Idream media
Idream media
ఉపనిషత్తుల్లో అది ఇలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇలాంటిదే అని చెప్పడానికి వీలులేనిది ఆత్మ అని అంటారు. ఉల్లి ధరకి ఉపనిషత్ వాక్కుకి కూడా సంబంధం ఉంది. వెజిటబుల్ షాప్‌కి నిన్న వెళితే ఒకాయన రెండే రెండు ఉల్లిపాయలు కొంటున్నాడు. చూడ్డానికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లా ఉన్నాడు. కానీ ఉల్లి హార్డ్‌వేర్‌లా ఉంది. అదీ సమస్య.
ఉల్లి కోసినా , కొన్నా కన్నీళ్లే వస్తాయి అని పాట పాడుకోవచ్చు. ఉల్లి తల్లిలాంటిది అని అంటారు. ధర మాత్రం నల్లిలా కుడుతోంది. గతంలో జనతా ప్రభుత్వం ఓడిపోవడానికి ఉల్లి ధర కూడా కారణమని అంటారు. దీని ప్రత్యేకత ఏమంటే పెరిగితే దేశం మొత్తం ధర పెరుగుతుంది. జీవితం కూడా ఉల్లిలాంటిదేనని వేదాంతులు అంటారు. పొరలుపొరలుగా విడదీసి చూస్తే ఏమీ మిగలదు.
వంటింట్లో ఒక మూల విసిరేసినట్టుగా ఉన్న ఉల్లిపాయ లేకుండా మనకు ముద్ద దిగదు. ఇప్పుడేమో ఎక్కడ చూసినా రేషన్, పానీపూరీ తింటే వాడు ఊరికే అలా విదిలిస్తున్నాడు. ఇంకొంచెం ఇవ్వమంటే కోపంగా చూస్తున్నాడు. బిర్యానీతో పాటు ఇవ్వడం మానేశారు. ఆనియన్ దోసె రేటు పెరిగింది. అయినా ఫర్వాలేదనుకుని దోసె విప్పితే ఆనియన్ కంటే కీర, క్యారెట్ కనిపిస్తున్నాయి.
ఉల్లిపాయల కోసం జనం క్యూలో నిలబడుతున్నారు. గతంలో ATMల దగ్గర నిలబడేవారు. మనకు క్యూలు అలవాటే. అదేం సమస్య కాదు. పక్కింటి పార్వతమ్మని “వదినా రెండు ఉల్లిపాయలు ఉంటే ఇస్తావా” అని అడిగే ధైర్యం లేకుండా పోయింది.
హోటళ్లలో కటింగ్ మాస్టర్లకి పని తగ్గింది. కొంత మంది ఎంత కళాత్మకంగా ఉల్లిపాయని కట్ చేస్తారంటే అది చూడాల్సిందే. వీటిని రాయలసీమలో ఎర్రగడ్డలని కూడా అంటారు. హైదరాబాద్‌లో ఎర్రగడ్డ అంటే పిచ్చాస్పత్రి అని అర్థం. నిజంగానే ఉల్లిగడ్డ ప్రియులు ఎర్రగడ్డ చేరాల్సిన స్థితి.
పేదవాళ్లు కూర వండుకోకపోయినా ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే గడిచిపోయేది. ఇప్పుడా భాగ్యం కూడా లేదు. కలనే కాదు ఉల్లిని కూడా దోచుకునే దొరలొచ్చారు.
మార్కెట్‌లో ధరలు ఎంత పెరిగినా రైతులు మాత్రం బాగుపడరు. ఇదో విచిత్రం. ఉల్లి ధర వల్ల మనకు ఉపయోగం ఏమంటే కన్నీళ్లు వృథా కావు. ఏడిపించడానికి నాయకులున్నారు, మీడియా ఉంది. ఆడపిల్లల్ని హత్యలు చేసేవాళ్లు ఉన్నారు. మళ్లీ ఉల్లి కూడా ఎందుకు?