Idream media
Idream media
ఇప్పటి పిల్లలకు స్కూల్లో దెబ్బలు తినడం తెలియదు. అందుకే జీవితంలో దెబ్బలు తగిలితే తట్టుకోలేరు. మాకు చిన్నప్పటి నుంచి దెబ్బలే దెబ్బలు. ఒక రకంగా చదువంటేనే దెబ్బలు. దెబ్బలంటేనే చదువు.
దండం దశ గుణం అన్నట్టు దండం దశ విధములు.
అన్నీ బెత్తాలు ఒక్కలా ఉన్నా , నొప్పి ఒకటి కాదు. చింత బరికెతో కొడితే సౌండ్ తక్కువ, మంట ఎక్కువ. మా క్లాస్‌లో గోపాల్ అని ఒకడుండే వాడు. వాడికి చదువు రాదు కానీ, చెట్లు ఎక్కడం వచ్చు. సార్ ఎప్పుడైనా బెత్తం మరిచిపోతే వెంటనే స్కూల్ ఎదురుగా ఉన్న చింత చెట్టు ఎక్కి, నెంబర్ వన్ బరికెని తెచ్చేవాడు. ఇతరులు అరుస్తూ ఉంటే వాడికి ఆనందం. తర్వాతి రోజుల్లో వీడు కాంపౌండర్‌గా మారి పిర్రలకు సూదులు గుచ్చె పనిలో దిగాడు. రోగులు దిక్కులు పిక్కటిల్లేలా అరిచేవాళ్లు.
ఇక వెదురు బెత్తం. చూడటానికి స్టైల్‌గా ఉంటుంది. సుయ్‌సుయ్‌మనే సౌండ్‌తో ఒంటిని తాకిందంటే సప్త స్వరాలు పలికేవి. వెదురు వేణువు అవుతుందో లేదో తెలియదు కానీ, బెత్తం మాత్రం ఆరున్నొక్క రాగం ఆలపించేది.
నందయ్య అనే అయ్యవారు మా దురదృష్టం కొద్ది మేదరవీధిలో ఉండేవాడు. ఆయన రోజూ అర డజను బెత్తాలు తెచ్చి స్కూల్ అంతటికీ సప్లై చేసేవాడు. ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి సంతకం పెట్టించుకు రావాలనే అన్‌పార్లమెంటరీ సాంప్రదాయం ఒకటి ఉంది. నాలాంటి తెలివైన వాళ్లకి OK కానీ, శ్రీరాములు లాంటి వాళ్లకి ఇది ప్రాణాంతకం.
వాడి కార్డులో సింగిల్ డిజిట్స్ , లేదా సున్నాలుండేవి. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం నచ్చదు వాడికి. అందుకే చాలా సబ్జెక్టుల్లో ఒకే ఒక మార్కు తెచ్చుకునే ఒకే ఒక్కడు. వీడు తర్వాత సారా కాంట్రాక్టర్‌గా బాగా సంపాదిస్తే నాలాంటి తెలివైన గాడిదలు చాలా మంది జీతం డబ్బుల కోసం చాకిరీ చేశారు.
శ్రీరాములు వాళ్ల నాన్నకి చదువు రాదు. మెదడుకి బదులు బొటనవేలు వాడేవాడు. ఆ చదువు లేని వాడికి ప్రోగ్రెస్ కార్డు చూపించడం దండగ అని శ్రీరాములు ఆ వేలి ముద్రని వాడే వేశాడు. అయితే టెక్నికల్ అవగాహన లేకపోవడం వల్ల సైకిల్‌కి వేసే కందెనని బొటన వేలికి పూసుకుని కార్డుని పులిమాడు.
అయితే గురువుగా ముద్ర వేయలేక పోవచ్చు కానీ, వేలి ముద్రని అయ్యవారు కనుక్కోలేడా? దొంగని పట్టుకున్న సమయంలో , చేతిలో బెత్తం లేకపోవడం విచారకరం. సమయానికి చెట్టెక్కే గోపాల్ కూడా లేడు. దాంతో చేత్తోనే చెంపలు వాయించాడు. నల్లగా ఉండే శ్రీరాములు బుగ్గలు ఎర్రగా అయ్యాయి. దాంతో వాడు అయ్యవారికి దొరక్కుండా పారిపోవడానికి ప్రయత్నించాడు. ఒకడు దెబ్బలు తింటూ ఉంటే , చూస్తే వచ్చే కిక్కే వేరు. అందుకే మేమంతా శ్రీరాముల్ని దొరకపుచ్చుకుని అయ్యవారికి అప్పజెప్పాం. తర్వాత రోజుల్లో వాడు సారా కాంట్రాక్టర్ అవుతాడని ఎవరికి తెలుసు?
కొట్టడంలో కూడా ఒకొక్కరిది ఒక్కో స్టైల్. మా హిందీ అయ్యవారు లావుగా , ఎత్తుగా ఉండేవాడు. ఆయన్ని కరిడి అయ్యవారు అని ముద్దుగా పిలుచుకునేవాళ్లం. కరిడి అంటే కన్నడంలో ఎలుగ్గొడ్డు అని అర్థం. రహస్యం ఎంత కాలం దాగుతుంది? తనకి ఆ పేరు పెట్టారని తెలుసుకున్నాడు. అదంతా మా క్లాస్‌లో జరిగిన కుట్రేనని అర్థమై హిందీ పదాలకు అర్థాలు అడగడం స్టార్ట్ చేశాడు.
త్యోహార్ అంటే ఏంటి అన్నాడు. అది పలకడమే ఎవడికీ రాదు. ఇక అర్థం సంగతి దేవుడికి తెలుసు? ఒకొక్కని పైకి లేపడం , డబ్బింగ్ సినిమాల్లో దారాసింగ్ కొట్టినట్టు కొట్టడం త్యోహార్ పలకమంటాడు. ఒకడు తోర్ అని, తారు అని, తేరు అని అంటాడు. తర్వాత కెవ్వుకేక. ఆయనకి బెత్తం అక్కర్లేదు. చేతులే పొడుగాటి బెత్తాలు.
క్లాస్ అయిపోయాక , కరిడి అయ్యవారు చితకబాదాతెలిసి ఈ సారి కింగ్‌కాంగ్‌గా మారాడని అందరికీ ఏడుస్తూ చెప్పాం. ఇది
మగవాళ్లు ఎంతైనా క్రూరులు. లేడీ టీచర్లు ఈ రేంజ్‌లో కొట్టేవాళ్లు కాదు. పుట్టమ్మ టీచర్‌కి మరీ కోపం వస్తే ఒక మొటిక్కాయ వేసేది. మరియమ్మ మరీ బంగారం. ఓరే గాడిదల్లారా అని అరిచేది అంతే! గాడిద అనేది మా దృష్టిలో తిట్టుకాదు. మేము గాడిదలమే అని మాకు తెలుసు కాబట్టి.
హీరాలాల్ అని ఒక అయ్యవారు ఉండేవాడు. ఆయన మన స్కేల్‌తో మనల్నే కొట్టేవాడు. ఒక్కోసారి స్కేల్ కూడా విరిగిపోయేది. దెబ్బలతో పాటు స్కేల్ డబ్బులు లాస్!
కొడితే కొట్టారు కానీ, వాళ్లు నేర్పిన నాలుగు అక్షరాలే ఈరోజు అన్నం పెడుతున్నాయి.