Idream media
Idream media
పాకిస్తాన్ లో ప్రజలు ఉద్యమ బాట పట్టారు. దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రక్షణ వ్యవస్థ విఫలమైందంటూ నిరసన గళం విప్పుతున్నారు. ఆ ఉద్యమాన్ని అణిచేందుకు ప్రభుత్వం, ఆర్మీ శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అయినా, ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి నుంచి వచ్చిన ఉద్యమాన్ని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గద్దె దిగాలంటూ 11 పార్టీల అతి పెద్ద విపక్ష కూటమి నిర్వహించిన భారీ ర్యాలీ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మానవ హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆ కూటమి ఆరోపిస్తూ చేసిన నినాదాలు పెల్లుబికాయి. నిరసనలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మదనపడుతున్నప్పటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవారు. కానీ, తాజాగా చేసిన ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రభుత్వంలో మొదలైన కలవరపాటుకు నిదర్శనంగా మారింది.
ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వంతో బాటు తన నేతృత్వంలోని అధికార పార్టీని సైతం ఇబ్బందుల్లో పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి అని ఈ సందర్భంగా ఆయన 1984 నాటి బాలీవుడ్ చిత్రంలోని ఓ క్లిప్ ను వినియోగించుకున్నారు. ‘ఇంక్విలాబ్’ అనే ఆ సినిమాలో అవినీతి నేత పాత్ర పోషించిన నటుడు ఖాదర్ ఖాన్.. ఎన్నికైన ఓ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎలాంటి కుయుక్తులు పన్నాలో తమ పార్టీ నేతలకు సవివరంగా వివరాలు చెప్తారు. ప్రజలే ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకునేలా వారిలో మార్పును తేవాలని మన చేతులకు మట్టి అంటకుండా చూసుకోవాలని ఆయన తమ పార్టీ సభ్యులకు బోధిస్తారు. దానికోసం 50 లక్షలు ఖర్చయినా ఫరవాలేదని అంటాడు. మరి ఒక్కసారిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చిందో కానీ ఈ సినిమా క్లిప్ ని తన ట్విటర్ లో పోస్ట్ చేసి.. ఇది తన ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర మాదిరే ఉందంటూ చెప్పుకొచ్చారు.
సైన్యం చేతిలో ఇది కీలుబొమ్మ సర్కార్ అని పలువురు విపక్ష నేతలు దుయ్యబడుతున్న తరుణంలో ఇమ్రాన్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. తన ప్రభుత్వంపై పెల్లుబికుతున్న నిరసనలకు, విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని సూచించేందుకు ఇమ్రాన్ ఖాన్ ఓ బాలీవుడ్ మూవీలోని ఈ క్లిప్ ను వాడుకోవడాన్ని అనేక మంది ట్విటర్ యూజర్లు ట్రోల్ చేస్తున్నారు. తన పదవికి ఎక్కడ గండం పట్టుకుంటుందోనని ఇమ్రాన్ ఖాన్ కి భయం వేస్తున్నట్టు ఉందని అయినా ఓ సినిమా క్లిప్ ను ఆయన వినియోగించుకోవడమేమిటని చాలా మంది రీ ట్వీట్ చేస్తున్నారు. మొత్తమ్మీద ఓ ట్వీట్ ఇమ్రాన్ ఆందోళనను వ్యక్తపరుస్తోందని భావిస్తున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వీడియో క్లిప్ పెట్టారో గానీ, దాని ద్వారా ఆయన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. పాక్ లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు ఎప్పుడో వేచి చూడాలి.