iDreamPost
android-app
ios-app

గెలిచే కాదు ఓడిపోయి రికార్డ్ సృష్టించొచ్చు ,ఎలానా?

  • Published Sep 02, 2021 | 11:10 AM Updated Updated Sep 02, 2021 | 11:10 AM
గెలిచే కాదు ఓడిపోయి రికార్డ్ సృష్టించొచ్చు ,ఎలానా?

ఎన్నికల్లో పోటీ చేసేవారందరూ ఎలాగోలా గెలవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆయన మాత్రం ఓడిపోవాలనే కోరుకుంటారు. ఓటమి కోసమే నామినేషన్ వేస్తారు. ఎన్నికలంటేనే.. వరుస విజయాలు, హ్యాట్రిక్ లు, ఓట్లు, మెజారిటీల రికార్డులు..వంటి లెక్కలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఆ పోటీదారు లెక్కలు వేరు. ఎన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయాం.. ఎంతమంది ప్రముఖులపై పోటీ చేశామన్నదే ఆయనకు ముఖ్యం. ఆ లెక్కలే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రముఖ రికార్డుల పుస్తకాల్లో చోటు కల్పించాయి. విజయాలతోనే కాదు.. ఓటములతోనూ చరిత్ర సృష్టించవచ్చని నిరూపించిన ఆ వ్యక్తే తనను తాను ఎలక్షన్ కింగుగా ప్రకటించుకున్న డాక్టర్ పద్మారాజన్.

ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..

పద్మారాజన్ ఇప్పటివరకు 219 సార్లు పలు రకాల ఎన్నికల్లో పోటీచేసి రికార్డ్ ఓటములను తన ఖాతాలో వేసుకున్నారు. తమిళనాడులోని మెట్టూరు సమీపంలో ఉన్న ఎరిటై పులియ మరత్తురు ఆయన స్వగ్రామం. వృత్తిరీత్యా హోమియో వైద్యుడు.. తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. మొదట్లో ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఆయనకు అసలు ఉండేదికాదు. అయితే అధికారం, పరపతి ఉన్నవారే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారన్న స్నేహితుల అభిప్రాయాలతో విభేదించిన పద్మరాజన్ సామాన్యులేవరైనా సరే పోటీ చేయవచ్చు..అని నిరూపించేందుకు 1988లో ఈ యజ్ఞం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 219 ఎన్నికల్లో నామినేషన్లు వేసి సుమారు రూ.51 లక్షలు డిపాజిట్ల రూపంలో కోల్పోయారు.

అయినా ఆ డిపాజిట్లకు మించిన కీర్తి సంపాదించారు. 2004, 2014, 2015 సంవత్సరాల్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ‘మోస్ట్ అన్ సక్సెస్ ఫుల్ కాంటెస్టెంట్’ గా స్థానం పొందారు. ఇన్నిసార్లు పోటీ చేసినా తనకు ఎన్ని ఓట్లు లభిస్తున్నాయో కూడా పట్టించుకోరు. నామినేషన్ డిపాజిట్ తప్ప ప్రచారానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టారు. 2011లో తన సొంత నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు లభించిన 6273 ఓట్లే అత్యధికమని చెప్పారు.

13 రాష్ట్రాల్లో పోటీ

పోటీ..ఓటమిలో రికార్డులు సృష్టించాలన్న పద్మారాజన్ లక్ష్యం అతన్ని రాష్ట్రం దాటించింది. తమిళనాడు, ఏపీ, కేరళ, కర్ణాటక, ఢిల్లీ తదితర 13 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నామినేషన్లు వేశారు.

పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి రాష్ట్రపతి ఎన్నిక వరకు దేన్నీ వదల్లేదు. సహకార సంఘాలు, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోకసభ, రాజ్యసభ, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు.

లోకసభకు 36సార్లు, రాజ్యసభకు 41సార్లు, అసెంబ్లీకి 61సార్లు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చెరో ఐదుసార్లు పోటీ చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ లను సవాల్ చేశారు. ప్రధాని అభ్యర్థులు వాజపేయి, మన్మోహన్ సింగు తదితరులను ఎదుర్కొన్నారు. 11 మంది సీఎం అభ్యర్థులపై పోటీ చేశారు. అందులో మూడుసార్లు దివంగత జయలలితనే సవాల్ చేశారు. 13 మంది కేంద్ర మంత్రులు, 15 మంది రాష్ట్ర మంత్రులు, ఏడు పార్టీల అధినేతలపైనా నామినేషన్లు వేసి రికార్డ్ సృష్టించారు.

తాజాగా తమిళనాడులో రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలో నామినేషన్ వేశారు. అయితే బలపరిచేందుకు ఎమ్మెల్యేలు లేకపోవడంతో దాన్ని అధికారులు తిరస్కరించారు. కాగా అత్యధిక సార్లు ఓడిపోయిన వ్యక్తిగా ఇటీవల ఢిల్లీ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా పద్మారాజన్ పేరు నమోదు చేశారు.