iDreamPost
android-app
ios-app

Petrol – పెట్రో పన్నులు మళ్లీ పెరుగుతాయా, హడలెత్తిస్తున్న అంతర్జాతీయ మార్కెట్

  • Published Nov 05, 2021 | 2:26 AM Updated Updated Mar 11, 2022 | 10:36 PM
Petrol – పెట్రో పన్నులు మళ్లీ పెరుగుతాయా, హడలెత్తిస్తున్న అంతర్జాతీయ మార్కెట్

గడిచిన రెండేళ్లుగా పెట్రో భారం తీవ్రంగా పడింది. ప్రజలు గగ్గోలు పెట్టారు. కేవలం 2021 క్యాలెండర్ సంవత్సరంలోనే పెట్రోల్ లీటర్ కి రూ. 28 పెరిగింది. ఈ ధరాఘాతం తట్టుకోలేక తల్లడిల్లిన ప్రజలు తీవ్రంగా వేదన పడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నేతలు వింత వాదనలు చేశారు. వ్యాక్సిన్లు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి పెట్రో భారం తప్పదని కొందరు, అభివృద్ధికి నిధులు అవసరం కాబట్టి ధరలు పెంచాల్సిందేనని ఇంకొందరు, కాంగ్రెస్ ప్రభత్వం పెట్రో బాండ్లు తీర్చడానికి ధరలు పెంచామని మరికొందరు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. మా చేతుల్లో ఏమీ లేదని చాలామంది నేతలు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పన్నులు తగ్గిస్తూ చేసిన ప్రకటన ద్వారా ఇన్నాళ్లుగా తామే చేసిన వాదనల్లో వాస్తవం లేదని బీజేపీ అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచారం అవాస్తవమని చెప్పకనే చెప్పినట్టయ్యింది.

మోదీ అధికారంలోకి వచ్చే నాటికి అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ బ్యారెల్ కి 108 డాలర్లు. 2014 నాటికి లీటర్ పెట్రోల్ మీద ఉన్న ఎక్సైజ్ ట్యాక్స్ రూ. 9.48 పైసలు. దాంతో అప్పట్లో లీటర్ పెట్రోల్ రూ. 64 గా ఉండేది. కానీ మోదీ హయాంలో పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం పెంచారు. ఎంతగా అంటే మొన్నటి వరకూ అది లీటర్ కి రూ. 32.85 పైసలుగా ఉండేది. ఇప్పుడు 5 రూపాయాలు తగ్గిన తర్వాత కూడా ఇంకా సుమారు రూ. 28గా ఉంది. అంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ సుంకం 300 శాతం పెంచినట్టు ఈ వాస్తవ లెక్కలు చెబుతున్నాయి. అదే డీజిల్ పై అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. లీటర్ కి రూ. 3.75 పైసలుగా ఉన్న ఎక్సైజ్ సుంకం ఇప్పుడు 10 రూపాయలు తగ్గించిన తర్వాత సుమారు రూ. 21గా ఉంది. అంటే ఎన్ని రెట్లు పెంచారో అర్థం చేసుకోవచ్చు.

తాజా ఉప ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగబోయే కీలక రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పన్నుల శాతం తగ్గించిందనడం నిస్సందేహం. రాజకీయంగా ఏ పార్టీకయినా తమ ప్రయోజనాలే కీలకం గనుక అలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా నేరం కాదు. ప్రజలకు ఏదో మేరకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఆహ్వానించాల్సిన విషయం. అయితే అదే సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రోజువారీ వ్యవహారాల్లో మార్పులు తప్పవనే అభిప్రాయం మార్కెట్ వర్గాల నుంచి వస్తోంది. ఇప్పటికే రోజూ ఏదో మేరకు పెంచుకుంటూ పోతున్న పెట్రో కంపెనీలు ఇప్పుడు కూడా తమ విధానం కొనసాగించే అవకాశం ఉంది. అందులోనూ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మళ్లీ పెరుగుతోంది. ఇప్పటికే అది 85 డాలర్లుగా ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 100 డాలర్లు చేరవచ్చని ఓ అంచనా. అదే జరిగితే దేశంలో పెట్రో ఉత్పత్తుల మీద ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం లేకపోలేదు.

రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ శాతం కూడా తగ్గించాలని బీజేపీ వాదిస్తోంది. తాము అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఈ మేరకు మార్పులు చేస్తున్నారు. అందులోనూ ఎన్నికలున్న యూపీ, గోవాలో ఎక్కువగా తగ్గిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో నామమాత్రంగా మాత్రమే తగ్గుదలకు సిద్ధమవుతోంది. అదే సమయంలో కేంద్రం పన్నులు విధించిన తర్వాత ఉండే లీటర్ పెట్రోల్ ధరల మీద వ్యాట్ వసూలు చేస్తారు కాబట్టి ప్రస్తుతం కేంద్రం రూ 5 తగ్గించగానే రాష్ట్రం పన్నుల వాటా కోసం ఒక రూపాయి వరకూ తగ్గుతుంది. దానిని ఇంకా తగ్గించాలని బీజేపీ వాదిస్తోంది. కానీ వాస్తవంగా రాష్ట్రాల పన్నులకు అవకాశం లేకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకంలో మార్పులు తీసుకురావడం, లేదా జీఎస్టీలో చేర్చడం వంటి చర్యల ద్వారా మరింత ఊరట దక్కుతుంది. కానీ దానికి మోదీ సర్కారు ముందుకొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రోజువారీ ధరల మార్పులో పెట్రో రేట్లు పెరుగుదల అనివార్యం అనే అభిప్రాయం వినిపిస్తోంది.