iDreamPost
android-app
ios-app

శిఖరాన్ని లొంగదీసిన వీరులు

శిఖరాన్ని లొంగదీసిన వీరులు

మే 29, 1953 ఉదయం 11:30 నిముషాలకు న్యూజిలాండ్ పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ, అతడి సహాయకుడు నేపాలీ షెర్పా టెన్జింగ్ నార్గేలు ఎవరెస్టు శిఖరం అధిరోహించిన మొదటి వ్యక్తులుగా రికార్డు సృష్టించకముందు ఆ ఘనత సాధించే ప్రయత్నంలో పదకొండు ప్రయత్నాలలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు.

సాహసికులకు ఛాలెంజ్

అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలు, ఉత్తర, దక్షిణ ధృవాలను చేరిన మనిషికి ఛాలెంజ్ విసురుతూ 29,035 అడుగుల ఎత్తున ఉన్న ఎవరెస్టు శిఖరం చాలా మంది సాహసికులను ఆకర్షించింది కానీ, ఆక్సిజన్ చాలా తక్కువ ఉండే ఆ ఎత్తుని అధిరోహించడానికి తగిన పరికరాలు లేకపోవడంతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేవరకూ ఎవరూ ఎవరెస్టు శిఖరం అధిరోహించే ప్రయత్నాలు చేయలేదు.

మొదటి సారిగా బ్రిటిష్ బృందం 1921లో టిబెట్ వైపు నుంచి ఎవరెస్టును అధిరోహించే ప్రయత్నం చేసింది. అయితే తీవ్రమైన మంచు తుపాను వారి ప్రయత్నానికి ఆదిలోనే గండి కొట్టింది. దాంతో వారు పర్వత పాదం వద్ద నుంచి వెనుదిరిగినా శిఖరం అధిరోహించడానికి అనువైన మార్గం కనుక్కొన్నారు. ఈ బృందంలో సభ్యుడైన జార్జి మల్లోరీ మరుసటి సంవత్సరం మరో బ్రిటిష్ బృందంలో సభ్యుడిగా వచ్చాడు. ఈ బృందంలో ఇద్దరు సభ్యులు దాదాపు 27 వేల అడుగుల ఎత్తు చేరుకుని ప్రతికూల పరిస్థితుల వల్ల వెనుదిరగవలసి వచ్చింది. అదే సంవత్సరం మరో బృందాన్ని తయారు చేసుకుని వచ్చిన మల్లోరీకి సహాయకులుగా ఉన్న ఏడుగురు నేపాలీ షెర్పాలు హిమపాతం వల్ల మరణించడంతో మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమించారు.

ఎవరెస్టు శిఖరం అధిరోహించాలన్న తన పట్టు వదలని జార్జి మల్లోరీ 1924లో మరో బృందంలో సభ్యుడిగా తిరిగి వచ్చాడు. ఈ బృందంలో ఒకరైన ఎడ్వర్డ్ నోర్టన్ 28,128 అడుగుల ఎత్తు చేరుకుని ప్రతికూల పరిస్థితుల వల్ల బేస్ క్యాంపుకి తిరిగి వచ్చాడు. నాలుగు రోజులు బేస్ క్యాంపులో గడిపి, వాతావరణం అనుకూలంగా మారడంతో జార్జి మల్లోరీ, ఆండ్రూ ఇర్వైన్ కలిసి శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఇద్దరూ తమ క్యాంపుకు తిరిగి రాలేదు. వీళ్లు ఏమయ్యారో తెలియకుండానే మిగిలిన బృందం తమ ప్రయత్నాన్ని విరమించి తిరిగి వచ్చారు.

అయితే 1999లో కొందరు అధిరోహకులు అనుకోకుండా జార్జి మల్లోరీ శవాన్ని కనుగొన్నారు. శిఖరానికి సమీపంలో, చేతులు, కాళ్లు విరిగి ఉన్న శవం కనిపించింది. మల్లోరీ ఎవరెస్టు శిఖరం అధిరోహించి ఉంటాడని చాలా మంది భావించినా అందుకు సాక్ష్యం లేదు కాబట్టి మల్లోరీకి ఆ రికార్డు దక్కలేదు.

నేపాల్ వైపునుంచి ప్రయత్నాలు

1950లో చైనా టిబెట్ ని ఆక్రమించుకోవడంతో విదేశీయులకి టిబెట్ తలుపులు మూసుకుపోయాయి. దాంతో నేపాల్ వైపు నుంచి ఎవరెస్టును అధిరోహించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1950లో ఒకసారి, 1951లో మరోసారి రెండు బ్రిటిష్ బృందాలు నేపాల్ వైపునుంచి ఎవరెస్టు శిఖరానికి దారి వెతికే ప్రయత్నం చేశాయి. శిఖరాన్ని అధిరోహించడానికి తగిన బృందాన్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తున్న బ్రిటిష్ వారికి 1952లో స్విట్జర్లాండ్ కి చెందిన పర్వతారోహకుల బృందం షాక్ ఇచ్చింది.

