iDreamPost
android-app
ios-app

ఇంట్లో వినోదానికి లోటు లేదిక

  • Published Apr 30, 2021 | 9:01 AM Updated Updated Apr 30, 2021 | 9:01 AM
ఇంట్లో వినోదానికి లోటు లేదిక

థియేటర్లు దాదాపు మూతబడి సినీ ప్రేమికులు దీనంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఇలాంటి విపత్కాల సమయంలో వాటి గురించి ఆలోచించడం కరెక్ట్ కాకపోయినా సగటు భారతీయుల వినోదంలో కీలక పాత్ర పోషించే సినిమాలు ప్రతి శుక్రవారం రాకపోతే ఏదోలా ఫీలయ్యే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అందుకే ఇవాళ ఓ ముక్కు మొహం తెలియని అసలెప్పుడు షూటింగ్ జరిగిందో కూడా అర్థం కాని ఒక చిన్న మూవీ రిలీజైతే దానికి చెప్పుకోదగ్గ స్క్రీన్లు దొరికాయి. అఫ్కోర్స్ చూసేందుకు ఎవరు లేరు అది వేరే విషయం. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. అయితే ఓటిటిలు ఆ కొరతను తగ్గించేందుకు గట్టి ప్లాన్లతో సిద్ధంగా ఉన్నాయి.

ఆల్రెడీ నిన్న అర్ధరాత్రి నుంచి వకీల్ సాబ్, సుల్తాన్ లు ఏకకాలంలో స్ట్రీమింగ్ జరుపుకుని వ్యూస్ తో రచ్చ చేస్తున్నాయి. ఆయా యాప్స్ లో వీటికి రికార్డు వీక్షణలు వస్తాయని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. రాబోయే 7న డిజిటల్ రిలీజ్ కాబోతున్న అనసూయ థాంక్ యు బ్రదర్ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. రేపు సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ ని వదలబోతున్నారు. నితిన్ చెక్, రంగ్ దేలు కేవలం రోజుల గ్యాప్ లో రాబోతున్నాయి. థియేటర్లో దారుణంగా బోల్తా కొట్టిన రానా అరణ్య హక్కులు జీ సంస్థ చేజిక్కించుకుందని సమాచారం. మంచు విష్ణు మోసగాళ్లు కూడా రెడీ అవుతోంది. ఇవన్నీ మేలోనే వచ్చేస్తాయి.

ఇవి కాకుండా అర్ధ శతాబ్దం లాంటి కంటెంట్ ఉన్న మూవీస్ కూడా డైరెక్ట్ ఓటిటిని ఆప్షన్ గా పెట్టేసుకున్నాయి. ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ, ఏక్ మినీ కథలు కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇవి కాకుండా సుమారు ఇరవై దాకా చిన్న సినిమాలు ఓటిటి ప్రతినిధులతో చర్చల్లో ఉన్నట్టు సమాచారం. డీల్స్ కన్ఫర్మ్ కాగానే డేట్లు బయటికి వచ్చేస్తాయి. ఇక తమిళం మలయాళంలోనూ ఈ తరహా దూకుడు కనిపిస్తోంది. సబ్ టైటిల్స్ సహాయంతో చూసే వెసులుబాటు ఉండటంతో మూవీ లవర్స్ వీటిని కూడా కవర్ చేయడం లేకపోలేదు. మొత్తానికి ఇంట్లోనే ఉండే జనానికి మాత్రం ఎంటర్ టైన్మెంట్ కి లోటు లేనట్టే