iDreamPost
iDreamPost
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో విపక్షాలకు స్పష్టత కానరావడం లేదు. జగన్ విధానాలను విమర్శించాలంటే ప్రతిపక్షాలకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళన ఉంది. దేశంలోనే ఎన్నడూ లేని జగన్ చేపడుతున్న పథకాలు దానికి సాక్షంగా ఉన్నాయి. ఉదాహరణకు అందరికీ ఇళ్లు నిర్మించాలనే సంకల్పం తీసుకున్న సీఎం చరిత్రలో ఇంతవరకూ లేరు. ఇల్లు లేని పేదవాళ్లు లేకుండా చూస్తాం అన్నారే గానీ చేతల్లో ఇంటిస్థలం ఇచ్చి, దానిని నిర్మించడానికి పూనుకున్న పెద్ద మనుషులు లేరు. కానీ జగన్ మాత్రం దానిని ఆచరణలో పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో ఉన్న రాష్ట్రంలో ఆశయం మంచిదే అయినా కొన్ని ఆటంకాలు అనివార్యం. వాటిని అధిగమిస్తూ ముందుకెళతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
సమస్యలన్నింటినీ పరిష్కరించి, సామాన్యుల సమగ్రాభివృద్ధి సాధించే దిశలో పయనిస్తామని అంటోంది.
ఇతర అనేక పథకాల విషయంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. దేశంలో అనేక రాష్ట్రాలు ఏపీని ఇప్పుడు రోల్ మోడల్ గా చూడాల్సిన స్థితి వచ్చింది. సచివాలయ వ్యవస్థ నుంచి రైతు భరోసా కేంద్రాల వరకూ , ఇంగ్లీష్ మీడియం చదువుల నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ వరకూ అనేక ప్రయోగాలకు ఏపీ ఇప్పుడు కేంద్ర స్థానంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలను విమర్శించాలంటే విపక్షాలకు తటపటాయించాల్సి వస్తోంది. ఆయా పథకాల కారణంగా ప్రజలు నేరుగా లబ్ధిపొందుతున్నారు. సామాన్యుల ఖాతాలకు నెలనెలా ప్రయోజనం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు పూనుకున్న ప్రతీసారి అది ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బలా అవుతుంది. వారి లక్ష్యాలు నెరవేరకపోగా విమర్శల కోసం విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలపడి వారి ఎత్తులు బూమరాంగ్ అవుతున్నాయి.
జగన్ విధానాలను విమర్శిస్తే జనం హర్షించడం లేదనే నిర్ణయానికి వచ్చిన విపక్ష పార్టీలు ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్ ని నిందించే లక్ష్యంతో సాగుతున్నాయి. ఆయన వ్యక్తిత్వం మీద గురిపెట్టాలని చూస్తున్నాయి. కానీ గతంలో కూడా జగన్ వ్యక్తిత్వం మీద చేసిన వ్యాఖ్యలన్నీ జగన్ కే మేలు చేశాయన్నది అనుభవం చెబుతోంది. జగన్ మొండివాడు, ఎవరి మాట వినడని పదే పదే ప్రచారం చేశారు. కానీ నిజానికి అది ప్రజల్లో ఆయన నిజంగానే మొండివాడు..లేదంటే ఇన్ని కష్టాలు ఎలా భరిస్తాడు..ఇంత కష్టంలో కూడా ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు ఎలా అందిస్తాడనే వాదనే ప్రజల్లో వినిపిస్తోంది. జగన్ అవినీతిపరుడని ముద్ర వేయాలని చూస్తే క్షేత్రస్థాయిలో కొందరు నేతలు కక్కుర్తి పడవచ్చు గానీ సీఎం స్థానంలో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదనే జనం విశ్వసిస్తున్నారు. చివరకు ఆయన మీద మతం ముద్ర వేయాలని చూసినా మతసామరస్యానికి అనుగుణంగా కుల, మత ప్రస్తావనలేని పాలన సాగుతుండడం జనాలు గుర్తిస్తున్నారు.
ఇక ఇప్పుడు ఏపీలో అప్పులకుప్పలు అంటూ కొత్త వాదన తెస్తున్నారు. వాస్తవానికి పరిమితికి మించి అప్పులు చేసేసి, ఏపీలో జీతాలివ్వడానికి కూడా పైసా లేకుడా చేసిన ఘనత చంద్రబాబుదే. దానికి తోడు కరోనా కష్టాల కారణంగా కొత్తగా అప్పులతోనే వ్యవస్థను నెట్టుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది. దానిని గాడిలో పెట్టి, మళ్లీ ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అప్పులో అప్పులంటూ గగ్గోలు పెడుతున్న వైనం ప్రజలు గుర్తిస్తున్నారు. ఓ వర్గం మీడియాలో తప్ప ప్రజల్లో ఈ అప్పుల గురించి పెద్దగా చర్చ సాగడం లేదు. ప్రతీ నెలా జగన్ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల సంగతి గురించే సామాన్యులు చర్చించుకుంటున్నారు. ఇది ప్రతిపక్షాలకు అర్థం కాక కొంత, అర్థమయినా దానిని జీర్ణం చేసుకోలేక కొంత ప్రభుత్వం మీద దాడికి పూనుకుంటున్నా ప్రజలకు మాత్రం అది రుచించడం లేదన్నది వాస్తవం. ప్రభుత్వంలో చిన్నచిన్న తప్పిదాలు ఉన్నప్పటికీ గతంలో కన్నా తమకు మెరుగైన పాలన అందుతోందని మూడింతల మంది భావిస్తున్నారు. విపక్షాల విమర్శలను వారే తిప్పికొడుతున్నారు.
జగన్ వేసిన ఎత్తులతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కరోనా వంటి విపత్తుల కాలంలో కాలంలో కలవరపడకుండా, ధృఢచిత్తంతో సీఎం సాగుతున్న తీరు వారిని కూడా విస్మయపరుస్తోంది. ఓవైపు ఆయన మీద నమోదయిన కేసుల పేరుతో, రెండోవైపు వ్యక్తిగత విమర్శలతో, మూడోవైపు కేంద్రం, న్యాయస్థానాల ద్వారా ఇరకాటంలో పెట్టే యత్నాలు ఎన్ని చేసినా సీఎం మాత్రం చలించడం లేదు. తన దారి రహదారి అన్నట్టుగా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడం, పాతవాటిని పక్కాగా అమలు చేయడంపైనే ఆయన దృష్టి ఉంటోంది. దాంతో ఆంధ్రప్రదేశ్ లో జగన్ వ్యతిరేకులకు ఇది మింగుడుపడడం లేదు. ప్రజాక్షేత్రంలో పూర్తిస్థాయి పట్టుని కొనసాగిస్తున్న జగన్ ని ఎదుర్కోవడం ఎలా అన్నది అర్థంకాకపోవడంతో అవస్థల్లో నలిగిపోవాల్సి వస్తోంది.