iDreamPost
iDreamPost
గత ఏడాది లాక్ డౌన్ టైంలో జనాలంతా ఇళ్లలోనే ఉండాల్సిన తరుణంలో ఎంటర్ టైన్మెంట్ పరంగా వాళ్లకు కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు అందించిన ఓటిటి ప్లాట్ ఫార్మ్ ల దూకుడు తగ్గినట్టేనా అని ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది. నిన్న నాగార్జున తన ప్రెస్ మీట్ లో వైల్డ్ డాగ్ సినిమాను నెట్ ఫ్లిక్స్ తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మరీ థియేటర్లకు వస్తున్నామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ నిజంగా ఎదురు చూడాలి అనుకున్నప్పుడు ఉప్పెన తరహాలో ఎంత లేట్ అయినా ఆగి ఉండాల్సింది కదా. మరి అయిదు నెలల క్రితం ఎందుకు తొందరపడ్డారనే ప్రశ్నకు సమాధానం రిలీజయ్యాక తెలుస్తుంది.
నిజానికి ఓటిటి దూకుడు తాత్కాలికంగా తగ్గినట్టు కనిపిస్తున్నా ఫ్యూచర్ ని తక్కువ అంచనా వేయలేం. ప్రైమ్ తో పాటు ఇతర డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలన్నీ భారీ పెట్టుబడులను సిద్ధం చేసుకుంటున్నాయి. సినిమాలు హాళ్లలో వచ్చినా సరే తక్కువ గ్యాప్ లో తమ యాప్స్ లో రిలీజ్ చేసేలా ఊరించే ఆఫర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. దానికి నిదర్శనమే మాస్టర్, క్రాక్ లు. ఇప్పుడు మంచి టాక్ తో నడుస్తున్న నాంది కూడా అదే దారిలో ఉంది. కొన్ని మూవీస్ డీల్స్ సెట్ కాక వేచి చూస్తున్నాయి. జాంబీరెడ్డి ఎందులో వస్తుందో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇలా చాలా సినిమాలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి.
గత రెండు నెలలను విశ్లేషించుకుంటే థియేటర్లో వచ్చిన ప్రతి సినిమా ఆడలేదు. కాకపోతే దారుణమైన కంటెంట్ ఉన్నవి కూడా అంతో ఇంతో వసూళ్లు తెచ్చుకున్నాయంటే కేవలం తెలుగు ప్రేక్షకులకు ఉన్న సినిమా ప్రేమ తప్ప మరొకటి కాదు. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కి తమకు ప్రత్యాన్మయం వద్దని గత రెండు నెలలుగా ఋజువు చేస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో మరీ చిన్న సినిమాలకు సిల్వర్ స్క్రీన్ మనుగడ కొంత కష్టమే. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక చతికిలపడిన చిత్రాలు చాలానే వచ్చాయి. వారం వ్యవధిలోనే అవన్నీ ఓటిటిలో ప్రత్యక్షం కావడం గమనార్హం. సో డిజిటల్ ట్రెండ్స్ ని ఇప్పటికిప్పుడు తక్కువ అంచనా వేయలేం