వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా.. స్వల్ప తేడాలతో ప్రకటించిన పోల్స్‌లో ఎవరిది నిజమవుతుంది. ? మరో గంటలో ఇది తేలిపోనుంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యజిక్ ఫిగర్‌కు టీఆర్ఎస్ మాత్రమే దగ్గరగా ఉంది. జీహెచ్ఎంసీ పీఠంపై గులాబీ జెండా ఎగిరిస్తే.. జాతీయ నాయకులు రంగంలోకి దిగి ప్రచారం చేసిన బీజేపీ పరిస్థితి ఏమిటీ.. పాతబస్తీలో ఎంఐఎంపై అక్కడి ప్రజలు ఎలాంటి తీర్పునివ్వనున్నారు. ఆయా అంశాలు ఆసక్తిగా మారనున్నాయి. బల్దియా పరిధిలోని 150 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట లోపు అన్ని స్థానాలపై స్పష్తత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లకు కార్పొరేటర్ల స్థానాలు ఎవరు గెలవబోతున్నారో మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ ఒకటినే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. అయితే టెక్నికల్ సమస్య కారణంగా ఓల్డ్ మలక్ పేట స్థానంలో ఈ నెల 3న రీపోలింగ్ నిర్వహించారు. ఇప్పుడు అన్నీ కలిపి 150 డివిజన్లకు ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు. సర్కిల్‌కు ఒక కౌంటింగ్ కేంద్రం చొప్పున 30 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు పటిష్ట పోలీసు భద్రతా, సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు.
అన్ని స్థానాలకు ఎన్నికలు ముగియడంతో గురువారం సాయంత్రం నుంచే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన పలు ప్రముఖ సర్వేల్లో రాజకీయ పార్టీల వారీగా 5-10 స్థానాల వరకూ తేడా కనిపిస్తోంది. అయితే అన్ని పోల్స్ సర్వేలు కూడా జీహెచ్ఎంసీలో మెజారిటీ డివిజన్లను టీఆర్ఎస్‌కే గెలుచుకుంటుందని, మేయర్ స్థానం కూడా ఆ పార్టీకే కొనసాగుతుందని స్పష్టం చేశాయి.
టీఆర్ఎస్‌కు ప్రస్తుతం వంద సిట్టింగ్ స్థానాల్లో(టీడీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్ తో కలిపి) కొన్నిటిని కోల్పేయే అవకాశముందని పేర్కొంటుండగా.. మేయర్ సీటును టీఆర్‌ఎస్‌కే కట్టబెట్టాయి. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ మాత్రం టీఆర్ఎస్ కు దక్కనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ గణంకాలు తెలిపాయి. సర్వే ఏదయినా.. టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలను గెలుస్తుండగా.. మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి.
150 డివిజన్లలో పోలైన ఓట్లలో 40 శాతానికి పైగా ఓట్లు అధికార పార్టీకే వచ్చాయని సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీజేపీ తనకున్న ఓట్ల శాతాన్ని పెంచుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యంలోని పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్‌కు ఆ పార్టీ నుంచి గట్టి పోటీనే ఇచ్చినట్టు సర్వే సంస్థలు భావిస్తున్నాయి. బీజేపీ జోరుగా సాగిన ప్రచారం ఆ పార్టీకి ఉపయోగపడలేదు. బీజేపీ జోరుగా సాగించిన మతం ఆధారిత వ్యాఖ్యలు నష్టాన్ని మిగిల్చింది. ఆ పార్టీకి రావాల్సిన ఓట్లను కాంగ్రెస్, టీఆర్ఎస్ చీల్చినట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
అయితే ప్రస్తుల ఎన్నికల్లో బీజేపీ ఓట్లు, సీట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 51 డివిజన్లలో పోటీ చేసింది. గత ఎన్నికల్లో 44 స్థానాలు ఉన్న ఎంఐఎం ఈ సారి మరిన్ని స్థానాలు సొంతం చేసుకునేందుకు రంగం లోకి దిగింది. అయితే ఆ పార్టీ 42 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ వంద స్థానాలకు పైగా పోటీ చేసినా ఖాతా తెరిచేలా కనిపించడం లేదు. అన్ని రాజకీయ పార్టీలకు వెనక్కి నెట్టి జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకోవడం స్పష్టమని తేలిపోతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ మేయరే ఉండగా.. ఈ సారి కూడా అదే పార్టీ జీహెచ్ఎంసీని ఖాయం చేసుకోవడం ఖాయమయిపోయింది.
