iDreamPost
iDreamPost
థియేటర్లు మూతబడి ఏడో నెలలో అడుగు పెడుతున్న వేళ నిర్మాతలు వేరే ఆప్షన్ లేక ఓటిటి వైపే మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడులు సేఫ్ కావాలంటే ఇంత కన్నా మార్గం లేదు. మరోవైపు వడ్డీల భారం కూడా కొందరు ప్రొడ్యూసర్ల మీద గుదిబండగా మారుతోంది. ఎప్పుడైతే దిల్ రాజు డేరింగ్ గా డెసిషన్ తీసుకుని ‘వి’ని ప్రైమ్ లో రిలీజ్ చేశారో ఇక అప్పటి నుంచి మిగిలినవాళ్లు కూడా తమ ప్లానింగ్ ని వేగవంతం చేశారు. ఇప్పుడు రాజ్ తరుణ్ వంతు వచ్చింది. ఒరేయ్ బుజ్జిగా అక్టోబర్ 2న నేరుగా ఆహా ద్వారా రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. అల్లు వారి యాప్ కి ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద డైరెక్ట్ ఓటిటి రిలీజ్. హక్కుల కోసం సుమారు నాలుగు కోట్ల దాకా చెల్లించినట్టు ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ దానికి ధృవీకరణ లేదు.
వి తర్వాత కాస్త స్టార్ వేల్యూ ఉన్న సినిమా ఈ ఒరేయ్ బుజ్జిగానే. ఇప్పటిదాకా మలయాళం తమిళం డబ్బింగ్ లతో నెట్టుకొస్తున్న ఆహా దీంతో సబ్స్క్రైబర్స్ భారీగా పెరుగుతారని అంచనా వేస్తోంది. ఒకవేళ టాక్ బాగా వస్తే వ్యూస్ వెల్లువలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒరేయ్ బుజ్జిగాలో మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లు. గతంలో గుండె జారీ గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం తీసిన విజయ్ కుమార్ కొండా దర్శకుడు. టీజర్ తో ఓ మాదిరి అంచనాలు రేపారు కానీ ట్రైలర్ వచ్చాకే కంటెంట్ మీద బెటర్ క్లారిటీ వస్తుంది. రాజ్ తరుణ్ థియేట్రికల్ మార్కెట్ అసలే అంతంత మాత్రంగా ఉంది. అందులోనూ కరోనా వల్ల చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఒరేయ్ బుజ్జిగాకు ఈ రూటే కరెక్ట్.
ఇతర తెలుగు సినిమాలు కూడా వచ్చే నెలలో ఓటిటి విడుదల ప్లాన్ చేసుకుంటున్నాయి కాబట్టి ఒరేయ్ బుజ్జిగా టీమ్ డీసెంట్ డేట్ ని లాక్ చేసుకుంది. ఎలాగూ నేషనల్ హాలిడే కాబట్టి ఎక్కువ మంది చూస్తారని అంచనా. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందినప్పటికీ ఇందులో ఏదో డిఫరెంట్ పాయింట్ ఉందన్న హింట్ యూనిట్ అప్పుడప్పుడు ఇస్తున్నప్పటికీ అదేంటనేది మాత్రం బయటికి రాలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ కనక పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటే రాజ్ తరుణ్ సినిమాని ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రేక్షకులు చూసిన ఘనత ఒరేయ్ బుజ్జిగాకే చెందుతుంది. అయితే అది తెలియాలంటే ఇంకో 21 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈలోగా ప్రమోషన్లు కూడా గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు.