ఉన్నావ్ బాధితురాలిని సజీవంగా తగలబెట్టడానికి ప్రయత్నించిన ఘటన గురించి పార్లమెంట్ లో వాడివేడిగా చర్చ జరిగింది. జీరో అవర్‌లో ఉన్నావ్ ఘటనను లేవనెత్తిన కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్య బీజేపీ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది.
ఒకవైపు రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు సీతమ్మలను తగలబెడ్తున్నారని అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. ఉత్తర పదేశ్ చట్టాలు అమలుకాని అధర్మ ప్రదేశ్‌గా మారిందన్నారు. దీనిపై హోంమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, ఉన్నావ్ ఘటనలను పోలుస్తూ అత్యాచార నిందితులను హైదరాబాద్ పోలీసులు కాల్చిపారేశారు, కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు వదిలేశారు అని వ్యాఖ్యానించారు. చర్చ సందర్భంగా పలువురు సభ్యులు హైదరాబాద్‌లో దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను కూడా ప్రస్తావించారు.
అనంతరం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ఉన్నావ్ ఘటనకు మతం రంగు పులముతున్నారని, రాజకీయం చేస్తున్నారని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఇరానీ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు టీఎన్ ప్రతాపన్, దీన్ కురియకొసె గట్టిగా అరుస్తూ, ఆగ్రహంగా ఇరానీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై స్మృతి ఇరానీ బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. లంచ్ బ్రేక్ తర్వాత ఆ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభలోకి రాలేదు.