Idream media
Idream media
వివాదాస్పద లిపులేఖ్, కాలాపాని,లింపియాధురా ప్రాంతాలతో కూడిన నేపాల్ నూతన రాజకీయ మ్యాప్‌ను ఆ దేశ పార్లమెంటు ఆమోదించిన తర్వాత సరిహద్దులలో నేపాల్ పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్ననట్లు కనిపిస్తుంది. నేపాల్‌లోని నారాయణపూర్, బీహార్‌లోని జానకీనగర్ మధ్య ఉన్న సరిహద్దు వద్ద నేపాల్ పోలీసులు జరిపిన కాల్పులలో ఒక భారతీయ రైతు మరణించాడు.
శుక్రవారం ఉదయం కొంతమంది రైతులు నేపాల్‌లోని నారాయణ్ పూర్ ప్రాంతంలో ఉన్న తమ పొలాలలో వ్యవసాయ పనులు చేసుకునేందుకు సరిహద్దు దాటారు. అయితే సరిహద్దు దాటిన విషయమై రైతులకు,నేపాల్ పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో నేపాల్ బోర్డర్ పోలీసులు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ఒక రైతు మృత్యువాత పడగా,మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
నేపాల్ భూభాగంలోని తమ పట్టా భూములలో వికేష్ కుమార్, ఉమేష్ రామ్, ఉదయ్ ఠాకూర్‌లు వ్యవసాయ పనులు చేపట్టారు. ఆ సమయములో అటుగా వచ్చిన నేపాల్ పోలీసులు సరిహద్దు దాటి వచ్చారని ఆరోపిస్తూ వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. ఆ కాల్పులలో వికేష్ కుమార్(25) అనే రైతు మరణించగా, మిగతా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే లంగన్ రాయ్ అనే మరో రైతును నేపాల్ పోలీసులు బంధించి తీసుకెళ్ళినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఇక కాల్పుల సంఘటన తెలిసిన వెంటనే సీతామర్హి జిల్లా న్యాయమూర్తితో పాటు స్థానిక ఎస్పీ సంఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్లి పరిస్థితులను సమీక్షించారు.
అయితే నేపాల్ అధికార వర్గాల కథనం వేరేగా ఉంది. కొందరు భారతీయులు నేపాల్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపామని నేపాల్ విదేశాంగ అధికారులు వెల్లడించినట్లు అక్కడి వార్తాపత్రికలు తెలిపాయి. కొంతమంది స్మగ్లర్లు భారత్ వైపు నుంచి తమ భూభాగంలోకి ప్రవేశించారని, మరి కొద్ది సేపటికే వారి సంఖ్య పెరుగుతుండడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని నేపాల్‌లోని సప్తరీ జిల్లా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శంకర్ హరి ఆచార్య వివరించారు. మరోవైపు తమ దగ్గర నుంచి తుపాకులు లాక్కోవడానికి కొందరు భారతీయులు ప్రయత్నించడంతో కాల్పలు జరిపామని నేపాల్ పోలీసులు చెబుతున్నట్లు స్థానిక విలేకరులు వెల్లడించారు.
సరిహద్దు వెంబడి వందలాది మంది భారతీయ (ముఖ్యంగా బీహారీలు) రైతులకు నేపాల్ భూభాగాలలో పట్టా భూములు ఉన్నాయి. గతానికి భిన్నంగా రైతులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నేపాల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. గత మే 16 న లాక్‌డౌన్ సమయంలో మొక్కజొన్న పంట కోతల కోసం సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన భారత రైతులను అడ్డుకోడానికి నేపాల్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నేటి దుర్ఘటన కూడా భారతీయ రైతుల అడ్డగింతలో భాగంగానే జరిగింది. కాగా నేటి నేపాల్ పోలీసుల కాల్పుల ఉదంతంపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.