బీజేపీ, ఎంఐఎంలపైనే ఆసక్తి
ఎగ్జిట్ పోల్స్ అనంతరం రాజకీయ పరిశీలకులు, ప్రజల ఆలోచనలు బీజేపీ, ఎంఐఎంల వైపు మళ్లుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీగా వచ్చిన పోటీ కారణంగా కొంత మేర సీట్లు తగ్గవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో ఉండే వారసత్వ ఓటు బ్యాంకు కారణంగా ఈ ప్రభావం ఉండొచ్చు.
అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఎంపీ తేజస్వీ సూర్య, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా వంటి జాతీయ ప్రముఖ నాయకులు గ్రేటర్ ఎన్నికల కోసం ప్రచారంలో దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు అరవింద్, రఘునందన్ రావు వంటి నాయకులు కూడా అభ్యర్థులతో సమానంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరి ఆ ప్రభావం ఆ పార్టీ గెలుపుకు ఏ మేర ఉపకరించిందో ఇప్పుడు తేలాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి నలుగురు కార్పొరేటర్లు ఉండగా.. అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 12-35 వరకూ సీట్లు వచ్చే అవకాశముంది. జాతీయ నాయకుల ప్రభావం ఏమైనా పనిచేస్తే 20 సీట్లకు అటుఇటుగా వస్తాయని సాధారణ అంచనా వేస్తుంన్నారు.
పాతబస్తీలో ఎంఐఎం పరిస్థితి కూడా ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం 44 సిట్టింగ్ కార్పొరేటర్లున్న ఆ పార్టీ.. 51 స్థానాల్లో పోటీ చేసింది. అయితే కొత్త స్థానాలు గెలవడం అటుంచి ఉన్న స్థానాలను కోల్పోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఘోషిస్తున్నాయి. ఆ పార్టీ గరిష్టంగా 41 స్థానాలకు పరమితమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. సిట్టింగ్ సీట్ల కూడా కోల్పోతున్న పాతబస్తీ మీద ఎంఐఎం పట్టుతప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా. ఇరు పార్టీలు మతపరమైన అంశాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా రాజకీయ పార్టీల ధోరణిలను గమనించిన ఓటర్లు ఎంఐఎంకు వ్యతిరేకంగా తీర్పునిస్తున్నారని కనిపిస్తోంది. టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీ ఓటు బ్యాంకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ వివరాల్లో..
ప్రముఖ సర్వే సంస్థ ఆరా ప్రకటించిన వివరాల ప్రకారం టీఆర్‌ఎస్ 78 కార్పొరేటర్ స్థానాల్లో గెలుపొందుతుండగా.. కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే ఒక స్థానాన్ని కోల్పోనుంది. ఇక ఎంఐఎం సైతం 41 డివిజన్లలో గెలుపొందనుంది. బీజేపీకి ప్రస్తుతం నలుగురు కార్పొరేటర్లు ఉండగా.. అనూహ్యంగా పెరిగిన మద్దతుతో 28 కార్పొరేట్ స్థానాలకు పెరుగుతుంది . మ్యాజిక్ ఫిగర్ 98 మాత్రమే కాబట్టి.. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కోల్పోయినప్పటికీ.. మేయర్ పీఠాన్ని అధిష్టించడం ఖాయమనే స్పష్టం చేస్తోంది.
పీపుల్ప్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 68-78 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుండగా.. బీజేపీ 25-35 మధ్య కార్పొరేటర్లు ఎన్నికవుతారని అంచనా వేసింది. ఎంఐఎం విషయంలో పెద్దగా మార్పులేదు. సీపీఎస్ ప్రకారమైతే.. టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లలో స్వల్పంగా కోల్పేయే అవకాశం కనిపిస్తుండగా.. బీజేపీ గరిష్టంగా 20 డివిజన్లను మాత్రమే గెలుచుకుంటుంది. ఎంఐఎం తన సీట్లను కోల్పోయి 32-38 మధ్య పరమితమవనుంది.
హెచ్ఎంఆర్ ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్‌కు 65-70 స్థానాలు వస్తుండగా.. ఎంఐఎం మద్దతుతో మేయర్ సీటును కూడా దక్కించుకోనుంది. జన్ కీబాత్ ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇదే రకమైన అభిప్రాయాన్ని ప్రకటించింది. ఇలా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని రకాల సర్వేల్లోనూ అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాటు మేయర్ సీటును కూడా ఖాయం చేసుకుంది. సీట్ల సంఖ్యలో తేడాలున్నప్పటికీ టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోనుంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల ఫలితాలను పరిగణలోకి తీసుకున్నా.. మ్యాజిక్ ఫిగర్‌ను టీఆర్ఎస్ ఒంటరిగానే సాధించడంలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు. గ్రేటర్‌లో మరోమారు టీఆర్ఎస్ జెండా ఎగురేయడం ఇక లాంఛనమే..