ఆ బృందానికి చెందిన రేమాండ్ లాంబెర్ట్, అతనికి సహాయకుడిగా ఉన్న షెర్పా టెన్జింగ్ నార్గే 28,210 అడుగుల ఎత్తుకు చేరుకుని శిఖరానికి కూతవేటు దూరంలో ఆక్సిజన్ అయిపోవడంతో వెనుదిరగవలసి వచ్చింది. మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న తాము కాకుండా అప్పుడే వచ్చిన స్విట్జర్లాండ్ బృందం మొదటి సారిగా ఎవరెస్టు అధిరోహించిన రికార్డు ఎక్కడ స్వంతం చేసుకుంటారో అని భయపడిన బ్రిటిష్ పర్వతారోహకులు ఆర్మీ అధికారి కల్నల్ జాన్ హంట్ నాయకత్వంలో ఒక బృందాన్ని సిద్ధం చేశారు.

ప్రత్యేకమైన బూట్లు, దుస్తులు, వెంట తీసుకెళ్ళగలిగే రేడియో సామగ్రి, ఓపెన్ సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్ ఆక్సిజన్ సిలిండర్లతో ఎలాగైనా శిఖరాన్ని చేరాలని సిద్ధమైన ఈ టీమ్ లో చేరాలని న్యూజిలాండ్ పర్వతారోహకులు ఎడ్మండ్ హిల్లరీ, జార్జి లోవ్ లను జాన్ హంట్ ఆహ్వానించాడు. స్విట్జర్లాండ్ జట్టుతో కలిసి శిఖరం అంచులకు చేరిన టెన్జింగ్ నార్గే నాయకత్వంలో ఆనుభవఙులైన షెర్పాల టీమ్ సిద్ధం చేశారు.

శిఖరంపై విజయం

1953 ఏప్రిల్, మే నెలల్లో తాము అధిరోహించబోయే మార్గంలో తమకు అవసరమైన సరుకులతో క్యాంపులు ఏర్పాటు చేసుకుని పక్కాగా ఎవరెస్టు శిఖరం మీద దాడి మొదలుపెట్టారు.
26 వేల అడుగుల ఎత్తులో క్యాంపు ఏర్పాటు చేసుకుని, మే 26న ఛార్లెస్ ఎవాన్స్, టామ్ బోర్డిలోన్ శిఖరం అధిరోహించే ప్రయత్నం చేశారు. మరో మూడు వందల అడుగుల దూరంలో శిఖరం ఉందనగా ఆక్సిజన్ సిలిండర్లలో లోపం ఏర్పడడంతో తిరిగి రావలసి వచ్చింది.

మే 28న హిల్లరీ, టెన్జింగ్ కలిసి రెండవ ప్రయత్నం చేశారు. 27,900 అడుగుల ఎత్తున క్యాంపు ఏర్పాటు చేసుకుని ప్రతికూల వాతావరణంలో నిద్ర లేని రాత్రి గడిపి, 29 ఉదయం శిఖరం ఎక్కే ప్రయత్నం చేశారు. మంచులో ఉన్న ఒక చీలికలో పాక్కుంటూ పైకి ఎక్కిన హిల్లరీ తాడు కిందకి వేస్తే దాని సాయంతో టెన్జింగ్ కూడా పైకి ఎక్కాడు. ఇద్దరూ కలిసి మిగిలిన భాగాన్ని అధిరోహించి ఎవరెస్టు శిఖరాన్ని జయించిన మొదటి మానవులుగా రికార్డు స్ధాపించారు.

బ్రిటిష్ రాణి గారికి కానుక

బ్రిటిష్ బృందం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విజయం జూన్ 1న లండన్ చేరింది. మరుసటి రోజు రెండవ ఎలిజబెత్ రాణి గారి పట్టాభిషేకం ఉంది. తన పట్టాభిషేకం సందర్భంగా బ్రిటిష్ పర్వతారోహకుల బృందం తనకు ఇచ్చిన కానుకగా భావించిన రాణి గారు హిల్లరీకి, బృందం నాయకుడు జాన్ హంట్ కి నైట్ హుడ్ ప్రకటించారు. టెన్జింగ్ నార్గేకి బ్రిటిష్ ఎంపైర్ పతకం ఇచ్చారు.

ఆ తర్వాత కాలంలో అనేకమంది ఎవరెస్టు శిఖరం అధిరోహించారు. కొన్నిసార్లు ఈ అధిరోహక బృందాలు ఎక్కువై ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. ఇది కాకుండా మరో సమస్య ఈ అధిరోహక బృందాలు దారి పొడవునా వేసే చెత్త. మంచులో ఎన్ని రోజులు గడిచినా ఈ చెత్త ఫ్రెష్ గా ఉండి పర్వతాన్ని అధిరోహించే వారికి సమస్యగా తయారవుతుంది.

ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎక్విప్ మెంట్, ఆనుభవఙులైన షెర్పాల సాయంతో ఓ మాదిరి ఫిట్ నెస్ ఉంటే ఎవరినైనా ఎవరెస్టు శిఖరం ఎక్కించే చాలా ఏజెన్సీలు ఉన్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రకృతి అనూహ్యంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

1996 లో తీవ్రమైన మంచు తుపానులో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన మరో విషాదం ఏప్రిల్ 25,2015 తేధీన నేపాల్ దేశంలో వచ్చిన భూకంపం వలన ఎవరెస్టు బేస్ క్యాంపులో ఉన్న పదిహేను మంది పర్వతారోహకులు మరణించడం.