iDreamPost
android-app
ios-app

AP Government Schools – నమ్మలేని నిజం.. ప్రభుత్వ బడి బాటలో విద్యార్థులు

  • Published Jan 26, 2022 | 4:09 AM Updated Updated Jan 26, 2022 | 4:09 AM
AP Government Schools – నమ్మలేని నిజం.. ప్రభుత్వ బడి బాటలో విద్యార్థులు

విద్యారంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు కునారిల్లి.. అడ్మిషన్లు తగ్గిపోయి, డ్రాపౌట్లు పెరిగిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు చేరికల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ నిలబడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. గత రెండేళ్లలో ఏకంగా 13లక్షల మంది విద్యార్థుల అడ్మిషన్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.

సత్ఫలితాలిస్తున్న పథకాలు..

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అవి ఇప్పుడు సత్ఫలితాలిస్తున్నాయి. పాఠశాలలకు సంబంధించి అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలు చేపట్టగా.. ఉన్నత విద్యకు సంబంధించి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనతో పాటు నాడు–నేడు పథకం కింద అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేయిస్తున్నారు.

విద్యాపరంగా సంస్కరణలు..

సిలబస్, పాఠ్య ప్రణాళికల సంస్కరణలతో విద్యాపరంగా కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపు ప్రధాన లక్ష్యంగా పాఠశాలల్లో అనేక వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. అలాగే, కళాశాల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు డిగ్రీ హానర్స్‌ కోర్సులు, ఒక ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్, మైక్రోసాఫ్ట్‌ తదితర పేరెన్నికగన్న సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగిస్తున్నారు. వీటన్నింటి ప్రభావం కారణంగా రాష్ట్రంలో ప్రతి తల్లి, తండ్రీ తమ పిల్లలను చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో పాఠశాలలకు పంపిస్తున్నారు.

గతంలో తమతో పాటు పనులకు పిల్లలను తీసుకువెళ్లే నిరుపేద కుటుంబాలు సైతం ఇప్పుడు తమ పిల్లలను స్కూళ్లకు వెళ్లేలా చేస్తున్నాయి. ఫలితంగానే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. చివరికి ‘సీట్లు లేవు’ అని అనేక పాఠశాలలకు బోర్డులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం.