iDreamPost
iDreamPost
‘‘రోడ్డు మీద వెళతున్న వ్యక్తిని పిలిచి అక్కడ డబ్బులు పడ్డాయి మీవేనా అంటూ.. అడుగుతారు. అవి తీసుకునే లోపు చేతిలో ఉన్న విలువైన వస్తువులను మాయం చేసేస్తారు’’ దీన్ని పోలీసుభాషలో ఎరవేసి మోసం చేయడంగా పరిగణిస్తారు. అంటే అప్పుడెప్పుడో మన తాతముత్తాల కాలం నుంచీ దొంగలు ఈ పద్దతిని అవలంభిస్తూనే ఉన్నారు. కానీ నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా విధానాన్ని మాత్రమే మార్చుకుంటున్నారు.
గతంలో ప్రత్యక్షంగా జరిగే ఈ మోసం ఇప్పుడు ఆన్‌లైన్‌లో జరుగుతోంది. ముందు కొంత సొమ్ము వెయ్యడం, దానిని రెట్టింపు మొత్తం చెల్లిస్తారు. ఆ తరువాత ఇంకొంచెం పెద్ద మొత్తం ఆశ చూపుతారు. దానిక్కూడా టెంప్ట్ అయితే ఇంకొంత అధిక మొత్తం ఆఫర్ చేస్తారు. ముందు వాళ్ళు మనకిచ్చిన దానికంటే ఈ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడో ఎరకు చిక్కుకున్నామా? దొంగల పంట పండినట్టే. ఒక్కో సారి మొదటి ఎరతోనే దోచుకునేందుకు స్కెచ్ కూడా వేస్తుంటారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ఎరవేసి చేపలను పట్టడం లాగే ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు మునిగితేలుతున్న సోషల్ మీడియా ఫ్లాంట్‌ఫాంల ద్వారానే చోరీగాళ్ళు ఇటువంటి ఎరలను సిద్ధం చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్భుక్‌లలో వచ్చే వివిధ రకాల మెస్సేజ్‌లలో ఎంత నిజం ఉంటుందో, సదరు ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా వచ్చే ఆఫర్లలో కూడా అంతే నిజం ఉంటుందని పలువురు బాధితులు చెప్పుకొస్తున్నారు.
తాజాగా తెలంగాణా పరిధిలో ఇటువంటి మోసం ఒకటి వెలుగు చూసింది. హైదరాబాదు బీహెచ్‌ఈఎల్ ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగిని వాట్సాప్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తాను సూచించిన సంస్థల్లో డిపాజిట్ చేస్తే భారీ లాభం ఉంటుందని ఆశపెట్టాడు. దీంతో అతడి మాటలు నమ్మిన ఉద్యోగి మూడు విడతలుగా నగదును జమ చేసాడు. తొలి రెండుసార్లు ఇతను డిపాజిట్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తాన్నే తిరిగి ఇచ్చాడు. మూడోసారి డిపాజిట్ చేసిన మొత్తానికి కూడా రెట్టింపు కంటే ఎక్కువగా దాదాపు అరవైలక్షల రూపాయల సొమ్ము వస్తుందని, కానీ టాక్సుల రూపంలో సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని సదరు వ్యక్తి ఆశ పుటించాడు. అప్పటికే అతడి ఎరలో చిక్కుకున్న ప్రైవేటు ఉద్యోగి దాదాపు 27లక్షల రూపాయలను చెల్లించాడు. ఆ తరువాత నుంచి సదరు వ్యక్తి స్పందించడం మానేయడంతో తాను మోసపోయిన విషయం గుర్తించి లబోదిబోమంటున్నాడు.
ఎదుటి వారి ఆశనే పెట్టుబడిగా మోసం చేసే ఇటువంటి దొంగలు మనకంటే చాలా తెలివైనవారన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. వారిచ్చే ఆఫర్లు ఖచ్చితంగా మనల్ని ఊరించే విధంగానే ఉంటాయి. కానీ ఇది మనకెందుకు ఇస్తున్నారు? ఇలా ఎందుకు ఇస్తారు? లాంటి చిన్నపాటి లాజిక్‌ను మిస్సయితే వారి గేలానికి చిక్కుకుపోవడం ఖాయం. ఇటువంటి నేరాల విచారణలో కూడా పోలీస్‌వర్గాలు సవాళ్ళను ఎదుర్కొంటున్నాయనే చెబుతారు. నిందితుడు ఎక్కడో ఉంటాడు, ఆన్‌లైన్‌లో ఈజీగా మోసం చేసేస్తాడు. సదరు అక్కౌంట్‌లను పట్టుకుని, నిందితుడ్ని గుర్తించడం, వాటిని రికవరీ చేయడం తదితర అంశాలు ఎన్నో వ్యయప్రయాశలతో కూడి ఉంటాయి. ఒక్కో సారి దీనికి ఎంతో సమయం కూడా పడుతుంటుంది. ఇన్ని పాట్లు పడే బదులు ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటేనే మంచిదని హితవు చెబుతున్నారు పోలీస్‌లు.