iDreamPost
iDreamPost
ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఉన్న గోదావరి.. గోదావరి నదీపాయల మధ్య వడ్డాభరణాలుగా పేరొందిిన వంతెనలలో మరో కొత్త వంతెన వచ్చి చేరబోతుంది. ఏడు దశాబ్ధాల కాలంగా పెండింగ్‌లో ఉన్న వశిష్ఠ నదిపై సఖినేటిపల్లి – నర్సాపురం మధ్య వంతెనకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉన్న జాతీయ రహదారి మరింత కీలకం కానుంది. ఈ వంతెన నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ రామ్ గడ్కారీతో మాట్లాడి ఒప్పించడంతో కేంద్రం అంగీకరించింది. దీని నిర్మాణానికి రూ.450 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రూ.65 కోట్లకు పరిపాలనాపరమైన ఆమోదం ఇచ్చింది.
ఉభయ గోదావరి జిల్లాల మధ్య అడ్డుగా ఉన్న అఖండ గోదావరి, వశిష్ఠ నదీపాయల మధ్య పలుచోట్ల వంతెనలు ఉన్న విషయం తెలిసిందే. ప్రతీ వారధి నిర్మాణం ఈ రెండు జిల్లాల అభివృద్ధిలో కీలక మార్పులకు నాంది పలికాయి. తాజాగా వశిష్ఠ నదీపాయపై గత కొన్నేళ్లుగా శంకుస్థాపనల మీద శంకుస్థాపనలకు పరిమితమైన సఖినేటిపల్లి – నర్సాపురం మధ్య వంతెన నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు, దివంగత వైఎస్సార్‌లు ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ శంకుస్థాపన చేసి పనులు ఆరంభించారు.
Also Read : Korangi City – కడలి గర్భంలో కలిసిపోయిన కోరంగి నగరం గురించి తెలుసా..?
అయితే నిర్మాణ పనులు చేపట్టిన మైటాస్ ఆర్థిక ఇబ్బందులు పాలవడంతో పనులు నిలిచిపోయాయి. తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, విభజన తరువాత పనిచేసిన వారు దీని నిర్మాణాన్ని గాలికి వదిలేశారు. అయితే జగన్ చొరవతో వంతెన కల సాకారం కానుంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కత్తిపూడి నుంచి పామర్రు వరకు ఉన్న 216 జాతీయ రహదారిని కోస్టల్ రహదారిగా ఒంగోలు వరకు విస్తరించాలనే ప్రతిపాధన ఆచరణలోకి వచ్చే అవకాశముంది. ఈ రహదారి కత్తిపూడి, అమలాపురం, నర్సాపురం, మొగల్తూరు, కృతివెన్ను, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లి, బాపట్ల, చీరాల మీదుగా ఒంగోలు వరకు నిర్మించాలి. ఒంగోలు వద్ద 216 జాతీయ రహదారి చెన్నై నుంచి కోల్‌కత్తా వరకు ఉన్న ఎన్‌హెచ్ నెం.16లో కలవనుంది.
ఇది పూర్తయితే విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, చెన్నై ఓడ రేవులకు మధ్య అనుసంధాన రహదారి అవుతుంది. ఈ రహదారిలో దిండి – చించినాడ మధ్య వంతెన ఉంది. దీని మీద నుంచి రాకపోకలు సాగించేవారు భీమవరం, కలిదిండి మీదుగా పామర్రు వరకు ప్రయాణాలు సాగిస్తున్నారు. నర్సాపురం నుంచి ఒంగోలు వెళ్లాంటే ఇప్పుడు భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తుంది. అదే వంతెన నిర్మాణం జరిగి ప్రతిపాధిత కోస్టల్ రహదారి పూర్తయితే చాలా దగ్గర దారి ఏర్పడుతుంది. పోర్టుల నుంచి భారీ వాహనాల రాకపోకలకు సులువైన మార్గం ఏర్పడుతుంది.
Also Read : P Gannavaram Aqueduct – రాజోలు దీవి చరిత్రను మార్చిన పి.గన్నవరం అక్విడెక్టు గురించి తెలుసా..?
తూర్పు తీరంలో పోర్టుల కనెక్టివిటీలో భాగంగానే కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం మీదుగా నర్సాపురం వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్‌ను మచిలీపట్నం, రేపల్లి మీదుగా బాపట్ల వరకు పొడిగించాలనే ప్రతిపాధన కూడా కేంద్రం వద్ద ఉంది. ఇటు రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే రాష్ట్రంలో కోస్తా ప్రాంత అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
ప్రస్తుతం పంటు ప్రయాణాలు..
నర్సాపురం – సఖినేటిపల్లి మధ్య వశిష్ఠ నదిలో ప్రస్తుతం పంట్ల మీద ప్రయాణాలు సాగుతున్నాయి. కొన్ని సందర్భాలలో నాటుపడవ మీద రాకపోకలు జరుగుతున్నాయి. గతంలో పలుసార్లు పడవ ప్రమాదాలు జరిగిన దుర్ఘటనలలో పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. వంతెన నిర్మాణం జరిగితే గోదావరి దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. వరదల సమయంలో పంట్ల రాకపోలు నిలిపివేస్తుంటే ప్రజలు మలికిపురం మీదుగా దిండి` చంచినాడ మీదగా రాకపోలు సాగించాల్సి వస్తుంది. వంతెన నిర్మాణం జరిగితే వీరి కష్టాలన్నీ గట్టెక్కినట్టే.
Also Read : Konaseema Railway Line – కోనసీమలో రైల్వే కూతకు ఇంకా ఎంతకాలం?