iDreamPost
android-app
ios-app

ఇక మిగిలింది చిరు & వెంకీలే

  • Published Nov 01, 2020 | 10:14 AM Updated Updated Nov 01, 2020 | 10:14 AM
ఇక మిగిలింది చిరు & వెంకీలే

మొన్న బాలకృష్ణ సెట్ లోకి అడుగు పెట్టారు. వైల్డ్ డాగ్, బిగ్ బాస్ అంటూ నాగార్జున చాలా రోజుల ముందు నుంచే అవుట్ డోర్ లొకేషన్లకు కూడా వెళ్లొస్తున్నారు. ఇక సీనియర్ మోస్ట్ హీరోల్లో మిగిలింది చిరంజీవి, వెంకటేష్ లే. నారప్ప ఇంకో పాతిక శాతం ఉంది. గట్టిగా కూర్చుంటే నెలన్నరలో పూర్తి చేసేయొచ్చు. ఈ నెల నుంచే ప్రారంభం కావొచ్చని టాక్ ఉంది కానీ ఇంకా సురేష్ సంస్థ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ కల్ట్ విలేజ్ డ్రామాలో వెంకీ సరసన ప్రియమణి భార్యగా నటిస్తోంది. వయసు మళ్ళిన పాత్రలో వెంకీ లుక్ మీద ఇప్పటికే మంచి ఫీడ్ బ్యాక్ ఉంది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇది ఎప్పుడు పూర్తయినా మార్చ్ లేదా ఏప్రిల్ లోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అంతకన్నా ముందు అవకాశం లేదు. ఇక ఆచార్య విషయానికి వస్తే కొరటాల శివకు దీన్ని ఫినిష్ చేయడం ఓ సవాల్ గా మారింది. ఇప్పటికే రెండేళ్లకు పైగా విలువైన కాలాన్ని ఈ ప్రాజెక్ట్ కోసమే ఖర్చు చేసిన శివకు లాక్ డౌన్ రూపంలో మరో పెద్ద బ్రేక్ పడింది. ఆరోగ్య రిత్యా చిరు వెంటనే రిస్క్ చేయలేకపోతున్నారు. మూడు లేదా నాలుగో వారంలో స్టార్ట్ చేసి ఏకధాటిగా షూటింగ్ జరిపేలా ప్లానింగ్ జరుగుతోందట. దానికి తగ్గట్టే మెగాస్టార్ కూడా సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది.

కరోనా మలిదశ డిసెంబర్ లో ఉండొచ్చనే ప్రచారాలు పరిశ్రమను టెన్షన్ పెడుతున్నాయి. అందుకే అరవై వయసు దాటిన అగ్ర హీరోలు ఆచితూచి అడుగు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట హైదరాబాద్ నగరంలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా వ్యాక్సిన్ రాలేదు. ఒకవేళ మరోసారి లాక్ డౌన్ లాంటి అత్యాయక పరిస్థితిని ఎదురుకోవాల్సి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇప్పటికే వందల కోట్ల నష్టాలతో కుదేలైన సినిమా, థియేటర్ల వ్యవస్థ ఇప్పుడిప్పుడే కుదుటపడే ప్రయత్నం చేస్తోంది. ఏది ఎలా ఉన్నా నిర్మాతల క్షేమం కోసమైనా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని పెద్ద హీరోలు బయటికి రావాల్సిన అవసరం ఉంది