Idream media
Idream media
వందలు సంవత్సరాల చరిత్ర ఉన్న కళారూపం తోలుబొమ్మలాట. రామాయణ, భారతాలను ఇంటింటికి చేర్చడంలోనే కాక, నాటి భారతీయులలో స్వాతంత్ర్య స్పృహ నింపడంలోనూ, వరకట్నం, మద్యపానం వంటి సాంఘిక దురాచారాలను రూపుమాపడంలోను ప్రముఖ పాత్ర వహించిన కళారూపం ఇది.
ఎందరో కళాకారులకు అన్నంపెట్టిన ఆ కళారూపం భవిష్యత్తు టీవీలు, సినిమాలు రావడంతో కొడగొట్టిన దీపమయ్యింది. అటువంటి అపురూప కళకు, అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామం నెలవయ్యింది. ఎక్కడినుండో ఒచ్చిన కళాకారులను ఆదరించి తన అక్కున చేర్చుకుంది. అంతరిస్తోన్న ఈ కళారూపానికి మరో చిరునామా అయ్యింది. నిమ్మలకుంటకు చెందిన దళవాయి చలపతి రావు గారు, వారి కుటుంబం దాదాపు 70 సంవత్సరాలుగా తోలుబొమ్మల కళారూప రంగంలో విశేష కృషి చేసి భవిష్యత్తు తరాల కోసం ఈ కళను సజీవంగా ఉంచుతున్నారు.
వందల ఏళ్ల క్రితం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ప్రోద్బలంతో అనేక మంది తోలుబొమ్మల కళాకారుల కుటుంబాలు ఈ కళారూపాన్ని , సంస్కృతినీ ప్రచారం చేయటానికి దేశమంతటా వలస వెళ్ళాయి. అలా కర్ణాటక వెళ్ళిన కుటుంబాలు హసన్, మండ్యలలో స్థిరపడగా, తెలుగునాట వారు నిమ్మలకుంటలో స్థిరపడ్డారు. నాటి నుండి తరతరాలుగా తోలుబొమ్మల కళా ప్రదర్శనలు ఇస్తూ జీవిస్తున్నారు.
Also Read:తోలు బొమ్మలాట
తోలుబొమ్మలాట కళారూపంలో అనేక రకాలున్నాయి. జంతు చర్మం మీద పౌరాణిక పాత్రలు అందంగా చిత్రీకరించి తెరవెనుక ప్రదర్శించే ఛాయా తోలుబొమ్మలాట / నీడ తోలుబొమ్మలాట (shadow puppetry) ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ది. అటువంటి తోలుబొమ్మలాట కళాకారులకు చిరునామా అనంతపురం జిల్లా, ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట. సాంప్రదాయ తోలుబొమ్మలాట ప్రదర్శనలో రామాయణ, మహాభారత ఇతివృత్తాలదే ప్రధాన భూమిక.
దళవాయి చలపతిరావు గారు 1936వ సంవత్సరంలో నిమ్మలకుంట గ్రామంలో తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబంలో జన్మించారు. 13వ ఏటనే తండ్రి దళవాయి ఖడే రావు గారి ప్రోద్బలంతో వారసత్వంగా వచ్చిన ఈ కళను ఆకలింపు చేసుకుని అనతికాలంలోనే ఈ పరిశ్రమలో నిష్ణాతులయ్యారు.
తోలుబొమ్మల తయారీలో, తోలుబొమ్మలాట ప్రదర్శనలో ఈయనది అందెవేసిన చెయ్యి. వీరి ప్రద ర్శనలకు సుందరాకాండ, లంకాదహనం, సుగ్రీవ పట్టాభిషేకం వంటి రామాయణ ఇతివృత్త సన్నివేశాలు మూలం. దేశ వ్యాప్తంగా అనేక ప్రద ర్శనలు ఇవ్వడంతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలలో పదుల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చారు. 1988వ సంవత్సరంలో తోలుబొమ్మల తయారీలో జాతీయ ఎక్సలెన్స్ అవార్డు, 1997లో గోల్డెన్ జూబిలీ (స్వర్ణోత్సవ) పురస్కారం, 2006లో శిల్ప గురు పురస్కారం, వంటి జాతీయ పురస్కారాలతో పాటు అనేక అంతర్జాతీయ ప్రశంశా పత్రాలు కూడా అందుకున్నారు. అవార్డులతో పాటు 1991లో జర్మనీ దేశం నుండి ప్రశంశా పత్రం, 1999వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశ ప్రశంశా పత్రం అందుకున్నారు. చలపతి రావు గారి భార్య సరోజమ్మ, కుమారులు మరియు కుమార్తె అందరూ తోలుబొమ్మల కళాకారులే.
టివీలు, సినిమాల రావడంతో నాటకాలు, తోలుబొమ్మలాట వంటి సంప్రదాయ కళారూపాలు ఆదరణ కోల్పోవడం మొదలయ్యింది. అటువంటి పరిస్థుతులలో నిమ్మలకుంట గ్రామం, దళవాయి కుటుంబం ప్రత్యామ్నాయంగా ఆధునిక అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా తోలుతో బొమ్మల బదులు Lamp Shades, Wall Hangings వంటి కళాకృతులు తయారుచేసి అమ్ముతూ, ఈ కళారూపాన్ని సజీవంగా ఉంచుతున్నారు. ఇప్పటివరకు అనేక మంది కళాకారులను తోలుబొమ్మలాట కళలో తీర్చిదిద్దిన చలపతిరావు గారు, 80వ దశకంలోనూ యువ కళాకారులకు గురువుగా, మార్గదర్శిగా వ్యవహరిస్తూ తోలుబొమ్మలాట కళారూపానికి ఊపిరులూదుతున్నారు.
దళవాయి కుటుంబం ఆంధ్ర తోలుబొమ్మల కళారూపానికి, నిమ్మలకుంట గ్రామానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. కళారంగంలో దళవాయి చలపతి రావుగారు చేసిన సేవకు గాను కేంద్ర ప్రభుత్వం వీరిని 2020 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
రాష్ట్రంలో గుర్తింపు నోచుకోని అనేక మంది పేద కళాకారులకు, బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియని రాయలసీమ హస్తకళలకు సరైన గుర్తింపు, ప్రాచుర్యం కల్పించడంలో చలపతిరావుగారికి దక్కిన పద్మశ్రీ పురస్కారం మొదటి అడుగు అవుతుందని ఆశిద్దాం.
తోలుబొమ్మలాంటి అంతరిస్తున్న కళకు అందరి ప్రోత్సాహం అవసరం. చలపతిరావు లాంటి కళాకారులను గుర్తించటం, గౌరవించటం అంటే ఆ కళను ప్రోత్సహించటమే.
–Written by Ravi Teja