అమరావతి రైతుల పేరుతో గత 750 రోజులుగా ఉద్యమం చేస్తున్న వారు, వారికి రాజకీయంగా మద్దతు ఇస్తున్న వారు ఈ వ్యవహారంలో లొసుగులు చాలా తమకు తామే బయట పెట్టుకున్నారు. ఇంతకాలం రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చి నష్టపోతున్నారు అని నమ్మిస్తూ వచ్చిన వారు తాము భూములు ఇచ్చింది తక్కువే అని, తమ భూములను చాలా వరకు బయటి వ్యక్తులు కొనుక్కున్నారని జనవరి 2 ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి టీవిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టేశారు. అమరావతి ప్రకటనకు ముందు ఆ ప్రాంతంలో జరీబు భూములు మినహా మిగతా భూముల ధర ఎకరానికి ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఉండేదని, అమరావతి ప్రకటనతో అది ఐదు కోట్ల రూపాయలు అయిందని చెప్పుకున్నారు.
వాస్తవానికి జరీబు భూముల ధరలు ఎకరం కోటి రూపాయల వరకూ ఉండేది. జరీబు భూములు కాకపోయినా జాతీయ రహదారి ప్రతిపాదనతో వెంకటపాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో ఎకరం కోటి రూపాయల వరకూ ధర పలికింది. ప్రకాశం బ్యారేజీకి దగ్గర్లో ఉన్నందువల్ల ఉండవల్లి భూములు ఎకరం రెండు కోట్ల రూపాయల ధర ఉండేది. అయితే అమరావతి ప్రకటనతో మొత్తం భూముల ధరలు ఎకరం ఐదు కోట్ల రూపాయల నుండి అత్యధికంగా ఎనిమిది కోట్ల రూపాయలవరకూ వెళ్ళింది. దీంతో రైతులు తమ భూముల్లో ఎక్కువ శాతం అమ్మేసుకున్నారు. ఆ మేరకు రైతులు భారీగానే లాభపడ్డారు. అమ్ముకోగా మిగిలిన భూమిని పూలింగుకు ఇచ్చారు. అలాగే అమ్ముకున్న భూమిని కూడా కొన్న వారి పేరుతో కాక తమ పేరుతోనే పూలింగుకు ఇచ్చారు. ఈ రహస్యాలన్నీ రైతు ఉద్యమ నేతలే బయటపెట్టుకున్నారు.
అమరావతి జెఏసి నేతలు గద్దే తిరుపతి రావు, రాయపాటి శైలజ, పువ్వాడ సుధాకర్, కె శివారెడ్డి కలిసి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలోనే అనేక రహస్యాలు బయటకు వచ్చాయి. వారు చెప్పిన మాటల ప్రకారమే ఇప్పటికి అమరావతి రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు. ఒకవేళ నష్టం ఎవరికైనా జరిగిందంటే అది అక్కడ రైతుల నుండి భూములు కొన్న ఇతర ప్రాంతాల వ్యక్తులదే. వారికోసమే ఇప్పుడు ఉద్యమం జరుగుతోంది. అందుకే ఉద్యమానికి కోట్లాది రూపాయల విరాళాలు వస్తున్నాయి.
Also Read : చివరికి రైతు సంక్షేమం పైనా విషం కక్కుతున్న ఏబీఎన్ ..
ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం రాజధాని ప్రతిపాదన విరమించుకుంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని, అది కూడా ఎకరానికి మూడుకోట్ల రూపాయలవరకూ ఉంటుందని జేఏసీ నేతలే అంగీకరించారు. దీనిపై స్పందించిన రాధాకృష్ణ ఎకరానికి మూడుకోట్లు వస్తే రాజధాని ఉన్నా లేకున్నా రైతులు బాగుపడినట్టే కదా అని వ్యాఖ్యానించి అమరావతి ఉద్యమం దేనికోసమో తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ఉద్యమం మొత్తం అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారు వెనుక ఉండి నడిపిస్తున్నదే అనే విషయం ఈ ఇంటర్వ్యూలో బయటపడింది. భూములు అమ్ముకుని కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్న రైతులకు ఇప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు. అలాగే భవిష్యత్తులో వచ్చే నష్టం కూడా ఏమీలేదు. ఎటొచ్చి నష్టం ఎంతో కొంత ఉంది అనుకుంటే అది అక్కడ భూములు కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఎన్నారైలు మాత్రమే.
ఈ ఇంటర్వ్యూలో బయటపడిన మరో విషయం కులం.
అమరావతి ఉద్యమాన్ని ఓ కుల ఉద్యమంగా, ఇంకా స్పష్టంగా కమ్మ ఉద్యమంగా ప్రజలు చూస్తున్నారని అటు ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ, ఇటు జేఏసీ నేతలు స్పష్టంగా అంగీకరించారు. పైగా రాయలసీమలో రెడ్లపై లేని వ్యతిరేకత ఇక్కడ కమ్మ వాళ్ళపై ఎందుకు ఉంది అని కూడా తమను తాము ప్రశ్నించుకున్నారు. మొత్తం అమరావతి వ్యవహారం, అందులోని లొసుగులు ఆ 29 గ్రామాల ప్రజలకు తెలుసు. అందుకే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల సంగతి ఎలా ఉన్నా ఈ 29 గ్రామాల ప్రజలు కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదు.
ఇక కుల ప్రస్తావన విషయానికి వస్తే ఇప్పటివరకు ఆ ప్రాంతంలో కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమానికి ప్రతినిధిగా నిలబడ్డారు. అయితే అతను ఎస్సి కాబట్టి ఒక పథకం ప్రకారం చందాల వసూలు వ్యవహారంలో ఇరికించి దూరంగా పెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయపాటి శైలజను తెరపైకి తెచ్చారు. మిగిలిన నేతలు గద్దె తిరుపతి రావు, పువ్వాడ సుధాకర్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. ఒక్క శివారెడ్డి మినహా ఇతర జేఏసీ నేతలంతా కమ్మ సామాజిక వర్గం వారే. ఇలా ఇతర వర్గాల నేతలను కూడా పక్కన పెట్టి కమ్మ సామాజికవర్గం వారే ఉద్యమం చేస్తూ ఇతర సామాజికవర్గాల వారు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు అని ప్రశ్నించుకోవడం ద్వారా మొత్తం ఉద్యమ డొల్లతనం బయటపెట్టుకున్నారు.
Also Read : చంద్రబాబు డైరెక్షన్ లోనే రంగా హత్య.. ఇప్పుడేమో.. : కొడాలి నాని హాట్ కామెంట్స్
కొలికపూడి శ్రీనివాసరావును ఎందుకు తప్పించారు?
అసలు అక్కడి శాసనసభ్యుడిగా పనిచేసిన తెనాలి శ్రావణ్ కుమార్ ను ఉద్యమానికి ఎందుకు దూరంగా ఉంచారు? భూసమీకరణ సమయంలో శాసనసభ్యుడిగా ఉన్నది శ్రావణ్ కుమార్ కదా! ఆయనకు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం లేకుండా ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ఎవరీ రాయపాటి శైలజ? ఈ ప్రశ్నలకు జవాబు వెతికితే ఈ ఉద్యమం ఎవరిదో, ఎవరికోసమో, ఎవరు నడిపిస్తున్నారో అర్థం కాదా!?