దేశంలో పెట్రోల్ ఛార్జీల భారం అందరూ మోయాల్సి వస్తోంది. పెరుగుతున్న ధరలకు కేంద్రం చెబుతున్న అనేక కారణాలు వాస్తవం కాదని ఇప్పటికే తేలింది. గడిచిన 8 ఏళ్ల కాలంలో పెరిగిన పన్నుల భారం మూలంగా పెట్రోల్ ధరలు హద్దు లేకుండా పెరిగినట్టు అందరికీ అర్థమవుతోంది. పెట్రో భారం మూలంగా ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయాయి. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయి, ప్రజలంతా అవస్థల్లో ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఏటా కేంద్రానికి సుమారు మూడున్నర లక్షల కోట్ల ఆదాయం పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా లభిస్తుంటే ప్రజలు మాత్రం ఈ భారం మోయాలేమనే బెంగతో కనిపిస్తున్నారు.
పెట్రోల్ ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇప్పటికే అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే పెట్రోల్ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలకు లభించే ఆదాయంలో భారీగా కోత పడుతుందన్నది వాస్తవం. జీఎస్టీ తర్వాత కేవలం పెట్రో, మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయమే అనేక రాష్ట్రాలకు ఆధారంగా మారింది. ఇప్పుడు అందులో పెట్రోల్ ఉత్పత్తులను కూడా జీఎస్టీ ద్వారా కేంద్రమే పన్నులు వసూలు చేసే ప్రక్రియ చేపడితే ఇక రాష్ట్రాలు ఆర్థికంగా మరింత చితికిపోతాయనే అభ్యంతరాలున్నాయి. దాంతో కొన్ని రాష్ట్రాల నుంచి జీఎస్టీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : మమత నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరిస్తుందట..!
కేంద్రం మాత్రం రాష్ట్రాలు అంగీకరించడం లేదు కాబట్టి తాము జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన అనేక చట్టాల పట్ల రాష్ట్రాల నుంచి అభ్యంతరాలున్నాయి. ఉదాహరణకు వ్యవసాయ చట్టాల విషయంలో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీలలోనే తీర్మానాలు చేశారు. ఇప్పటికే 8 రాష్ట్రాల అసెంబ్లీలు ఆ మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు ఆమోదించాయి. రైతులు ఏడాది కాలంగా రోడ్డు మీద నిరసనలు సాగిస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. చట్టాలను పునస్సమీక్ష యత్నం జరగడం లేదు. అంటే రాష్ట్రాల అభ్యంతరాలతో సంబంధం లేకుండానే కేంద్రం వ్యవసాయ చట్టాల విషయంలో వ్యవహరిస్తున్న సంగతి అందరికీ అర్థమవుతోంది.
కానీ పెట్రోల్ పన్నుల విషయంలో మాత్రం రాష్ట్రాల నుంచి అంగీకారం లేదని చెప్పడం విస్మయకరంగా ఉంది. రాష్ట్రాలను కూడా గమనిస్తే ప్రస్తుతం అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. అంటే బీజేపీకి చెందిన రాష్ట్రాలు అంగీకరించడం లేదా.. లేక విధానపరంగా బీజేపీ సిద్ధంగా లేదా అనే సందేహాలు ఎవరికైనా ఇట్టే కలుగుతాయి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం నెపం రాష్ట్రాల మీదకు నెట్టేసి లక్షల కోట్ల పన్నుల ఆదాయం పెట్రోల్ ద్వారా సంపాదించే ప్రక్రియను కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నట్టు మరోసారి రూఢీ అయ్యింది. సెంచరీలు దాటి ముందుకు సాగుతున్న పెట్రో ధరల భారం ప్రజలు భరించాల్సిందేననే సంకేతాలు ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది.
Also Read : నేడు జీఎస్టీ మండలి భేటీ : పెట్రోలు, డీజిల్ పై కీలక నిర్ణయం?