్తున్నారు? మా పిల్లలు డబ్బు లేకుండా బలవంతంగా స్కూల్స్ మానేయాల్సి వస్తుంది. ఇదేనా కొత్త పాకిిస్తాన్? అని నేరుగా ప్రశ్నించారు. ఇక అదే ట్విట్టర్ హ్యాండిల్ నుండి “సారీ ఇమ్రాన్ ఖాన్ అయితే మాకు వేరే మార్గం లేదు” అని మరో ట్వీట్ చేసింది. ఇక సెర్బియా పాక్ ఎంబసీ హ్యాండిల్ నుంచి చేసిన ట్వీట్ వీడియో కూడా ఉండటం పెద్ద విషయం . ఈ వీడియోలో, ఇమ్రాన్ ఖాన్ పాత నినాదం ‘ఆప్కో జబర్నా నహీ హై’ ని ఎగతాళి చేశారు. ఇందులో పిండి, పంచదార ధరల కారణంగా పిల్లల ఫీజులు పెంచడం మీద కూడా ఇమ్రాన్ అప్పటి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
అయితే సొంత సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నా పాకిస్తాన్ ప్రభుత్వం తాము స్పాన్సర్ చేస్తున్న ఉగ్రవాద శిబిరాలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రానీయకుండానే చూసుకుంటూ ఉండి ఉంటుందని విశ్లేషకుల అంచనా! అలాగే ఏమన్నా సరే ముందు భారత్ మీద ఒంటి కాలి మీద లేస్తూ ఉండే పాకిస్తాన్ సొంత సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉందని విమర్శిస్తున్నారు.